సిద్దపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి కలెక్టర్ గిరీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి.. ఆ తర్వాత మంత్రి అయి.. ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్టర్‌కు వేల కోట్లున్నాయని, వాటిని కాపాడుకునేందుకు అధికారం కావాలని, కేసీఆర్ అండదండలు ఉండాలని .. అందుకే పార్టీలో చేరారని స్వయంగా గులాబీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. డౌట్ లేదు. ఆయనకు తన ఆస్తులతోఓ పోల్చితే కలెక్టర్ గిరీ చాలా చిన్నదనిపించింది. అందుకే దాన్ని వదిలేశాడు.
ఇందులో ఇంత రాద్దాంతం ఎందుకు..? ఎవరిష్టం వారిది అనే వాదనా ఉంది. ఇదే సమయంలో మరో ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఉదంతాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనను సీఎం కేసీఆర్ ముప్పుతిప్పలు పెట్టి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా చేయడంతోనే ఆయన కలెక్టర్‌గిరీ రాజీనామా చేశాడు. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకు పనికిరాని మురళిని ఆంధ్ర సీఎం కళ్లకద్దుకున్నాడు. మంచి హోదా ఇచ్చి ఆయన సేవలు వినియోగించుకుంటున్నాడు.
మనకు సేవలతో అవసరం లేదు. స్వామిభక్తి కావాలి. కాళ్లు మొక్కి మన మనిషి అనిపించుకోవాలి. అంతే అందలెమెక్కిస్తాం. సరే, మరో సంఘటనను కూడా కొంతమంది గులాబీలు ఉదహరిస్తున్నారు. ఐపీఎస్ కు ఆరెస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేసి బీఎస్పీలో చేరినప్పుడు ఎందుకు ఇంతలా గొంతులు లేవలేదు..? అని ప్రశ్నిస్తున్నారు. బీఎస్పీ.. ఇక్కడ ఉనికే లేని పార్టీ. అది అధికారం లోకి రావడం కల్ల. మరి ఆ పార్టీలోకి ఎందుకు పోయాడంటావు. అధికారం కోసమైతే కాదు. ఆస్తులను కాపాడుకోవడం కోసం అసలే కాదు. ఆత్మగౌరవం కోసమే. ఏదో సాధించాలనే తపన కోసమే.
పదవులే కావాలంటే కేసీఆర్‌కు ఒక సెల్యూట్ కొడితే చాలదా..? జీ హుజూర్ అని చేతులు కట్టుకుని నిలబడితే చాలదా..? కేసీఆర్ పిలిచి మరీ ఓపదవిలో కూర్చోబెట్టడా..? మరి బీఎస్పీలో ఏం ఉందబ్బా..? అసలు వెంకట్రాంరెడ్డి స్వార్థానికి, ఆకునూరి మురళి ఆత్మగౌరవానికి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ త్యాగానికి .. దేనికదే సపరేటు. ఒకదానితో ఒకటి పోల్చలేం. దేనికదే. అంతే.