కేసీఆర్ కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు మహా ధర్నా పేరుతో ఆందోళన చేసిన కొద్ది సేపటికే కేంద్రం వెంటనే స్పందించింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలో యాసంగి రైస్‌పై నడస్తున్న రాజకీయానికి తెర పడేలా కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కేసీఆర్ వేసిన ఎత్తును చిత్తు చేసింది కేంద్రం. యాసింగిలో వచ్చే పారాబాయిల్డ్ రైస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, వీటితో పాటు గోధుమలు కూడా బాగా పండిస్తున్నారని, వీటిని ఇకపై తీసుకోబోమని స్పష్టంగా చెప్పామని ప్రకటించింది కేంద్రం. దీనికి కేసీఆర్ ఒప్పుకున్నాడని కూడా చెప్పింది.
ఇంత ఆందోళన చేసినా.. కేంద్రం మాత్రం ఇసుమంత కూడా కదల్లేదు. వణకలేదు. పైగా గతంలో జరిగిన అగ్రిమెంటునే ముందేసింది. మేం ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. బండి సంజయ్ మాటల్లో మొదటి నుంచి డొల్లతనమే ఉంది. రైతులు ఈ మాటలు నమ్మలేదు. మీరు వేయండి.. మేం కొనిపిస్తామన్నది కేవలం రాజకీయ మైలేజీ కోసం, వారి అవసరాల కోసం మాత్రమే. అది వారికీ అర్థమయ్యింది. కానీ కేసీఆర్ ఇటు స్టేట్ బీజేపీని, అటు సెంట్రల్‌ను ఇరుకున పెడదామని చూశాడు. కానీ కేంద్రం క్లారిటీగానే ఉంది.
పంట మార్పిడి చేయండి.. పప్పు దినుసులు, వంట నూనె గింజలకు డిమాండ్ ఉంది.. వాటినే పండించండని పాత మాటే చెప్పి.. మా జోలికి రాకండి.. మేం క్లారిటీగానే ఉన్నామని ఢిల్లీ డోర్లు క్లోజ్ చేసేసింది. ఇక ఇష్యూ మళ్లీ రాష్ట్రం వద్దకే వచ్చి ఆగింది. ఇంకా కేసీఆర్ బండి సంజయ్‌ను తిడుతూ కూర్చుంటే కుదరదు. సమయం వచ్చేసింది. యాసంగి సీజన్ చాలు కాబోతున్నది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండని ప్రభుత్వం ప్రకటిస్తున్న రైతుల నుంచిపెద్దగా స్పందన లేదు. వారు వరికే డిసైడ్ అయ్యారు. దాదాపు 70 శాతం రైతులు మళ్లీ వరే వేయనున్నారు.
మరి ఆ ధాన్యం రాష్ట్రమే కొనాలి. కొనమంటే కుదరదు. అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కొంటే భారం తప్పదు. కేసీఆర్ మెడకు యాసంగి రైస్ గుదిబండలా మారనుంది. ఇక తేల్చుకోవాల్సింది కేసీఆరే. ఇక కేంద్రాన్ని నిలదీసే అవకాశం లేకుండా అయ్యింది.