వరి వద్దు.. వరి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వరి నియంత్రణ చర్యలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది. తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టుగా .. వెంటనే దీక్షలో కూర్చున్న బండి సంజయ్.. కేంద్రం వద్దంటేనే యాసంగికి వరి వద్దు అనే పరిస్థితి వచ్చిందనే విషయం తెలియదనుకుంటా. తెలిసినా.. ఎలాగోలా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి మైలేజీ పొందాలనే ఆరాటం కావొచ్చు. కానీ బండ్ సంజయ్ దీక్షకు మాత్రం పెద్దగా మద్దతు లభించలేదు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.. గట్టిగానే సవాల్ విసిరాడు. కేంద్రంతో మొత్తం ధాన్యం కొనిపిస్తే రాజీనామా చేస్తానన్నాడు. వాళ్లు కొనరనీ మంత్రికి తెలుసు.. ఇది కానిపోని ముచ్చటనీ సంజయ్‌కు తెలుసు. రాజకీయాలే ఇప్పుడు ముఖ్యం. రైతులు కాదు. వరి కాదు. దీనిపై ముందే మాట్లాడాల్సిన కాంగ్రెస్ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్టుగానే ఉంది. రేవంత్ ఆదిలో ఉరికురికి ప్రెస్ మీట్లు పెట్టాడు.. ఇలా సమయానికి మైండ్ పనిచేయనట్టుంది. బీజేపీ ఇదేదో అందివచ్చిన అవకాశంగా భావించింది కానీ, అది అనుకున్నంత మైలేజీ రాలేదు. రైతులు దాన్ని నమ్మనూ లేదు.
వేరే రాష్ట్రాల్లో ఈ సమస్య లేదు. ఒకటే సీజన్ పంటను ప్రభుత్వం కొంటుంది. అదీ లిమిటెడ్ గా. రెండో సీజన్ రైతులే అమ్ముకోవాలి. కానీ మన దగ్గర అలా కాదు.. ప్రభుత్వమే కాంటా పెట్టి మద్దతు ధర ఇచ్చి రెండు సీజన్‌ల పంటలూ కొంటున్నది. దీనికే రైతులు అలవాటు పడ్డారు. ఇప్పుడున్నపలంగా యాసంగిలో వరి వద్దు అని చెప్పే సరికి రైతులు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. తగ్గితే ఓ 20 శాతం నుంచి 30 శాతం తగ్గుతుండొచ్చు కానీ.. మొత్తం వరి సాగు బంద్ చేసుకునే పరిస్తితైతే లేదు. ఇల్లు కాలి ఒకడేడిస్తే.. అన్నట్టు రైతుల బాధలు రైతులకుంటే.. ఇప్పుడిది రాజకీయ అస్త్రంగా మారింది. రైతులే పావులయ్యారు.