ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం లైట్ గా తీసుకోలేదు. గతంలో కరోనా సృష్టించిన బీభత్సం, ప్రాణనష్టం.. చేదు అనుభవాలను అంత ఈజీగా తీసుకోలేదు. కీడెంచి మేలెంచు అన్న చందంగా… చిన్నపామునైనా పెద్ద కర్రతోనే చంపాలన్నట్టుగా సీఎం కేసీఆర్ దీనిపై సీరియస్‌గానే ఫోకస్ చేశాడు.
రెండు డోసుల వ్యాక్సిన్ తో దీని బారి నుంచి తప్పించుకోవచ్చని, నష్టం జరగకుండా చూసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద సీరియస్‌గా దృష్టి పెట్టింది. వందశాతం వ్యాక్సినేషన్ చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ను ప్రత్యేకంగా ఈ ప్రక్రియ వేగవంతం కోసం సీఎం పురామాయించాడు. దీంతో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా హెలికాప్టర్‌పై కొన్ని జిల్లాలు పర్యటించాడు. ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడ వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పరిస్థితిని సమీక్షించాడు.
ఆదిలాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లో ఆయన పర్యటించాడు. ఈ నెలాఖరులోగా వందశాతం అందరికీ రెండో డోస్ వ్యాక్సిన్ కూడా వేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాస్క్ తప్పినిసరి చేశారు. మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా, భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే వ్యాక్సిన్ వేయించుకున్నామనే సర్టిఫికేట్‌నూ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కూడా విధిస్తారా..? అనే ప్రచారం కూడా చేస్తున్నారు. లాక్ డౌన్ విధించే పరిస్థితులు రానీయకుండా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. లాక్ డౌన్ విధించే స్థితి వస్తే ఆర్థిక పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది. గతంలో సర్కార్‌కు ఇది బాగా అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి దుస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు మరింత వేగిరం చేసి ఒమిక్రాన్ ఓరియంట్‌ను పూర్తిగా అదుపులో పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది.