అందరూ భయపడ్డట్టు అదంత ప్రమాకరమేమీ కాదు… వ్యాక్సిన్లు పనిచేస్తాయి. కీడెంచి మేలెంచు అన్నట్టు ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు, కొన్ని మీడియా ఛానెళ్లలో చూపిస్తున్న భయాందోళన పరిస్థితులు ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ అత్యుత్సాహ, అనవసర ప్రచారంతో మరింత మందగించే ప్రమాదం లేకపోలేదు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై సెంటర్ ఫర్సెల్యూలార్ అండ్ మాలిక్యులర్బయాలజీ (సీసీఎంబి) ప్రధాన సలహాదారు, శాస్త్రవేత్త రాకేశ్‌మిశ్రా తన అభిప్రాయాలను దిశ డైలీతో పంచుకున్నాడు. దీనిపై పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా ఉన్న ఆ ఇంటర్వ్యూ వివరాలు….
– ఆఫ్రికా దేశాలలో వేగంగా ప్రబలతున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు. ఒమిక్రాన్గురించి మరీ భయపడి ‘‘ప్యానిక్’’ కావాల్సిన అవసరం లేదు.
– కానీ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించకపోతే వేరియంట్ విజృంబించే ప్రమాదముంటుంది.
– యాభై కి పైగా మ్యూటేషన్లతో కొత్తగా పుట్టుకువచ్చిన ఒమిక్రాన్ రకం వైరస్ విరులెన్స్ (తీవ్రత) అంతగా లేకపోవచ్చు.మన దేశంలో విస్తారంగా విస్తరించిన డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని భావించడం లేదు.
– తమ సంస్థ జరుపుతున్న జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలలో మనదేశంలో ఎలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకు వచ్చిన దాఖలాలు లేవు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై జీనోమ్ సీక్వెన్సింగ్ జరిపి అసలు దాని ప్రభావం ఎంత వరకు ఉందనే దానిపై అధ్యయనం జరపాల్సిన అవసరముంది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదనే ఆందోళన ఉంది. కానీ డెల్టా వేరియంట్ కూడా వేగంగానే ప్రబలింది. ఆ మాటకొస్తె డెల్టా వేరియంట్తక్కువ ప్రమాదకరమైనదేమీ కాదు.
– వైరస్ ఎక్కడికి పోలేదు అది మన పక్కనే పొంచి ఉన్నదన్న సత్యాన్ని విస్మరించరాదు . మన దేశంలో డెల్టా రూపంలో కరోనా వైరస్ ఇప్పటికీ ఎంతో మందికి ప్రబలుతున్నా అది బలహీనపడటం వల్ల అంతగా ప్రమాదం కనిపించడం లేదు. వ్యాక్సిన్లు , దేశంలో అధిక శాతం మందిలో ఏర్పడ్డ ప్రతిరక్షకాల వల్ల ప్రమాదం తీవ్రం కాలేదు. కానీ కొత్త వేరియంట్ ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది ప్రపంచ దేశాలకు ఇంకా స్పష్టత లేదు. దాని వల్ల భారతదేశంలో ఊహిస్తున్నంత ప్రమాదం ఉండకపోవచ్చు. ప్రజలు ఏదో అవుతుందని ఆందోళన చెందకుండా కోవిడ్ నియమ నిబంధనలను పాటించి ప్రభుత్వ యంత్రాంగాలతో సహకరిస్తే ఎలాంటి వేరియంట్లనైనా ఎదుర్కోవచ్చు .
-కానీ మొత్తం కరోనా ఉనికిని కోల్పోయిందనే భ్రమలో చాలా మంది మాస్‌గా పండుగలు చేసుకోవడం, సభలు,సమావేశాలు నిర్వహించడం ఎంత మాత్రం మంచిదికాదు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించి విచ్చలవిడిగా కాకుండా వైరస్‌నియంత్రణకు స్వీయ క్రమశిక్షణను పాటించాల్సిందే.