ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు కూడా ఒకటి. పేద ఆడబిడ్డల పెండ్లిల కోసం ప్రభుత్వం లక్ష రూపాయాలను ఇస్తున్నది. ఇది పేద కుటుంబాలకు ఎంతో కొంత ఆసరా అవుతున్నది. అయితే ఇందులోనూ లంచాలు రాజ్యమేలుతున్నాయి. లంచావతారులు బయలుదేరారు. అందినకాడికి నొక్కేస్తున్నారు. మీకిస్తే మాకేమిస్తారు..అ ని బేరాలు మాట్లాడుకుంటున్నారు. పదివేల నుంచి ఇరవై వేల వరకు ఒక్కో లబ్దిదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. ఇదిప్పటి నుంచి కాదు.. ఇది గత రెండేండ్లుగా కొనసాగుతున్న తంతు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇందులో విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయట.
ఇప్పుడా రిపోర్టు ప్రభుత్వం టేబుల్‌పైకి వచ్చింది. అసలు ఇన్నాళ్లుగా ఈ పథకం అమలులో జరుగుతున్న లోపాలేమిటీ? లంచాలు ఏ విధంగా వసూలు చేస్తున్నారు.? ఏ స్థాయి అధికారులకు వాటాలు ముడుతున్నాయి… ? అనే విషయాలపై సమగ్ర నివేదిక ఒకటి ప్రభుత్వం వద్దకు వచ్చి చేరింది. తాజాగా దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. అసలు లంచాలు లేకుండా నడస్తున్న పథకంగా దీన్ని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు చూస్తే గానీ తెలియలేదు ఇందులో జరుగుతున్నలంచాల బాగోతాలు. దీనికి బాధ్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవాలనే అంశంపై విజిలెన్స్ తనదైన తరహాలో రిపోర్టును అందించి … ప్రభుత్వానికి వదిలేసింది. ఇప్పుడు ఇదే చర్చ సీఎంవోలో హాట్ టాఫిక్‌గా మారింది.
చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు ఎండార్స్ చేస్తేనే గానీ దీనిపై రెవెన్యూ వాళ్లు ఎంక్వైరీ చేయరు. ఆ ఎంక్వైరీలో అన్ని సరిగ్గా ఉంటేనే ఎలిజిబులిటీ కింద పరిగణిస్తారు. కానీ ఇలా ఎమ్మెల్యేలు స్వయంగా ఎండార్స్ చేసిన అప్లికేషన్లపైనే రాజకీయ లీడర్లు, కార్యకర్తలు లబ్దిదారుల నుంచి పైసలు గుంజుతున్నారట.ఎమ్మెల్యే సంతకం ఒకటి కాగానే అయిపోలే.. ఇంకా చాలా తతంగం ఉంది. రెవెన్యూ అధికారుల ఎంక్వైరీలో లోపం ఉందని తేలితే మీకు పైసలు రావు అని లీడర్లు, కార్యకర్తలు లబ్దిదారులను బెదిరించి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వసూలు చేసేశారట.
అయితే ఇందులో తహసీల్దార్ నుంచి మొదలుకొని కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు లంచాలు ముట్టజెప్పాలని బాజాప్తా చెప్పి మరీ లంచాలు వసూలు చేసేశారట. ఇప్పుడు ఇదే నివేదికపై రచ్చ మొదలైంది. రాజకీయ నాయకులు, కార్యకర్తలే అసలు లంచావతారులు అని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ముందు మొరపెట్టుకుంటున్నారు. మీడియేటర్లుగా వారే వ్యవహరిస్తూ లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారని, దీనికి మాకూ ఎలాంటి సంబంధం లేదని గట్టిగా వాదిస్తున్నారు. రెవెన్యూ ఎంక్వైరీలో అవకతవకలకు అవకాశం లేదని, మా పేరు చెప్పి లీడర్లే వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది.
కాగా దీనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మాత్రం ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. లంచాలు తీసుకున్నలీడర్లు బాగానే ఉన్నారు. జేబులు నింపుకున్నారు. మధ్యలో మమ్మల్ని బద్నాం చేసుడేందీ..? అని రెవెన్యూ వాళ్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ సర్కారులో ఇప్పటికే చీపయ్యాం.. ఈ ఇష్యూలో ఇంకా ఇలా ఇరికిస్తారా? ఇదెక్కడి అన్యాయం అంటున్నారు.
