బియ్యం రాజ‌కీయం గ‌ల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొన‌బోమ‌ని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాల‌పై కేసీఆర్ సంత‌కం కూడా చేశాడు. త‌నే ఆ విష‌యాన్ని స్వ‌యంగా మొన్న ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. త‌న మెడ‌పై క‌త్తిపెట్టి మ‌రీ సంతకం పెట్టించార‌న్నాడు. అందుకే ఈ యాసంగిలో వ‌రి వేయొద్ద‌ని, ఆగ‌మ‌వుతార‌ని, ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌కు వెళ్లాల‌ని చెబుతూ వ‌స్తున్నారు.

యాసంగిలో వ‌రి వేయొద్ద‌న్న‌ది కేంద్రం కాబ‌ట్టి.. కేంద్రంలో ఉన్న‌ది బీజేపీ కాబ‌ట్టి.. దీన్ని దోషిగా నిల‌బెట్టాల‌ని టీఆరెస్ భావించింది. రైతుల వ‌ద్ద త‌మ ప‌ర‌ప‌తి పోవ‌ద్ద‌నేది దీని భావ‌న‌. అందుకే నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. మ‌రోవైపు వానాకాలం సీజ‌న్‌కి సంబంధించిన ధాన్యం కూడా మొత్త తీసుకోవ‌డం లేద‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వ అభియోగం. దీనిపై నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ క్లారిటీ ఇచ్చాడు. రా రైస్ ఎంతైనా తీసుకుంటామ‌న్నాడు. బాయిల్డ్ అయితే ముట్టేదే లేద‌న్నాడు. కాబ‌ట్టి ఖుల్లం ఖుల్లాగా కేంద్రం త‌న వైఖ‌రిని ప్ర‌క‌టించింది.

మ‌రి యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ మేం ఏం చేసుకోవాలె..? అన్న‌ది రాష్ట్రం స‌మ‌స్య‌. రైతులు వినేలా లేరు. చాలా మంది ఈ సీజ‌న్‌లో కూడా వ‌రి వైపే మొగ్గు చూపుతున్నారు. వేరే ఆల్ట‌ర్నేట్ క‌నిపించ‌డం లేదు వారికి. ఇదే ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద త‌ల‌నొప్పిగా మార‌నున్న‌ది. అందుకే ఇప్పుడు టీఆరెస్ రెండు వైపులా ఆత్మ‌సంర‌క్ష‌ణ చేసుకుంటున్న‌ది. ఒక‌టి… కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్ట‌డం.. ఇందులో స‌క్సెస‌య్యింది. రెండోది.. రైతుల నుంచి ఈ సారి వ‌రి వేయ‌కుండా చూసుకోవ‌డం… అందుకు కావాల్సిన ఏర్పాట్ల‌న్నీ చేసింది. అవ‌గాహ‌న పేరుతో విస్తృత ప్ర‌చారం చేసింది. స్వ‌యంగా కేసీఆరే యాసింగి వ‌డ్లు కిలో కూడా కొనం.. కొనుగోలు కేంద్రం పెట్టం అని చెప్పేశాడు.

ఇదిలా ఉండ‌గానే ఎవ‌రి రాజ‌కీయాలు వారు చేస్తున్నారు. ఇప్పుడు రైతు ప‌రిస్థితే అగ‌మ్యగోచ‌రంగా ఉంది. యాసంగిలో వ‌రి వేస్తే ఎలా… వ‌రి కాక‌పోతే ఏది వెయ్యాలి..? వ‌రి వేస్తే కేంద్రం సాకుతో రాష్ట్రం కొన‌దు. రైస్ మిల్ల‌ర్లు కొంటారా..? దొరికింది చాన్స్ అని మిల్ల‌ర్లు కూడా అగ్వ‌స‌గ్వ‌కు ధాన్యం కొంటే న‌ష్టానికి అమ్మేసుకోవాలా..? అస‌లు పెట్టుబ‌డైనా వ‌స్తుందా..? ఇలా రైతుల ముఖాల నిండా ప్ర‌శ్నార్థ‌కాలె. ఇవి ఇట రాష్ట్రానికి ప‌ట్ట‌వు. అటు కేంద్రానికి ప‌ట్ట‌వు. ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు వారికి. త‌గ్గేదేలే అంటున్నారు. రైతుల‌కు మాత్రం సినిమా చూపిస్తున్నారు.

You missed