నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హుజురాబాద్‌లో ప్రచారం చేయడంపై బీజేపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈటల రాజేందర్‌కు పార్టీ ముద్ర లేదు. బీజేపీ తరపున పోటీచేస్తున్నాడనే గానీ, ఎక్కడా అతన్ని బీజేపీ మనిషిగా చూడటం లేదు. అవసరానికి ఆ ప్లాట్ ఫాం ఎక్కడానే అనుకుంటున్నారు. పువ్వు గుర్తుకు ఓటెయ్యాలె.. రాజేందర్‌ను గెలిపించుకోవాలె.. అనే విధంగానే పరిస్థితి ఉండేది. కానీ, అర్వింద్ ఎంట్రీ, దూకుడుతో అంతా బీజేపీ రంగు, అర్వింద్ మార్కు మాటలు, రాజకీయాలకు కొంత ఇబ్బందికరంగా, ఎబ్బెట్టుగా తయారయ్యాయని ఆ పార్టీలోనే లుకలుకలు మొదలయ్యాయి.
బేవకూఫ్, అరే తురే అనే మాటలు అలా అవలీలగా వదిలేసి మీడియానంతా తన చుట్టే తిప్పుకుంటున్నాడు అర్వింద్. ఈటల రాజేందర్ ఎప్పుడూ మాటలు తూలలేదు. మితిమీరి మాట్లాడలేదు. హద్దులకు లోబడి, పరిస్థితుల మేరకుమాటల తీవ్రతను పెంచతూ వస్తున్నాడు. అర్వింద్ ఎంట్రీతో ఇది ఒక్కసారిగా మారిపోయింది. సీఎం, కేటీఆర్‌లను తనదైన శైలిలో నోటికొచ్చిన మాటలతో విరుచుకుపడుతున్నాడు. ఇది ఈటల గెలుపు అవకాశాలకు గండి కొట్టేలా ఉందనే అభిప్రాయాలు బీజేపీలోనే వ్యక్తం కావడం గమనార్హం.
కొందరు సోషల్ మీడియా వేదికగా ఈ ముచ్చటను కూడా పంచుకుంటున్నారు. అర్వింద్ పై తప్పుడు వార్తను టీఆరెస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హుజురాబాద్‌లో గెలిచిన తర్వాత ముస్లింలను తొక్కిపడేస్తాం అనే విధంగా ఫేక్ వార్తను క్రియేట్ చేసి వదిలారు. ఇది రచ్చరచ్చవుతున్నది. బీజేపీ నేర్పిన విద్యనే ఇప్పుడు టీఆరెస్ ప్రయోగిస్తున్నది. బీజేపీ దారిలోనే అది పోవడానికి ఏ మాత్రం సంశయించడం లేదు.. సిగ్గుపడటం లేదు. ఎలాగైనా హుజురాబాద్‌లో గెలవాలి. అంతే.
కేసీఆర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి టీఆరెస్ కార్యకర్తల దాకా ఇదే దారి. అందుకే దేనికైనా తెగించేందుకు సిద్దపడుతున్నారు. మరోవైపు అర్వింద్ తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండించేందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ హుజురాబాద్‌లో రాజకీయం మరింత రాజుకుంటున్నది.