ఇవేమీ రాజకీయాల్రా బై. గతంలో ఎన్నడూ చూడలె. రైతు కేంద్రంగా రాజకీయాలు గతంలో చాలానే నడిచాయి గానీ. మరీ ఇంతలా ఒకరి అవసరాల కోసం మరొకరు తిట్టుకుంటూ.. రాజకీయ అవసరాల కోసం రైతులను మధ్యలో పెట్టి వారిని మరింత అయోమయానికి గురి చేసి, అంతిమంగా బలిపశువును చేసే దుస్థితి ఇప్పుడే కనిపిస్తుంది. బహుశా కేసీఆర్ రైతుల విషయంలో ఇలాంటి ఇరకాటంలో పడతాడని ఎన్నడూ ఊహించలేదు కావొచ్చు.
సంక్షేమ పథకాలలో ఆసరా పింఛన్ల తర్వాత రైతుబంధు, రైతబీమా, ఉచిత కరెంటు.. ఇవే టీఆరెస్‌కు ఆయువు పట్టు. ఇప్పుడు కీలకమైన రైతుల విషయంలో బీజేపీ .. టీఆరెస్‌ను టార్గెట్ చేసి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇది గమనించిన కేసీఆర్ నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అన్న చందంగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విరుచుకుపడ్డాడు. ధర్నాలతో ఢిల్లీ చూపును ఇటు వైపు తిప్పుతున్నాడు. నల్లగొండలో పరస్పర దాడుల దాకా పోయింది విషయం.
రేపటి మహాధర్నాలో టార్గెట్ అయ్యేది మోడీ కాదు.. రాష్ట్ర బీజేపీ. ఎందుకంటే పైన విషయం క్లారిటీగానే ఉంది. ఆ విషయం కేసీఆర్‌కూ తెలుసు. కానీ ఇక్కడ బండి తన పొలిటికల్ మైలేజీ కోసం టీఆరెస్‌ను దోషిగా రైతుల ముందు బోనులో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయాత్నాన్ని తిప్పి కొట్టడానికి, రైతుల వద్ద బీజేపీయే దోషి అని చెప్పడానికే కేసీఆర్ చేప్టటే ధర్నాలు, ఆందోళనలు. దీని వల్ల రైతులకు ఏమీ లాభం జరగేది లేదని కూడా ఆయన పరోక్షంగా నిన్ననే ప్రెస్‌మీట్లో చెప్పాడు కూడా.
కానీ అటు బండి సంజయ్ మాటలు, ఇటు కేసీఆర్ మాటలు చూస్తుంటే దొందూ దొందే అన్నట్టున్నాయి. బండి లెవల్‌లోనే కేసీఆర్ మాట్టాడుతున్నాడు. రాజకీయాలు అలా మాట్లాడిస్తున్నాయి ఇద్దరినీ. కొంటావా..? కొనవా..? అనేది ఇద్దరి కామన్ డైలాగ్. బండి డైలాగు మీనింగేంటంటే.. ఈ వానాకాలం వడ్లు ప్రభుత్వం కొంటలేదు. రైతులు అక్కడే కళ్లాల్లో చనిపోతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్. ఆ ధాన్యమంతా కేంద్రమే కొంటుంది…మరెందుకు కొంటలేవు..? అని నిలదీసే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా అయినా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అవి ఆగవు. వర్షం పడినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోజుల తరబడి వేచిచూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ కష్టాలు తప్ప.. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇది కాదు సమస్య. యాసంగిలో వరి వేయాలా వద్దా అనేది రైతులను అయోమయానికి గురి చేసే అంశం. ప్రభుత్వం వద్దంంటున్నది. బండి వేసుకోమని అన్నాడు. కేసీఆర్ దీన్ని ఎండగట్టేసరికి ఇప్పుడు ఆ ఊసు లేదు.
మరి ఏం మాట్లాడాలి..? ఏం రాజకీయం చేయాలి..? ఈ వానాకాలం ధాన్యం కొనడం లేదు.. అదే ఇప్పుడు రాజకీయ అస్త్రం బండి. సరే, మీరూ మీ రాజకీయాలు… బాగానే రక్తి కట్టిస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లో రైతుల కొంప మాత్రం ముంచడం ఖాయం మీరిద్దరూ… డౌట్ లేదు.