రౌడీలా ప్రవర్తన. గుండాలా వ్యవహారం. అడ్డొస్తే కొట్టడం.. వినకపోతే తన్నడం. చెప్పినట్టు నడుచుకోకపోతే పగబట్టి మరీ టార్గెట్ చేయడం.. ఇవన్నీ కొంత మంది నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంప్ అవుతారు. అప్పటి వరకు సంపాదించిన ధనం, అధికారం, అండదండలు, కులబలం అన్నీ చూపి అధికార పార్టీని లోబర్చుకుంటారు. భయపెట్టిస్తారు. పదవులు డిమాండ్ చేస్తారు. ఎంచక్కా మంత్రి పదవి కూడా అనుభవించేస్తారు. కానీ పద్దతి మార్చుకోరు. అవే రౌడీ వేశాలు. అవే గల్లీ లీడర్లా గలీజ్ పనులు. ఇగో మన పట్నం మహేందర్రెడ్డిది కూడా ఇదే దారి. ఈయన గారు అప్పట్నుంచీ అంతే. అధికారులను కూడా వదలడు.కొడతాడు. మరీ కోపమెక్కువస్తే తంతాడు. ఇలా.
మొన్నటికి మొన్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో వేరొకరు నామినేషన్ వేయకుండా అతన్ని అక్కడే పట్టుకుని తన్ని బయటకు పంపేశాడు. నామినేషన్ రాకుండా చూసుకుని, తాను ఏకగ్రీవమయ్యాడు. మొన్నటి వరకు పదివి లేదు కదా.. ఇలా ఎమ్మెల్సీ వచ్చిందో లేదో ఓ అడిషనల్ కలెక్టర్ నే వీపు పై ఒక్కటిచ్చుకుని అర్సుకుని సర్సుకున్నాడు. అదీ మన పట్నం మహేందర్రెడ్డి అంటే. మన కేసీఆర్ సారేమో.. రాజకీయ పునరేకీరణ పేరుతో ఇలాంటి నేతలను తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటాడు. ఏమన్నా అంటే …అవును మాది ఫక్తు రాజకీయ పార్టే… మాదేమన్న సన్నాసుల మఠమా..? అని దబాయిస్తాడు. కానీ ఇలాంటి నేతలకు పదవులిచ్చి ఇజ్జత్ ఖచ్రా చేసుకున్నట్టు అనిపించడం లేదా కేసీఆర్. సరే పైకి చెప్పకున్నా.. మనసులోనైనా బాధపడుతున్నావా లేదా…?