తెలంగాణలో వానలు కురిస్తే … అది కేసీఆర్ చేసిన యజ్ఞం పుణ్యమే… చల్లగాలి విస్తే కెసిఆర్ నాటిన మొక్కల ఫలితమే….. అసలు తెలంగాణ ప్రజలు రోడ్లమీద .. వంతెనల మీద రయ్యిమంటూ వెళ్తున్నారంటే… అది టిఆర్ఎస్ సర్కార్ చేసిన పనులతోనే … అంతెందుకు ప్రగతి భవన్ లో నాటిన ఔషధ మొక్కల వలన రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి సాధ్యమైంది. .. అక్కడికి దేశంలో ఎక్కడా వానలు పడి నట్టు…. చల్లగాలులు లేనట్లు …. కరోనా కట్టడి కానట్టు … టిఆర్ఎస్ నాయకుల ప్రగల్బాలు ఉంటాయి. రాష్ట్రంలో ఏం జరిగినా… అంటే మంచి జరిగితే … అదంతా తమ పుణ్యమేనని చెప్పుకుంటే జనాలు నమ్మకున్న రాజకీయమే కదా పెద్దగా పట్టించుకోరు. కానీ ఎవరూ పని చేసినా తమ ఖాతాలో, కుటుంబం ఖాతాలో వేసుకునే చతురత కలిగిన టిఆర్ఎస్ అగ్రనాయకత్వం నవ్విపోదురు గాక నాకేటి ఏమిటి అని…. ఉత్తరాది రాష్ట్రాల రైతుల విజయాన్ని కూడా నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం విస్మయాన్ని కలిగిస్తోంది. అసలు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల పై టిఆర్ఎస్ ఏనాడైనా ఉద్యమం చేసిందా….?కనీసం ఉత్తరాది రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చిందా….? కనీసం పెదవి విప్పి మాట్లాడిందా…. అంటే టిఆర్ఎస్ నాయకుల వద్ద సమాధానం లేదు.
…….
వరి ధాన్యం కొంటారా… లేదా అన్న సూటి ప్రశ్న తో మహాధర్నాలో పాల్గొన్న కెసిఆర్ ఎప్పుడు రైతు చట్టాలపై గర్జించాడు…. ఇందిరా పార్క్ లో ఆయన గాండ్రింపు లకు ఢిల్లీలో నరేంద్రమోడీ పీఠం ఎప్పుడు కదిలింది… ఇక కెసిఆర్ రంగంలోకి దిగితే తట్టుకోవడం కష్టమని.. ప్రధాని భయపడ్డాడా… అసలు ఉత్తరాది రాష్ట్రాల రైతుల ఆందోళనకు దిగి రాని మోడీ
ఒక్కరోజు కేవలం ఒక గంట పాటు కెసిఆర్ చేసిన హెచ్చరిక కు పరిస్థితి పూర్తిగా మారిపోయిందా….? అని సోషల్ మీడియాలో టిఆర్ఎస్ ప్రచారం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఆందోళన ఏదో … ముందే చేసి ఉంటే అసలు సమస్య ఇంతవరకు వచ్చేది కాదు కదా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
అసలు కేంద్రం ఎలాగో చట్టాలను రద్దు చేయబోతోందని ముందుగానే తెలుసుకొని హడావుడిగా ధర్నా చేసి ఉంటారని… ఇటువంటి ఎత్తులలో … కెసిఆర్ దిట్ట అని ప్రచారం జరుగుతుంది.
….. సాగు చట్టాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంకటంగా మారాయన్న విషయం అందరికీ తెలిసిందే.
త్వరలో ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల కారణంగానే కేంద్రం హడావుడిగా చట్టాలను రద్దు చేసిన విషయం చిన్న పిల్ల వాడి కైనా అర్థమవుతుంది.
మొదట్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాలకే పరిమితమైంది. దక్షిణాదిలో అసలు దాని ఊసే లేదు. కానీ ఆ అసంతృప్తి జ్వాలలు ఉత్తర ప్రదేశ్ కి కూడా తగలడంతో బిజెపి కలవర పడింది. ఇటీవల లఖింపు ర లో కేంద్ర మంత్రి కారు రైతుల పై నుంచి దూసుకుపోవడం సంఘటన తర్వాత కొన్ని ప్రాంతాలలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి.
అప్పటివరకు ఉత్తరప్రదేశ్లో భారీ విజయం ఖాయం అనుకున్న బిజెపిలో విశ్వాసం సడలింది. రైతుల ఆగ్రహజ్వాల లను వెంటనే ఆపేయాలని బిజెపి ప్రయత్నించింది. మొదట్లో పంజాబ్ ను తేలికగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గా దృష్టి సారించింది. అంతకుముందు ఉదృతంగా జరుగుతున్న పంజాబ్ రైతుల ఆందోళన వల్ల ఉగ్రవాదులు పేట్రేగే ప్రమాదముందని కేంద్రం భయపడింది. రాజకీయంగా అంత చలనం రాలేదు. కానీ తమకు కంచుకోటగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో పార్టీ బీటలు వారుతుండటంతో నరేంద్ర మోడీ చట్టాలను రద్దు చేయడానికి దిగి రావాల్సి వచ్చింది.
మరోవైపు తమ పార్టీకి మొదటి నుండి అండగా నిలిచిన సిక్కులు దూరమవడం మోడీ ని మొదటి నుంచి కలవరపరుస్తోంది. పంజాబ్ రైతులను శాంతింప చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒక వైపు ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలలో విజయం సాధించడంతో పాటు పార్టీకి దూరమవుతున్న సిక్కు సమాజాన్ని తిరిగి విశ్వాసంలోకి తీసుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో కేంద్ర సర్కార్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇది వాస్తవం….
…..
ఎం ఎం రాయల్…