ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం ఉర్రూతలూగించిన నాటి కాలంలో నక్సల్స్ సరళ అనే అమాయకురాలిని పోలీసు ఇన్ పార్మర్ అనే పేరుతో హింసించి హత్య చేసిన నాటి సంఘటనగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్.. కానీ నిజాలు వేరు అంటూ ఫేస్ బుక్ లో నాటి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మంచి కంటి నరేందర్ పోస్ట్ చేశారు.
– అడ్మిన్
సరళ హత్య వార్త, కథనాలు సేకరించిన మంచి కంటి నరేందర్ అనుభవం..
విరాట పర్వం – తూము సరళ – ఓ జ్ఞాపకం
మంచి కంటి నరేందర్, సినియర్ జర్నలిస్ట్
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
విరాట పర్వం సినిమా లో తూము సరళ( ఖమ్మం) పాత్ర ఉందని సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 1990 ప్రాంతంలో సరళ ను నక్సల్స్ హత్య చేసిన సంఘటన వివరాలు సోషల్ మీడియాలో పెట్టుమని నాతో పని చేసిన జర్నలిస్టులు,( సరళ ను నక్సల్స్ పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాల్చి చంపిన దాన్ని మొదట ఆంధ్రజ్యోతి లో నేనే వ్రాశాను) నేను ఫేస్ బుక్ లో పోస్టులు రాసే ఓపిక, తీరిక లేదు అని చెప్పిన వినక మా ఊళ్ళో ఉన్న యువ కవి, చిత్రకారుడు సాయి నన్ను పోస్ట్ పెట్టమని పదే ప దే అన్నా డు( మేము ఇద్దరమే మా ఊళ్ళో వామపక్ష రాజాకీయాలు, మత ప్రమాదం, సాహిత్యం, వర్ధమాన రాజకీయాలు గూర్చి మాట్లాడు కొంటాం నా కంటే వయస్సు లో ఇరవై ఏళ్ల చిన్నోడు, చాలా మందికి వీడికి వాడికి ఎమ్ దోస్తానా.. అని మమ్మల్ని అనుమానం తో చూస్తారు, కానీ మా పిచ్చి మాకు ఉంది)
1990 దశకం లో అనుకుంటా అప్పుడు ఆంధ్రజ్యోతికి దర్పల్లి నుండి కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాను. జూన్, జులై మాసం మధ్య లో ఓ సారీ నిజామాబాద్ కుమార్ గల్లీ లో ఆంధ్రజ్యోతి ఆఫీస్ కు వార్తలు రాయడానికి వెళ్ళాను. మధ్యాన్నం టైం లో అప్పటి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సిర్ప గంగాధర్ సర్
” నరేందర్ నక్సల్స్ ఎవరో అమ్మాయి ని హత్య చేశారు. ఇది ఎక్కడ జరిగిందో? ఓ స్టోరీ రాయు’’ ఆదేశాలు జారీ చేశారు మా స్టాప్ రిపోర్టర్ సిర్ప గంగాథర్.
‘‘సార్.. తప్పకుండా..’’ అన్నాను.
‘‘అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి శంకర్ @ దొంత మార్కండేయ ఓ ప్రకటన జారీ చేశారు, ఆ ప్రకటన లో పోలిసులు కొత్త గా ఆడ వాళ్ళను ఇన్ఫార్మర్లు గా తయారు చేశారు, మేము అందులో ఒక లేడీ ఇంఫార్మర్ ను పట్టుకొని ప్రజా కోర్టు లో శిక్షించామ్ అని సిర్నాపల్లి దళం లెట్టర్ పాడ్ పై శంకర్ ప్రకటన చేశాడు.’’ అన్నాడు స్టాఫ్ రిపోర్టర్ గంగాధర్ సార్.
‘‘ సరే సార్..’’ చెప్పి ఇంటికి బయలు దేరాను.
బస్ కోసం నిరిక్షిస్తున్న నాకు నక్సల్స్ పోలీస్ ఇన్ పార్మర్ పేరిట హత్య చేసిన ఆంశం చుట్టూ ఆలోచనలు తిరుగుతున్నాయి.
‘‘శంకరన్న జిల్లా కమిటీ పేరుతో గల లెటర్ హెడ్ పై ప్రకటన జారీ చేయాలి కానీ ఓ దళం లెట్టర్ హెడ్ పై చేయడం ఏంటి..? ’’
నాలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనలతో బస్ ఎక్కి ఇండల్వాయి లో దిగాను. రాత్రి అక్కడి నుండి ఏదయినా టూ వీలర్ దొరికితే తొందర గా ఇంటికి పోవచ్చునని అక్కడికి చేరుకున్నాను. బస్టాండ్ లో అటు ఇటూ తిరుగుతున్నాను. రాత్రి 8 గంటల టైం లో అప్పటి డొంకల్ సర్పంచ్ నారాయణ్ రెడ్డి కలిసి దగ్గరకు వచ్చాడు.
‘‘ఏమి నరేందర్ ఎటు పోయావ్..? గింత రాత్రైంది.’’ నన్ను ప్రశ్నించాడు. సర హత్య వివరాలు తెలుసుకోవాలనే మనసులో మెదులుతున్న ఆలోచనకు పుల్ స్టాప్ పెట్టాను.
డొంకల్ గ్రామం.. అప్పుడు, ఇప్పుడు కూడా పూర్తి గా అడవి ప్రాంతం లో ఉంటుంది. సర్పంచ్ దగ్గర సరళ హత్య వివరాలు రాబాట్టాలని డిటెక్టివ్ బుర్రతో ప్రశ్నించాను.
‘‘ సర్పంచ్ సాబ్ మీ జంగల్ లొనే ఆ పిల్లా ను అన్నలు చంపి నారాట ఒక మాట చెప్పక పోతివి..’’ అన్నాను.
నా ప్రశ్నకు సర్పంచ్ కొంత గందరగోళానికి గురై వెంటనే నన్ను పక్కకు తీసుక పోయిండు.
‘‘అయ్యో.. ఆ అమ్మాయిని చంపుతారు అనుకుంటే నేను ఆ పిల్లను వాళ్లకు అప్పగియ్యాక పోతుంటిని..’’ బాధతో అన్నాడు సర్పంచ్.
అతని సమాధానం వినడంతో నాలో ఎక్కడ లేని హుషారు వచ్చింది. సరళ హత్య వివరాలు సేకరించి ఇతర విలేకరులకు భిన్నంగా స్టోరి ఇవ్వాలనుకున్నాను.
మాటల సందర్భంలో సర్పంచ్ నారాయణ్ రెడ్డి ద్వారా అన్ని వివరాలు తెలుసుకున్నాను. సరళ హత్య కు మొదటి సాక్షి ఆ సర్పంచే…
సర్పంచ్ నారాయణరెడ్డి చెప్పిన విషయం మనసు లో బాగా నాటక పోయింది. మేము ఇద్దరం మాట్లాడుతుండగా డొంకల్ బస్ రాగానే నేను పోతున్నాను విలేకరి సర్ అంటూ నారాయణరెడ్డి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయాడు. మనసు లో ఏదో అలజడి. ఇంత ఘోరం నక్సల్స్ ఎలా చేశారబ్బా? అని నాకు నేను ప్రశ్నించుకుంటుండగా నైట్ హాల్ట్ వాల్గోట్- దుబ్బాక బస్ ఇందల్వాయి బస్ స్టాండ్ లో కి రాగానే నేను బస్ ఎక్కి మా ఊరు ఐనా దర్పల్లి( మండల కేంద్రం) కి వెళ్ళిపోయాను. ఇంటికి చేరుకున్నా కూడా నారాయణ్ రెడ్డి మాటలే ఇంకా వినిపిస్తున్నాయి.
మరుసటి ఉదయమే 5 గంటల కే లేచి పాత బస్ స్టాండ్ లో బాలాజీ హోటల్ లో చాయ్ తాగి ఈనాడు, ఆంధ్రజ్యోతి , భూమి, ప్రభ పేపర్ల కోసం ఎదురు చూస్తున్నాను( అప్పుడు పేపర్లు బస్ ద్వారానే పంపే వారు) 6 గంట ల ప్రాంతం లో బస్ రాగానే నేను బస్ లో నుంచి పేపర్ పార్శీళ్ళు తీసి అప్పటి పేపర్ ఏజెంట్ క్యాదరి రామన్న ఇంటికి తీసుకెళ్లి నేనే అన్ని పేపర్ పార్శీళ్ళు విప్పి సరళ హత్య పై ఏమైనా వార్తలు వచ్చాయా? అని పేపర్లు అన్ని తిరిగేశాను. ఏదో పేపర్లో పోలీస్ ఇన్ఫార్మర్ ల లో మహిళలా? అంటూ ఫాలోఅప్ స్టోరీ వచ్చింది. ఇది వాస్తవం కాదు కదా! గబ గబా ఇంటికి వెళ్లి స్నానం చేసి బయటకు వెళుతుండగా మా అమ్మమ్మ ” ఒరేయ్ యాడికి మునుగు తున్నావ్” పొద్దికి వచ్చుడు పొద్దుగాళ్ల ఊరుకుడు” అంటూ తిట్ల దండకం అందుకుంది. . . . …….. . . ……
అమ్మమ్మ మాటలను పట్టించుకోక సంఘటన కు ప్రధాన కారణమైన సిర్నపల్లి గ్రామానికి వెళ్లాలని అనుకున్నాను, మా ఊరి నుంచి సిర్నపల్లి కి డైరెక్ట్ బస్ లేదు. వయా ఇందల్వాయి , గన్నారం మీదు గా వెళ్ళాలి. వెంటనే అప్పటి దర్పల్లి మండల ఎంపిపి సత్తెమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె భర్త కిష్టయ్య సేటు ను సేటు జర స్కూటర్ ఇయ్యు గీడి దాకా పోయి వస్తాష అనగానే సేటు బండి ఇచ్చాడు. వెంటనే బండి మీద సిర్ణపల్లి కి బయలు దేరాను. మధ్య లో గన్నారం గ్రామం లో ఆగాను ఏమైనా అదనపు సమాచారం దొరుకుందేమో అన్న ఆలోచన తో హోటల్ దగ్గర ఆగాను. కొంచెం ఐనా తరువాత అటుగా వెళుతున్న వెంకటేష్( బీడీ ఖరఖాన టెకేదార్) నన్ను చూసి దగ్గరకి వచ్చి చాయ్ తాగి పిచ్చి ” అన్న ఏమైనా అయిందా? ఇంత పొద్దున్నే బయలు దేరావ్ అంటూ మాటలు కలిపాడు ఏమి లేదు వెంకన్న మన సైడ్ మొన్న మన సిర్నాపల్లి దళం ఎవరో లేడి ఇన్ఫార్మార్ పేరిట చంపారట ఆమె అల్లాంటిది కాదు అని తెలుస్తుంది.. అని అనగానే అయ్యో అన్న మన శంకరన్న( అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి) వచ్చే వరకు సిర్ణపల్లి లోనే మన వాళ్ళు ఉంచారు. అనగానే వెంటనే సిర్ణపల్లి కి వెళ్లి రైల్వే స్టేషన్ వద్ద స్తూపం వద్ద ఆగాను. ఎవరు తెలిసిన వారు కనిపించక పోయే సరికి ఊళ్ళో కి వెళ్ళాను.
అక్కడ చాలా సీనియర్ మిలిటెంట్ అయిన చాకలి సాయిలు ను కలిసి సరళ హత్య విషయాన్ని ప్రస్తావించాను. అన్న ఆమెను పార్టీ చంపవలసింది కాదు కొన్ని రోజుల పాటు చెక్ చేయవలసింది అంటూ జరిగిన స్టోరీ నాకు చెప్ప సాగాడు. శంకరన్న భార్య జ్యోతి@ స్వరూప( ఈమె స్వ గ్రామం నల్లవెల్లి) మదనపల్లి ఎన్కౌంటర్ లో చనిపోవడం తో అప్పట్లో ఆ వార్త ఉమ్మడి రాష్ట్రం సంచలనం సృష్టించింది. ఆమె ఎన్కౌంటర్ కు నిరసన గా నక్సల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. జ్యోతి పీపుల్స్ వార్ ప్రస్థానం పై అన్ని ప్రధాన పత్రికల్లో సాహసాలపై స్టోరీ లు వచ్చాయి. ఈ పిల్ల అవి చదివి ఆగమై ఇటు వచ్చింది ..అని సాయన్నచెప్పాడు. ఖమ్మం నుండి రైల్ ద్వారా మన జిల్లాకు వచ్చిందని ఆయన అన్నాడు. లోలం- మల్లా పూర్ కు చెందిన పార్టీ సానుభూతి పరులు దళం కాంటాక్ట్ ఈ సరళ కు ఇవ్వ మని మనకు అప్పగించారు అని సాయన్న మాటల్లో చెప్పాడు. సిర్నాపల్లి గ్రామం లో దళం కాంటాక్ట్ దొరికే వరకు ఉన్న సరళ ఉన్నన్ని రోజులు ప్రజలు, మిలిటెంట్లు అందరితో కలిసి మెలిసి ఉన్నట్లు గ్రామస్థులు చెప్పారు. గ్రామంలోని దొమ్మరి గంగారాం ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరిగితే కూడా విందుకు వచ్చినవారందరికి సరళ నే స్వయం వడ్డించినట్లు గ్రామస్థులు తెలిపారు. సాధారణంగా అప్పట్లో దళం కాంటాక్ట్ దొరకాలంటే కొంత టైం పట్టేది. సరళ ఊళ్ళో స్వేచ్ఛ గా తిరిగే సరికి ఎవరో అమ్మాయి అన్నల్లో కలుస్తానని మన ఊరికి వచ్చిందని ..ఊరు అందరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
ఈ విషయం లోకల్ మిటిటెంట్ల లో కలవరం పుట్టించింది. పోలీసులకు తెలిస్తే తమకు ప్రమాదమని భావించిన మిలిటెంట్లు అప్పటి సిర్నపల్లి దళ నాయకుడు గంగన్న కు ఈ విషయాన్ని చేర వేశారు. సరళ సిర్నాపల్లి లో వున్నప్పుడు తన గురించి వెతకవద్దని, తాను క్షేమం గా ఉన్నట్లు తల్లి తండ్రులకు ఉత్తరాలు రాసినట్లు గ్రామస్థులు తెలిపారు. చదువు రాని కొంత మంది మిలిటెంట్లు సరళ పోలీసులకు ఉత్తరాలు రాసినట్లు అనుమానాన్ని పార్టీ ముందు ఉంచారు. ఎందుకైనా మంచిదని దళ నాయకుడు గంగన్న ఈ విషయాన్ని జిల్లా కమిటి దృష్టికి, కార్య దర్శి శంకరన్న దృష్టి కి తీసుకు పోతాను.. అప్పటి వరకు సరళ ను డొంకల్ సర్పంచ్ నారాయణ్ రెడ్డి ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశారు.
వారం పది రోజుల తరువాత అప్పటికి శంకరన్న సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పుడే శంకరన్న కు పీపుల్స్ వార్ లో ప్రమోషన్ వచ్చింది. శంకరన్న ను మురళి పేరుతో రాష్ట్ర కమిటీ ఉత్తర తెలంగాణ లో శంకరన్న ను సభ్యున్ని చేసింది. అప్పటికి పలు రాష్ట్రాల్లో పీపుల్స్ వార్ వునికి ఉన్నప్పటికి తెలంగాణ లో నక్సల్స్ మూవ్మెంట్ ఉవ్వెత్తున ఉంది. శంకరన్న వచ్చిన రోజే వేకువ జామునే నారాయణ్ రెడ్డి కి కబురు పంపారు నక్సల్స్. సరళ ను తీసుకొని సిర్నాపల్లి గ్రామ పరిధి లో ” రామ్ సాగర్” తాండ అటవీ ప్రాంతానికి రావాలని వారు ఆదేశాలు జారీ చేయడంతో నారాయణ్ రెడ్డి సరళ ను దళానికి అప్పగించాడు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని వారు చెప్పడం తో నారాయణ్ రెడ్డి వెను తిరిగాడు. నారాయణ్ రెడ్డి ఇంట్లో సరళ ఉన్నన్ని రోజులు ఉల్లాసంగా ఉన్నట్లు సర్పంచ్ చెప్పాడు.
సరళ ను రామ్ సాగర్ తాండ అటవీ ప్రాంతం లో శంకరన్న విచారిస్తున్నప్పుడు అప్పటి జిల్లా కమిటీ సభ్యుడు హరి భూషణ్, గంగన్న,.మరో సభ్యుడు ప్రభాకర్( రామడుగు ప్రాజెక్టు) ఉన్నట్లు తెలిసింది. నక్సల్స్ విచారణ లో సరళ ఎంతకు కూడా తాను పోలీస్ ఇన్ఫార్మర్ కాదని, తాను అన్నల్లో చేరడానికి వచ్చానని నవ్వుతూ చెప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. . …సరళ ను బయ పెట్టడానికి అక్కడే ఉన్నచెట్టుకు కట్టేసి కొట్టి శంకరన్న తుపాకీ తో భయపెట్టడానికి ప్రయత్నించగా అది మిస్ ఫైర్ అయినట్లు మిలిటెంట్లు చెప్పారు. ఊహించని సంఘటన జరగడం తో శంకరన్న వెంటనే శవాన్ని సిర్నాపల్లి మార్నింగ్ బస్ లో వేసి , నిజామాబాద్ బస్ స్టాండ్ లో పోలీస్ లకు అప్పగించాలని మిలిటెంట్లు గ్రామస్థులకు చెప్పడం తో గ్రామస్థులు ససే మీరా అన్నారు. అన్న మీరు మా ఊరి బస్లో పడేసి పోతారు. ఆ తరువాత పోలీసులు వచ్చి మా సావు చేస్తారు అని గ్రామస్థులు ఎదురు తిరగడం తో నక్సల్స్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అక్కడే సరళ మృత దేహానికి అంత్య క్రియలు చేయాలని శంకరన్న, మిగితా నక్సల్స్ నిర్ణయించారు. అది వర్షాకాలం కావడం తో అడవంతా పచ్చి గా వుంది. ఎండిన కట్టెలు ఎక్కడా దొరకక పోవడంతో, సిర్నాపల్లి, డొంకల్ గ్రామాల నుండి నక్సల్స్ గ్యాస్ నూనె తెప్పించి సరళ భౌతిక కాయానికి నిప్పు అంటించడం తో సరళ కథ అలా ముగిసింది.
అప్పటికి శంకరన్నంటే ఉమ్మడినిజామాబాద్ జిల్లా లో హడల్, శంకరన్న తన తప్పును కప్పిపుచుకోవడానికి అప్పటి జిల్లా జర్నలిస్టుల నాయకుడు, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ రేపాక్ జైపాల్ రెడ్డి సర్ కు లేఖ రాసి .. మేము లేడి ఇన్ఫార్మర్ కు శిక్ష వేశాము.. దీనికి మీరు హై లెట్ చేయాలని లేఖ రాశారు. మొత్తం స్టొరీ తెలుసుకొన్న అదే రోజు సాయంత్రం నిజామాబాద్ ఆంద్ర జ్యోతి ఆఫీస్ కు వెళ్లి వార్త ఇవ్వాలని వెళ్ళాను. మరుసటి రోజు ఆంధ్ర జ్యోతి లో మెయిన్ పేపర్ లో బాక్స్ కట్టి” మురళి సమక్షం లో నే సరళ హత్య అని వేశారు. ఇది సంచలనం సృష్టించింది. అప్పటికి పీపుల్స్ వార్ కు జనశక్తి నక్సల్స్ కు సిరిసిల్ల ఏరియాలో నిత్యం యుద్ధమే నడుస్తుంది. జనశక్తి ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో శంకరన్న, పీపుల్స్ వార్ ను విమర్శిస్తూ వాళ్ళు వాల్ రైటింగ్ రాశారు.
అప్పుడే కొత్తగా మా జిల్లా ఎస్ పి గా మహేందర్ రెడ్డి ( ఇప్పటి డిజిపి) చార్జీ తీసుకున్నారు. వెంటనే పోలీసులు నక్సల్స్ చర్యను ఎండ గడుతూ కర పత్రాలు ఊరూరా వేశారు. రాష్ట్ర వ్యాప్తం గా సరళ హత్య ను పౌరహక్కుల సంఘాలు, విద్యార్థి, మహిళ సంఘాలు ఖండిచడమే కాక నిరసన ప్రోగ్రామ్స్ చేశాయి. కొద్దీ రోజులకే పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. శంకరన్న ది దుందుడుకు చర్య గా అభివర్ణించారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. జనవరి 27 న నిజామాబాద్ లోని హౌజింగ్ బోర్డ్ లో జరిగిన కాల్పుల్లోశంకర్@ దొంత మార్కండేయ చనిపోయినట్లు ఇదే మహేందర్ ప్రకటించారు
By Manchikanti Narendar
