వేణు ఊడుగుల. కొత్త దర్శకుడు. కొత్తదనం కోరుకునే దర్శకుడు. తనదైన మార్కు వేసుకునే తపన గలవాడు. నీది నాది ఒకే కథ సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. భిన్నమైన కథతో అందరినీ ఆకట్టుకున్నాడు. దశాబ్దాల పాటు రాజ్యమేలిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఓ చెత్త అని తగులబెట్టిన గట్స్ ఉన్నవాడు. ఉన్నదున్నట్టు చెప్పి మనిషి విలువను చెప్పే ప్రయత్నం చేసి సక్సెసయినవాడు.
కానీ రెండో ఎటెంప్ట్‌లో ఎంచకున్న కథ బోల్తా కొట్టించింది. మాములుగా డైరెక్టర్లకు ద్వితీయ విఘ్నాలుంటాయని అంటారు. ఇక్కడ వేణుకూ తప్పలేదది. నక్సలైట్ల నేపథ్యం ఉన్న కథను ఎంచుకోవడయే వేణు చేసిన మొదటి తప్పు. అది యదార్థగాదే కావచ్చు. కానీ చిన్న కథ. అందరికీ యాప్ట్ కాని కథ. ఈ తరానికి అసలే నెత్తికెక్కని కథనం. ఆచార్య కూడా అక్కడే బోల్తా కొట్టింది. కథ ఎంపిక లో లోపంతో కథనమూ చాలా బోర్‌గా సాగింది. క్లైమాక్స్‌లో తప్ప ఎక్కడా సీన్ల స్పీడ్…. మలుపులు కనిపించలేదు పెద్దగా. సాయి పల్లవి నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. కానీ ఆ పాత్ర పరిపక్వత విషయంలో దర్శకుడు తడబడ్డాడు.
ప్రేమకు, విప్లవానికి మధ్య ముడిపెట్టి.. సెంటిమెంట్ కూడా కలగలిపి ఏదో చేద్దామనుకున్నాడు కానీ అది పండలేదు. కుదరలేదు. సెట్ కాలేదు. పంటి కింద రాళ్లలా పాటలు. కోవర్టు పేరుతో సాయి పల్లవిని అపార్థం చేసుకుని చివరకు చంపే సన్నివేశం, రానా డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ కథకు సాయిపల్లవి, రానా ఒప్పుకోవడం నిజంగా గ్రేటే. వారిని ఒప్పించడంలో దర్శకుడు సక్సెసయ్యాడు. కానీ సినిమా వాళ్లనుకున్న విజయం సాధించడం కష్టం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఇలాంటి ప్రయోగాలు తీయడం మెచ్చుకోదగిందే. ఈ దర్శకుడి నుంచి కొత్త కథలు వస్తాయనేది స్పష్టం.
