ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు .. కోటి రూపాయ‌ల గేమ్ షోలో చివ‌రి రోజు హీరో మ‌హేశ్ బాబు పాల్గొన్నాడు. వారం రోజులుగా మహేశ్ పాల్గొన్న ఎపిసోడ్ చూపిస్తూ మై మ‌రిపిస్తూనే ఉన్నాడు జెమినీ వాడు. మొత్తానికి ఈ ఆదివారం చివ‌రి ఎపిసోడ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. సుతిమెత్త‌గా, మౌనంగా ఉండే మ‌హేశ్‌… ప్ర‌శ్న‌లతో ఉక్కిరిబిక్కిరి చేసి స‌మాధానం చెప్ప‌కుండా టెన్ష‌న్ టెన్ష‌న్ పెట్టే జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే గేమ్ షో ఎలా ఉంటుందా..? జూనియ‌ర్ ..మ‌హేశ్‌తో ఎంత ఆడుకుంటాడో క‌దా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్క‌డ క‌థ రివ‌ర్స‌య్యింది.

అంద‌రితో ఆడుకున్న‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో మ‌హేశ్ ఆడుకున్నాడు. ఓ ప్ర‌శ్న అడిగి .. దానికి స‌మాధానం చెప్పినా.. తిక‌మ‌క పెట్టి.. ఎందుకు ఆ జ‌వాబు చెప్పావు..? కార‌ణం ఏంటీ..? ఆ ఆప్ష‌న్ ఎందుకు క‌రెక్టు కాద‌నుకుంటున్నారు..? అని ప్ర‌శ్న‌ల‌కు మ‌రో మూడు నాలుగు ప్ర‌శ్న‌లు త‌ను జోడించి అడిగి.. హాట్ సీట్‌పై కూర్చున్న కంటెస్టెంట్‌కు ఎంత అవ‌గాహ‌నో ఉందో.. ఎంత జీకే ఉందో మొత్తం లాగే ప్ర‌య‌త్నం చేసి ..వారిని మ‌రింత టెన్ష‌న్‌కు గురి చేసి.. అయోమ‌యంలో ప‌డేసి టైమ్ అంతా కాజేసీ.. ఎదో ప‌దివేల‌తోనే.. మ‌రీ క‌ష్ట‌ప‌డి ప‌డి అప‌సోపాలు ప‌డితే ల‌క్షా ఇర‌వై వేల వ‌ర‌కో తీసుకెళ్లి.. అక్క‌డ్నుంచి ఇంటికి సాగ‌నంపే ప‌ని చేస్తున్నాడు జూనియ‌ర్‌.

మ‌హేశ్ మాత్రం ఈ రోజు జూనియ‌ర్‌తో ఆడుకున్నాడు. ప్ర‌శ్న‌డిగావు.. స‌మాధానిచ్చాను… మ‌ళ్లీ ప్ర‌శ్న‌లెందుకు? ఆన్స‌ర్ చెప్పేయ్ చాలు. నీక‌న్నా.. నీ గురువు (కంప్యూట‌ర్‌) న‌యంలా ఉన్నాడు. నువ్వు తిప్పి తిప్పి తిప్పి తిప్పి మ‌ళ్లీ అదే అడుగుతున్నావు. ఆన్స‌ర్ ఇచ్చా క‌దా.. క‌రెక్టా కాదా చెప్పు.. మ‌ళ్లీ ప్ర‌శ్న‌లెందుకు..? ఫిఫ్టీ లైఫ్ లైన్ యూజ్ చేసుకుంటాను… రెండు త‌ప్పు ఆన్స‌ర్లు ఏవ‌నుకున్నానో నీకెందుకు చెప్పాలి…? జూనియ‌ర్ ఉక్కిరిబిక్కిరి ప్ర‌శ్న‌లేయ‌బోయి.. మ‌హేశ్ ఎదురు ప్ర‌శ్న‌ల‌తో త‌నే బిక్కిరిఉక్కిరై.. ఉలిక్కిప‌డి.. త‌మాయించుకుని, త‌డ‌బ‌డి.. క‌వ‌ర్ చేసుకునేందుకు న‌వ్వు పులుముకుని..బిగ్గ‌ర‌గా న‌వ్వుతూ క‌వ‌ర్ చేసుకుని అలా కానిచ్చేశాడు.