హుజురాబాద్‌లో ప్రధానంగా టీఆరెస్, బీజేపీల మధ్యే పోరు సాగుతున్నది. కాంగ్రెస్ కూడా లేదు బరిలో. బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా సహకరిస్తున్నదని అందరికీ తెలిసిందే. ఎలాగూ గెలిచేది లేదక్కడ కాంగ్రెస్. ఇది కేసీఆర్, ఈటల మధ్య పోరు. మరి కేసీఆర్‌కు బద్ది చెప్పాలంటే శత్రువు ఈటలవైపు నిలబడాలె. పార్టీలు, సిద్దాంతాలు తర్వాత చూస్కుందాం. ఇది ఒక ఉప ఎన్నిక మటుకే కదా. అలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. అందుకే ఇప్పుడు అయితే కారు.. లేదా కమలం. ఈరెండు పార్టీలకే ఓట్లు గుద్దుతారు అక్కడి జనం అంతా.
అయితే కొత్తగా ఇప్పుడు కొత్త గా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా ఒకటి ప్రధానంగా వినబడుతున్నది. ఇది ఎవరికి కేటాయించారో తెలియదు గానీ… ఆ గుర్తు ఎవరికన్నా ఉంటే.. దీనికి బాగానే ఓట్లు పడేట్టున్నాయి. గతంతో కారును పోలిన కొన్ని గుర్తులు ఇవ్వడం మూలంగా కారుకు దెబ్బ పడ్డదనే వార్త చదివినం కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గుర్తిస్తే మాత్రం టీఆరెస్‌కు దెబ్బపడుతుంది.
అదేందీ..? కారుకు సిలిండర్ కు ఏమీ పోలికే లేదు కదా.. ? అనుకుంటున్నారా? పోలిక లేదు కానీ, ప్రచారం మాత్రం మన టీఆరెఎస్ వాళ్లే జోరుగా చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావైతే సిలిండర్లను వెంటేసుకునే తిరుగుతుండు మీటింగులకు. దీనికి కౌంటర్‌గా బీజేపీ వాళ్లు కూడా హరీశ్‌రావు సిలిండర్ గుర్తు ను ప్రచారం చేస్తున్నాడహో.. అని ఢంకా బజాయించి మరీ సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు. ఈ సిలిండర్ ప్రచారం టీఆరెస్‌కు ఎంత మేరకు ఉపయోగపడుతుందో..? బీజేపీకి ఎంత మేర నష్టం చేస్తుందో తెలియదు కానీ.. సిలిండర్ల బండలు మాత్రం టీఆరెస్ మీటింగుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అంతటి ప్రచారం లభించింది హుజురాబాద్‌లో దీనికి.