ఆర్మూర్ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేసేందుకు అన్ని దారులు క్లియర్ చేసుకుంటున్నాడు. రాబోవు ఎన్నికల్లో ఆర్మూర్ నుంచే తన యుద్ద క్షేత్రాన్ని ఓకే చేసుకుంటున్నాడు. ఇప్పటికే పెర్కిట్ వద్ద ఓ ఆఫీసు తీసుకున్నాడు. అక్కడి నుంచే కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. దసరా పండుగ సందర్బంగా ప్రత్యేకంగా బీజేపీ సీనియర్ నేత లోక భూపతిరెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు. సీనియర్లందరి మద్దతు కూడగడుతున్నాడు. లోక భూపతిరెడ్డి బీజేపీ లో చాలా సీనియర్ నేత. మంచి పేరుంది. ఆర్మూర్‌లో పట్టణంలో బీజేపీ కొంత బలంగా ఉందంటే కారణం ఆయనే. ఇది అర్వింద్‌కు కలిసివచ్చే అవకాశంగా భావిస్తున్నాడు. పెద్దలతో సత్సంబంధాలు మెయింటేన్ చేస్తూ మెల్లగా ఇక్కడి నుంచి తను ఎమ్మెల్యేగా పోటీకి దారి సుగమం చేసుకుంటున్నాడు.
జీవన్‌రెడ్డిపై పోటీ చేసి ఈజీగా గెలవచ్చనే భావనలో అర్వింద్ ఉన్నాడు. మున్నూరుకాపు ఓట్లు తనకు అనుకూలిస్తాయనే ఆశతో ఉన్నాడు. ఆర్మూర్ టౌన్, నందిపేట్‌లో బీజేపీ బలంగా ఉంది. పసుపు బోర్డు గురించి నిలదీసే రైతాంగం ఇక్కడ పెద్దగా లేదు. ఇలా అన్ని అంశాలు కలిసొస్తాయని అర్వింద్ భావిస్తున్నాడు. మరోవైపు జీవన్‌రెడ్డి కూడా తన మాటల దాడి పెంచుతున్నాడు. అర్వింద్ చేసే ప్రతీ కామెంట్‌కూ కౌంటర్ ఇస్తున్నాడు. దసరా రోజు దుబాయ్ వెళ్లి కూడా అక్కడి నుంచి అర్వింద్‌పై విరుచుకుపడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో అన్నింటికంటే ముందు ఆర్మూర్ రాజకీయాలే ముందుగా వేడెక్కుతున్నాయి. ఇక్కడి నుంచే ఎన్నికల సెగ పెరగనున్నది.