హుజురాబాద్ లో టీఆరెస్ ఓడితే కేసీఆర్ దిగొస్తాడనుకున్నారు. మంచి గుణపాఠం నేర్పినట్టవుతుందని భావించారు. తెలంగాణవాదులు, టీఆరెస్ లీడర్లు, ప్రతిపక్షాలు అంతా ఇదే అనుకున్నారు. కోరుకున్నారు. అంతా అనుకున్నట్టే అక్కడ ఈటల రాజేందర్ గెలిచాడు. ఎన్ని కోట్లు కుమ్మరించినా గెల్లు శ్రీనివాస్ ఓడిపోయాడు.
బాగైందనుకున్నారు. చూడు.. కేసీఆర్ ఎలా గిలగిలాకొట్టుకుంటాడో అని ఎదురుచూశారు. ఉద్యమ కారులు తడాఖా ఏందో తెలిసింది కదా.. ఇకనైనా మారుతాడు అని కూడా అనుకున్నారు. కానీ ఆయన కేసీఆర్. అందరూ అనుకునేదానికి భిన్నంగా ఆలోచించడం ఆయన స్టైలే. ఇక్కడా అదే పంతాను అనుసరించాడు. ఎవరికైతే హుజురాబాద్ వేళ హామీలిచ్చాడో… పార్టీలో ఎడాపెడా చేర్చుకున్నాడో వారందరినీ అందలమెక్కించాడు.
పాత ఉద్యమకారుల ముఖాలు మాడిపోయేలా చేశాడు. వారి ఆశలు వాడిపోయేలా చేశాడు. ఇదేందీ..? కథ రివర్సయ్యింది అని మళ్లీ అసంతృప్తిని వెళ్లగక్కడం స్టార్ట్ చేశారు టీఆరెస్‌లో ఉన్న ఉద్యమకారులు.. పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ కూర్చున్న ఆశావహులు. కౌశిక్ రెడ్డి ఉద్యమంలో టీఆరెస్‌పై రాళ్లేసినోడు.. కేసీఆర్‌కు ఆప్తుడయ్యాడు. ఎమ్మెల్సీ అయ్యాడు. ఎల్. రమణ.. ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన్ను జనాలు మరిచిపోయి చాలా రోజులైంది. కేసీఆర్ పై భజన పాటలు బాగా రక్తికట్టించి పాడే సాయిచంద్ చైర్మన్ అయ్యాడు. కాంగ్రెస్ శిబిరం నుంచి వచ్చి టీఆరెస్ సోషల్ మీడియాను చేజిక్కించుకుని ఆగమాగం చేసి.. భ్రష్టు పట్టించిన మన్నె క్రిషాంక్ కూడా చైర్మన్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే.. ఓ వైపు ఈటలపై మరో వైపు హుజురాబాద్, రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు అనిపించడం లేదు.
అవును.. మరి దళితబంధు కూడా ఇస్తానని ప్రకటించిన తర్వాత కూడా ఓడగొడతే కోపం రాదా..? అసలే ఆయన కేసీఆర్. అందుకే దళితబంధు మరింత ఆలస్యమయినా ఆశ్చర్యం లేదు. మనం చూస్తూండాలె అంతే. సరే.. ఇక జల్లాల పర్యటన పేరుతో ప్రారంభానికి రెడీగా ఉన్న టీఆరెస్ పార్టీ కార్యాలయాల ఓపెనింగ్ చేస్తాడట కేసీఆర్. షెడ్యూల్ కూడా రెడీ అయ్యింది. మరి పార్టీ అధ్యక్షులేరి కేసీఆర్.. ఎవరి కూర్చోబెడతావు ఆ కుర్చీలో. దాని కోసం మళ్లీ ఓ కొట్లాటా..? జిల్లా కమిటీలన్నావు.. లేవు. రాష్ట్ర కమిటీలకూ దిక్కు లేదు. అనుబంధ సంఘాల మటేలేదు. మరీ ఇంత నిస్తేజమా..? ఈటల రాజేందర్ మీద కోపంతో ఇంటిని తగులబెట్టుకుంటావా ఏందీ..? ఏందో ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాలు. ఈ పంతం. ఈ మొండితనం. ఈ మూర్ఖత్వం…