మంత్రి మల్లారెడ్డి అంటే అందరికీ అలుసైపోయింది. మల్లన్నను కామెడీ పీస్‌గా చూస్తున్నారంతా. ఎక్కడ దొరుకుతాడా..? ఎలా ఆటపట్టిద్దామా అని ఎదురుచూస్తున్నట్టున్నారు. సరే, ఆయన మాట్లాడితే కామెడీగానే ఉంటుంది. కాదనలేం. సీరియస్‌గా తొడలు కొట్టి సాలే.. అని ఆగ్రహంతో ఊగిపోయినా.. మనం కడుపుబ్బా నవ్వుకుంటాం.. ఇదీ కాదనలేం. అసెంబ్లీలో సబ్జెక్డు లేకుండా అసందర్భంగా మాట్లాడినా మంచి హాస్యం పండిస్తున్నాడని ఏమీ అనం.. కాసేపు నవ్వుకుని ఊరుకుంటాం.. ఇదీ మనకు మామూలే. వాళ్ల కాలేజీల ఫంక్షన్లలో ఇయన ఇచ్చే ఇన్స్‌పిరేయన్, మోటివేషన్, ఎమోషనల్, వండర్‌ఫుల్ స్పీచులు కూడా మనం కింద పడి దొర్లిదొర్లి నవ్వుకునేలా చేస్తాయి.. ఇదీ కాదలేము. వద్దనలేం. కానీ…
నిన్న.. అది రైతు మహాదీక్ష. సీరియస్ మ్యాటర్. రైతలు యాసంగిలో పండించిన బియ్యాన్ని తీసుకోమని కేంద్రం చెప్పింది. అందుకే వరి వేయకండని కేసీఆర్ చెప్పిండు. కానీ అంతా కేసీఆర్‌నే బద్నాం చేస్తుండు. అట్లా కాదని రైతాంగానికి మొత్తం తెలవాలని.. కేంద్రంపై జంగ్ సైరన్ ఊదిండు కేసీఆర్. అందుకే నిన్న అన్ని నియోజకవర్గాల్లో రైతు మహాదీక్ష చేపట్టారు. మన మల్లన్న కూడా వెళ్లి కూసుండు. ఎవరో ఒకడు వచ్చి ఓ ఫ్లకార్డు చేతిలో పెట్టాడు. ఫోటోకు ఫోజియ్యమన్నాడు. మన మల్లన్న అందులో హుషారే. మంచిగా ఫోటోకు ఫోజిచ్చిండు. సరే, ధర్నా అయిపోయింది. ఎవరిండ్లకు వాళ్లెళ్లిపోయి బుక్కెడు తిని బజ్జుకున్నారు. కానీ అసలు కథ ఇక్కడే, అప్పడే మొదలైంది. మల్లన్న ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. ఎందుకు..? ఆయన ధర్నాలో పాల్గొని రైతుల పక్షం నిలిచి.. పో రాటం చేసి.. మేల్కొలిపే ఉపన్యాసమిచ్చి.. కేంద్రానికి చెమటలు పట్టించి…. అబ్బ.. ఇవన్నీ కాదండి బాబు.. దీని కోసం కాదు.. మరి ..
ఆయన పట్టుకున్న ఫ్లకార్డులో రాసిన నినాదం తప్పుగా పడిందట. పోరాడదం.. పోరాడదం.. అని రాసి ఉంది ఆ ఫ్లకార్డులో. అసలుండాల్సింది. పోరాడుదాం.. పోరాడుదాం.. అని. చిన్ని మిస్టేకే. కానీ మల్లన్నను దొరికితే వదులుతరా అభిమానులు. వదలరు. షరా మామూలుగా ఆడుకున్నారు. ఇదేంది..? అక్షరాలు తప్పుగా ఉన్నా చూసుకోవా..? నీకు యూనివర్సిటీలు. ఖర్మకాలి మా పిల్లగాడు మీ స్టూడెంటే.. అని ఒకడు.. ఇస్త్రీ అంగీ నలగకుండా అబ్బ ఎంత బాగా కూసుని ధర్నా చేస్తున్నాడో అని మరొకడు.. ఇలా ఎవడికి తోచింది వాడు తమ భావ ప్రకటన స్వేచ్చను మల్లన్న పై ఇలా విచ్చలవిడిగా వాడేసుకుని ఆడేసుకుని, పైశాచికానందం పొందేసి.. దాన్ని వైరల్ చేసి.. అలా మురిసిపోయారు.
మీరంతా ఎంత వెక్కిరించినా.. ఎటకారమాడినా.. మల్లన్నంటే మన రామన్నకు ఎంతో ఇష్టం. అది గుర్తుంచుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని కామెంట్లు చేయండి. లేకపోతే.. మీరిలాగే చేస్తే.. ఇంకా ఇలాగే రెచ్చిపోతే
మల్లన్నకు విద్యాశాఖ పోర్ట్ ఫోలియో ఇచ్చి మీకు తగిన బుద్ది చెప్తారు…? జాగ్రత్త
