హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, ఈ ఫేక్ వార్తలు విని వినీ, చూసీ చూసీ విసిగొస్తుంది భయ్యా.. ! వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే వార్తలు, సమాచారం ఏది నిజమో..? ఏది అబద్దమో..? తెలుసుకోవడం అంత వీజీ ఏమీ కాదు. మనోళ్లు అంత తెలివిమంతులు. ఇందులో బీజేపీ, టీఆరెస్ లను వేర్వేరుగా చూడలేము. ఒకర్ని మించి మరొకరు క్రియేటర్లు.
అందుకే ఇలా ఏదైనా సంఘటన జరిగితే దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు.. అవతలి పార్టీ మీద బురద జల్లేందుకు ఎలా ఫేక్ వార్తగా సృష్టించాలో ఆరితేరి పోయారు. దాన్ని నిజమే అని మొదట నమ్మకం కలిగించడం వీరి అద్భుత సృష్టికి పరాకాష్ట. అంతకు ముందూ ఉండేవి ఈ ఫేక్ వార్తలు. కానీ మరీ ఇంత దారుణంగా.. ఇంత ఘోరంగా.. ఇంత వేగంగా.. ఇంత పైశిచికంగా.. ఇంత తెలివిమీరి.. ఇంత దిగజారీ…. మాత్రం ఉండకపోయేది.
ఇప్పుడు హుజురాబాద్ ఎన్నిక పుణ్యమా అని పోటీలు పడి ఈ రెండు పార్టీలు ఫేక్ వార్తలపై ఆధారపడి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. బురద పూసుకుంటున్నారు. బురదలో పడి దొర్లుతున్నారు. దీనికి సోషల్ మీడియా వేదికైంది. ఎన్నికలో గెలుపే లక్ష్యం.. నైతికత.. తొక్క తోలు.. జాన్తా నై. ఎంత ప్రచారం చేసినం.. ఎంత బురద జల్లినం… ఎన్ని అబద్దాలు ఆడినం… చివరికి గెలిచినమా..? లేదా..? అంతే. అంతకు మించి మరేం పట్టించుకోవడం లేదు.
తాజాగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ పూలసంబురం అని జాగృతి నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. కొద్ది మంది మినహా పార్టీలకతీతంగా దీన్ని ఆహ్వానించారు. ఆస్వాదించారు. కానీ బీజేపీ మాత్రం దీన్ని హుజురాబాద్ రాజకీయానికి పావుగా వాడుకున్నది. తనకు అలవాటైన దోరణిలో ఓ తప్పుడు వార్త వండి వార్చేసింది. జరిగింది ఇదీ.. మీకు తెలుసా..? అనే రేంజ్‌లో ఓ వార్త కథనాన్ని ఏదో ప్రతికలో అచ్చైనట్టుగా ( ఈ మధ్యలో ఇది ఫ్యాషనయింది. ఇలా ఇస్తే తప్ప ఎవరూ నమ్మరని పత్రికల డేట్‌లైన్లను..ఫాంట్లను, హెడ్డింగులను యథేచ్చగా వాడుకుని వదిలేస్తున్నారు. ) సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాని సారాంశమేమిటో తెలుసా…
ప్రపంచంలో అతి ఎత్తైన, ఖరీదైన బుర్జ్ ఖలీఫాలో ఎమ్మెల్సీ కవిత గృహప్రవేశం చేశారట. పనిలోపనిగా ఈ బతుకమ్మ వేడుకలు కలిసి వచ్చాయంట అంతే. ఇదేదో ప్రత్యేకంగా ప్లాన్ చేసింది కాదన్నమాట. శ్రమకోర్చి ఏదో చేద్దామన్న తపన కాదన్నమాట. ఇంకా ఉంది.. అప్పుడే అయిపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఈ ప్లాట్ కొనుగోలు కోసం 60 కోట్లు బహూకరించిందట. ఈ గృహ ప్రవేశం సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 50 లక్షలతో బుర్జ్ ఖలీఫాపై లేజర్ షోను ఏర్పాటు చేశాడంట. ఇప్పటి వరకు ఫ్లాట్స్ ఓనర్లుగా భారత్‌కు చెందిన ప్రముఖ సినీ నటులు, వ్యాపార వేత్తలు ఉండగా.. వారి సరసన తొలి రాజకీయ నాయకురాలు కవిత చేరిందట. ఇదీ… ఆ ఫేక్ ముచ్చట.
ఇది ఫేక్ అని కొట్టిపాడేసేందుకు కూడా టీఆరెస్ సోషల్ మీడియాకు టైం లేదు. అది కూడా బిజీబిజీగా ఉన్నట్టుంది… ఈటలపై ఓ ఫేక్ వార్త సృష్టి చేసి వదిలే పనిలో.