ఇందూరు రాజకీయాలపై ఎమ్మెల్సీ కవిత మరింత పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో టీఆరెస్‌కు ఇది కంచుకోట. కానీ క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. బీజేపీ బలం పెంచుకుంటున్నది. కాంగ్రెస్ దూకుడుగా ముందుకు పోతున్నది. ఎంపీగా కవిత ఓడిన తర్వాత నిజామాబాద్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఒంటరిగా మారింది. కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చే నేతలు కరువయ్యారు.
చాలా రోజుల పాటు కవిత అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిన తర్వాత కూడా పెద్దగా జిల్లాలో ఆమె పర్యటించలేదు. మంత్రి పదవి ఇస్తారనే ప్రచారము జరుగుతున్నది. ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు. కాగా, కవిత ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ అపవాదును పోగొట్టుకునేందుకు ఆమె ఇకపై ఎక్కువ సమయం ఇందూరుకు కేటాయించనున్నారు. ఈ దసరా పండుగకు ఆమె కుటుంబ సమేతంగా ఇక్కడే గడపనున్నారు.
రేపటి నుంచి దసరా వరకు ఆమె నిజామాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నేతలను, ప్రజలను కలవనున్నారు. స్థానికంగా వారికి వారం రోజుల పాటు అందుబాటులో ఉండనున్నారు. ప్రజల వినతులను స్వీకరించనున్నారు. మంత్రి పదవి వరించిన తర్వాత ఆమె మరింత సమయాన్ని ఇందూరు రాజకీయాలకు కేటాయించనున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ.. పార్టీని బలోపేతం చేసే అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.
అసంతృప్తి నేతలను కూడా ఆమె సముదాయిస్తున్నారు. ఓపిక పడితే భవిష్యత్తు ఉంటుందని చెబుతూ వస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యేకు ఆర్టీసీ చైర్మన్ గా ఇప్పించుకున్నారు. ఇంకా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి భరసానిస్తున్నారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెబుతున్నారు. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారందనికీ సముచిత న్యాయం జరిగేలా చూస్తానని హామీనిస్తూ వస్తున్నారు.