గెల్లు శ్రీనివాస్ ఓడిపోయినందుకు..అతను ఓడగొట్టడంతో పనిచేసినందుకు క్షమాపణలు కోరారు తెలంగాణ ఉద్యమకారులు. అవును.. ఇది నిజం..! ఈటల రాజేందర్, గెల్లు శ్రీనివాస్‌లు ఇద్దరూ ఉద్యమకారులే. ఈటలకు గెల్లు శిష్యుడు. అతని అడుగు జాడల్లో నడిచినవాడు. విద్యార్థి నాయకుడిగా క్రమంగా ఎదుగుతూ అందరి మెప్పును పొందిన వాడు.
ఈటల రాజీనామాతో కేటీఆర్ ప్రోత్సాహంతో అనుకోకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు పేరు తెరపైకి వచ్చింది. ఇది ఓ రకంగా గెల్లు అదృష్టమే అనుకోవాలి. ఈ టికెట్ కోసం హేమాహేమీలు పోటీలు పడ్డారు. ఎందరినో గెల్లు గెలుపుకోసం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. కోట్ల నిధులు గుమ్మరించారు. ముగ్గురు మంత్రులు నెలల తరబడి అక్కడ్నే తిష్టవేశారు. ఇంతా చేసినా గెల్లు గెలవలే. ఘోర ఓటమిని చవిచూశాడు. కన్నీరు పెట్టుకున్నాడు.
అయితే ఈటల గెలుపును ఎంజాయ్ చేసినంతగా.. గెల్లు ఓటమిని ఎంజాయ్ చేయలేకపోయారు తెలంగాణ ఉద్యమకారులు. ఎందుకంటే… తమతో పాటు ఉద్యమంలో కదంకదం కలిపినోడు.పోరుబాట పట్టినోడు. తెలంగాణ కోసం కొట్లాడినోడు.మరి గెల్లు గెలిస్తే సంతోషమే కదా. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. కేసీఆర్‌కు ఈటలకు మధ్య పోటీలా ఇది మారింది. ఎలాగైనా ఈటల గెలవాలి. కేసీఆర్ ఓడాలి. గర్వభంగం జరగాలి. అందుకే ఉద్యమకారులంతా ఈటల గెలుపు కోసం స్వయంగా అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో టీఆరెస్‌ను ఆడుకున్నారు. ఈటల గెలుపు కోసం కృషి చేశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు.
ఆ వెంటనే గెల్లును క్షమాపణ కోరారు. ముందు ముందు తమ మద్దతు గెల్లుకు ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే గెల్లుకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్‌ను స్పీడ్ చేస్తున్నారు. కేసీఆర్ పై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.