ఓ వార్త పొద్దున్నే చూశాను దిశలో. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారు విరాళంగా ఇచ్చాడని ఆ వార్త సారాంశం. ఒక్క కిలో ఇవ్వడమే గ్రేట్ అనుకున్న తరుణంలో మన మంత్రి 3 కిలోలు ఇచ్చాడు. కానీ ఆయన స్థాయికి ఈ మూడు కిలోలు సరిపోవు. మంత్రి మల్లారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవమిచ్చింది. మంత్రి పదవి ఆయనకు ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు. విద్యాశాఖ ఇస్తారేమో అని అంతా అనుకున్నారు. దురదృష్టావశాత్తు అది ఆయనకు వరించలేదు.
అయినా ఏ శాఖ ఇస్తే ఏం వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఏముంటాయి.? అంతా సీఎం చెప్పినట్టే జరుగుతుంది కదా. సరే, మంత్రి మల్లారెడ్డి అనతికాలంలోనే యువరాజు కేటీఆర్‌కు చాలా దగ్గరయ్యాడు. ఎంత మంచి వ్యక్తిత్వముంటే కేటీఆర్ దగ్గరకు తీస్తాడు. ఎంతో మంది సీనియర్ మంత్రులను పట్టించుకోని కేటీఆర్ మల్లారెడ్డి అంటే వల్లమాలిన అభిమానం. కేటీఆర్ కోసం మంత్రి కూడా ఏదైనా చేస్తాడు. తొడలు కొడతాడు. సవాళ్లు విసురుతాడు. కేటీఆర్ ఎవరన్నా ఏమన్నా అంటే… మంత్రినని కూడా మరిచిపోయి.. అబే సాలే.. గూట్లే అని కూడా అర్సుకుంటాడు. ఇగో ఇక్కడే మన కేటీఆర్‌కు మల్లారెడ్డి మరింత నచ్చాడు. శబ్బాష్.. గో హెడ్ అని జబ్బ చరిచి ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు రాబోయే తరమంతా కేటీఆర్‌దే. మరి మల్లారెడ్డి ఫ్యూచర్ మనం ఊహించుకోవచ్చు. ఏ రేంజ్‌లో ఉంటుందో. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం. అలాంటప్పుడు ఓ మూడు కిలోల బంగారమేమి సరిపోతుంది.. ఓ ముప్పై కిలోలిస్తే నీ రేంజ్‌కు సరిపోయేది మల్లన్నా..!
