యూట్యూబర్ల పని పట్టే విషయంలో దూకుడుగా వ్యవహరించిన ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు మరింత ఊమతిచ్చినట్టే అవుతున్నది. తెలంగాణలో ఎంత అణచాలని చూస్తే అంతా పైకి ఎగదన్ని వస్తారు. కాకపోతే కొంతకాలం నిశ్శబ్దం ఉంటుండొచ్చు. కానీ సమయం కోసం చూస్తారు. ఇప్పుడు ఇదే జరుగుతున్నది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే నెపంతో యూట్యూబర్లను, నకిలీ జర్నలిస్టులంటూ ముద్ర వేసి అరెస్టులు చేసి భయానక పరిస్థితులను ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఈ రోజు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. సీనియర్ జర్నలిస్టులూ సంఘీభావం తెలిపారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను తూర్పారబట్టారు. అసలు అవి లొంగిపోయిన ప్రతికలని మండిపడ్డారు. పనిలో పని అల్లం నారాయణను అర్సుకున్నారు.
వాస్తవానికి ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేమీ లేదు. నష్టం తప్ప. నోటీసులిచ్చి, వార్నింగ్ ఇస్తే సరిపోయేది. అరెస్టులతో హడలెత్తించడం, లాఠీలకు పనిచెప్పడం లాంటి చర్యలు వ్యతిరేకతను పెంచేవే. ఈ దూకుడు ఇలా కొనసాగుతున్న సందర్భంలోనే అటు వనమా రాఘవ దారుణ ఉదంతం బయటకు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి మీన మేశాలు లెక్కించడం… కాకతాళీయంగానే జరిగినా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. టీఆరెస్ సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లు ఎన్నిసార్లు గొంతు చించుకొని మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఒర్రి ఒర్రి.. దుమ్మెత్తిపోసినా చలనం లేదు. కానీ వేరే సోషల్ మీడియా వాళ్ల మీద మాత్రం బాగా కసి మీద ఉంది ప్రభుత్వం. ఇలా సమయం చూసి స్పాట్ పెట్టింది. కానీ ఈ చర్యలను కొంత మంది హార్డ్ కోర్ టీఆరెస్ శ్రేణులు తప్ప ఎవరూ హర్షించడం లేదు.