హారన్ మోతతో తన ఇంటి ముందు నుంచి కారు ఒకటి వెళ్తూ కనబడింది. ‘ఎవరిదా?” అని అతని చూపులు అటువైపు సారించాడు.
అది విఠల్ కారు. విఠల్ తన వైపు చూశాడు. విండో నుంచి చేతి బయటకు పెట్టి విష్ చేశాడు. ‘నమస్తే’ అన్నట్లుగా.
అచేతనంగానే తను చేతి లేపాడు. నోట్లో నుంచి మాత్రం మాటరాలేదు. “విఠల్ ఇప్పుడు ఇంటికి వస్తున్నాడా?” ‘మరి రాత్రి బైక్ పై వచ్చిందెవురు? అతను కాదా? అయితే మరెవరు??” అని కారు వెళ్లిన వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనకు బ్రేక్ వేస్తూ ఫోన్ మళ్లీ రింగయ్యింది.
వెంటనే కదల్లేకపోయాడు. శరీరం మొద్దు బారినట్లనిపించింది. నేలకు చేతి ఆనించి లేవబోయాడు. ఫోన్ రింగ్ ఆగిపోయింది. మళ్లీ అలాగే కూలబడ్డాడు. ఇంతలో భార్య లేచింది.
డోర్కు అడ్డంగా కూర్చున్న తనను తాకుతూ దాటుకుంటూనే బయటకు నడిచింది. చేతిలో చీపురు ఉంది.
‘దీనికెంత పొగరు? పక్కకు జరగండి’ అని అనొచ్చు కదా. అని అనుకున్నాడు. భార్య ముఖం చూడాలనుకున్నాడు. కానీ ఆమె ముఖం కనిపించకుండా వాకిలి ఊడుస్తున్నది. వాకిలి ఊడ్చినతర్వాత డ్రమ్ లోని నీళ్లు జగ్గుతో కళ్లాపిలా చల్లేది.
రాత్రి వర్షం పడటంతో వాకిలి అంతా పచ్చి పచ్చిగా ఉంది. అందుకే నీళ్లు చల్లలేదు. బయట కిటికీలో ఉన్న ముగ్గు తీసి వేస్తోంది. చీపురు పుల్లతో పిల్లలు కసకసా నేల పై రాసినట్లుగానే వేగంగా ముగ్గు వేసింది. క్షణాల్లో ముగించేసి దాన్ని మళ్లీ కిటికీలోనే పెట్టి.. చీపురును అరుగు పక్కగా వేసింది. మళ్లీ ఇంట్లోకి వస్తోంది. అది గమనించిన రాజారెడ్డి తనే పక్కకు జరిగి ఆమెకు దారిచ్చాడు. ఈసారి దారివ్వకపోతే తనను తన్నుకుంటూ పోతుందోమోనని అనుకున్నాడు. లోపల వంట పనిలో నిమగ్నమైంది వనజ.
వేప చెట్టుకు చిన్న కొమ్మను తెంపుకొని ఆ పుల్లను నోట్లో వేసుకున్నాడు. రోజు మాదిరిగా అది అంత చేదుగా అనిపించలేదు. ‘కరోనా వస్తే రుచి తెలియదంట.. చేదు కూడా రాదంట..’ అని మనసులో అనుకొని మళ్లీ భయపడ్డాడు. ఆలోపే మళ్లీ ఫోన్ రింగయ్యింది.
వెళ్లి చూశాడు. బాస్ పరమేశ్,
‘ఇంత పొద్దున్నే చేశాడేందీ?’ అనుకుంటూ. “సార్ గుడ్ మార్నింగ్…. ‘గట్టిగానే అన్నా ఆ మాటలు లోగొంతులోంచి వచ్చినట్లే మెల్లగా వినిపించాయి.
అక్కడ్నుంచి వినవస్తున్న మాటలతో రాజారెడ్డి ముఖంలో రంగులు మారుతున్నాయి. “సర్…..”ఏదో చెప్పబోతున్నాడు. కానీ అవతల వినిపించుకునేలా లేడు పరమేశ్. తను చెప్పేది చెప్పేశాడు.
ఫోన్ కట్ అయ్యింది. తల మొద్దు బారినట్లనిపించి అలాగే పక్కనున్న బెడ్ పై కూలబడ్డాడు. చెవులు దిమ్మెరపోయినట్లనిపించాయి. బయట శబ్దాలు వినిపించనంతగా చెవులు పట్టేశాయి. బాస్ చెప్పిన మాటలు మాత్రమే గింగిర్లు తిరుగుతున్నాయి. “మేనేజ్ మెంట్ నిన్ను రెస్ట్ తీసుకోమంటుంది……” “నీ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకోమ్మన్నది.” “ఈ రోజు నుంచి నువ్వు వార్తలు రాయొద్దు”
తనను ఉద్యోగం నుంచి తీసేశారనే వార్త రాజారెడ్డిని స్థిమితంగా ఒక్కచోట ఉండనివ్వడం లేదు. ఆలోచనలు పరిపరి విధాల సాగుతున్నాయి.
అనారోగ్యంతో మంచి పట్టిన తనకు ఆఫీసు నుంచి సానుభూతి దొరుకుతుందనుకున్నాడు. కానీ ‘యూజ్ అండ్ త్రో’ లాగా ఇలా వాడుకుని విదిలించుకుంటారని కలలో కూడా అనుకోలేదు.
తనన కలల సౌధాలు ఒక్కసారిగి పేకమేడల్లా కళ్ల ముందే కూలిపోతున్న ఫీలింగ్ అతనికి కలుగుతున్నది. ‘పత్రిక కోసం ఎంత చేశాను?” ‘ఇదా తనకు వాళ్లిచ్చే గౌరవం?” ‘ఈ ఛీత్కారమే నాకు సత్కారమా?” ‘ఇసుమంత మానవత్వం కూడా లేదా?” ‘ఏమాత్రం కరుణ లేని వీళ్లంతా కరోనా కన్నా దారుణం కాదా !’
తనలో తానే ఏవోవే ఆలోచిస్తున్నాడు రాజారెడ్డి శూన్యంలోకి చూస్తూ.
ఇంటి ముందు ఆటో ఆగింది. వనజ కోసం ఆటో డ్రైవర్ కేకేస్తున్నాడు. “వస్తున్నా… అన్నా” అని రిప్లై ఇచ్చింది వనజ. వడి వడిగా టిఫిన్ బాక్సు చేతబట్టుకుని ఆమె వెళ్లిపోతున్నది. తనవైపు కనీసం చూడకుండానే. పరిసరాలేవీ గమనించే స్థితిలో లేడు రాజారెడ్డి. “ఈ విషయం ఇంట్లో తెలిస్తే…? నా పరిస్థితి ఏందీ?” భయపడుతున్నాడతను. “తెలియకుండా ఉంటుందా?” ” మరి తర్వాతేం చెయ్యాలి?” ఆలోచనలు సుడులు రేగుతున్నాయి. “హెడ్డాఫీసులో మాట్లాడితే…” ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయడం లేదు. మళ్లీ పరమేశ్ కు ఫోన్ కలిపాడు. ఒక్క అవకాశం కోసం ప్రాధేయపడాలనే తలంపుతో. ఒక్కరింగ్ తర్వాత వెంటనే బిజీగా ఉన్నారు అని వస్తుంది. అంటే తన కాల్ ను ‘బ్లాక్’ చేసేశాడన్నమాట. పూర్తిగా అర్థమయ్యింది రాజారెడ్డికి. తనకు ఇక ఏమాత్రం అవకాశం లేదని. దారులన్నీ మూసుకుపోయాయని.
తల దిమ్మంటుంది.
“హ హ హ……”
బిగ్గరగా నవ్విన సౌండ్ వినవచ్చింది రాజారెడ్డికి. ఎక్కడా అని చుట్టూ చూశాడు. అద్దంలో తన ముఖం కనిపిస్తున్నది.
కానీ అది నవ్వుతూ చేతితో తన వైపు చూపుతూ తనను గేలి చేస్తున్నది. “ఎందుకు నవ్వుతున్నావ్?” అడిగాడు రాజారెడ్డి. గొంతు పూడుకుపోతున్నది.
“నీ కలెక్టర్ ఉద్యోగం ఊడిపోయింది. ఇగ ఏం చేస్తావ్? నీతో ఏం పని సాధ్యమవుతుంది? ” అన్నది అది. నవ్వును ఆపుకుందామన్న దాని తరం కావడం లేదేమో. మూతి మూసుకొని నవ్వుతూనే ఉంది.
“ఏం చెప్పాలే దానికి?” “ఏదో ఒకటి చేస్తాలేవోయ్? అవునూ, నువ్వెందుకు సంకలు గుద్దుకుంటున్నావ్ ? ” – “దీన్నే పట్టుకొని ఇదే లోకంగా బతికినావ్ కదా? ఇపుడైన తత్వం బోధపడ్డదా? ఆసాంతం నిన్ను నాకి వదిలేశారని” అన్నది అది.
మనసు చివుక్కుమన్నది రాజారెడ్డికి. “ఇపుడు నీకు ఏదీ లేదు. పెద్ద మర్యాద, గౌరవం అంటావు కదా…
ఇపుడు వెళ్లి చూడు అది ఎక్కడ దొరకుతుందో ” అన్నది.
“అంటే నన్ను సమాజం వెలివేస్తుందా? ఎవరూ గుర్తించరా? ఇన్ని రోజులు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా?”
ఆలోచిస్తున్నాడు. “ఇప్పటికైనా వేరే పని వెతుక్కోరా వెర్రివాడా” అన్నది అంతరంగం. “ఏం పని? ఇంకేంపని? నాకింకేం పని వస్తుంది?”

మదిలో ఆలోచనలతో సతమతమవుతున్నాడు.
“ఇప్పటికైనా నీకు మంచి అవకాశం. మారడానికి. ఏదైనా పనిచెయ్యి. భార్యకు చేదోడువాదోడుగా ఉండు. కనీసం ఇప్పటికైనా కుటుంబ బాధ్యత తెలుసుకున్నావని సంతోష పడతాం” అన్నది అంతరంగం. .
“అంటే ఇప్పటిదాకా నేను బలాదూర్ గా తిరిగానా?” అన్నాడు రాజారెడ్డి. అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన పరిస్థితిని చూసి తనకే జాలి వేస్తున్నది. ఈ సమయంలో కూడా ఎవరూ తనను అర్థం చేసుకోవడం లేదని అతను మరింత మదనపడుతున్నాడు.
“ఇన్ని రోజులు నువ్వు చేసింది కాలాయాపనే నా దృష్టిలో. నీకు అది తృప్తినిచ్చిందేమో గానీ, నీ కుటుంబానికి మాత్రం ఏ విధంగానూ ఉపయోగపడలేదు.”అన్నది మళ్లీ అంతరాత్మ.
“ఇది సరిపోదంటూ చేతులారా ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకున్నావ్… సంపాదించే టైమ్ కరిగిపోయింది.
రోగాల కుప్పగా మార్చుకున్న శరీరం మిగిలివుంది.”
“ఇపుడు నువ్వు సాధించేదేదీ లేదు… వేడి నీళ్లకు చన్నీళ్లుగా ఏదో పనిచేసి కుటుంబానికి ఆసరాగా ఉండు.” అన్నది అంతరంగం.
జ్ఞాన బోధ చేస్తున్నట్టు. అది మంచి మాటలు చెప్తున్నట్లుగా లేదు రాజారెడ్డికి. తనను దెప్పి పొడుస్తున్నట్లుగా ఫీలవుతున్నాడు. గుండెలో చాకుతో కసకసా పొడిచి చంపినట్లుగా తోస్తున్నది తనకు.
పట్టరాని కోపం వచ్చింది అది అతన్ని పూర్తి అసమర్థునిగా అభివర్ణించినందుకు. పక్కనే స్టూల్ పై ఉన్న స్టీల్ గ్లాస్ ను అద్దానికేసి విసిరికొట్టాడు. భళ్లున పగిలిందది.
అప్పటికే అది పగిలి ఉంది. ఈ దెబ్బతో అద్దం ముక్కలు ముక్కలై అవి నేలకు పడ్డాయి. నేల మీద పడగానే పగిలి చిన్న చిన్న ముక్కలుగా చెల్లాచెదురయ్యాయి.
పెద్ద కూతురు లోనికి వచ్చి చూసింది. ఏం జరిగిందోనని. అక్కడేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నదామె కళ్ళతోనే. తండ్రి ముఖంలోకి చూసింది.
కోపంలో భయంకరంగా కనిపిస్తున్నది అతని ముఖం. అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేదామె. లోనికి పరిగెత్తింది.
ఆన్ లైన్ క్లాసులో నిమగ్నమయ్యింది. కొద్ది సేపటి తర్వాత తేరుకున్నాడు రాజారెడ్డి. చెల్లాచెదురుగా పడిన గాజు ముక్కలను చేతితో ఏరేశాడు. పగిలిన అద్దం తీసి సెల్ఫ్ పై విసిరేశాడు. గరం గరం చాయ్ తాగాలనుకున్నాడు. “చిట్టి చిట్టి చాయ్ తీసుకురా అమ్మ” అన్నాడు. ఇది వరలో అయితే లేవకముందే బెడ్ కాఫీలా చాయ్ వచ్చి ఉండేది. ఇపుడు అడుక్కున్నా ఇంత
చాయ్ ముఖానా కొట్టేటట్టు లేరు అనుకున్నడు.
మళ్లీ కేకేశాడు.
మూడోసారి గట్టిగా పిలిచాడు. కాదు అరిచినంత పనిచేశాడు. గాబరా గాబరాగా లోపలకి వచ్చింది అనన్య. తండ్రి ని చూసింది ఎందుకు పిలిచావ్?” అన్నట్లుగా. “చాయ్ తెమ్మని ఎన్నిసార్లు అరవాలి?”
“నీకే. బెల్లం కొట్టిన రాయిలా చప్పుడు చేయవేం.”
…………..
“వెళ్లి తీసుకురా” అన్నాడు. అనన్య ముఖంలో మరింత ఆందోళన పెరిగింది. భయం భయంగా చూస్తూ… “అమ్మ పాలు తీసుకురాలేదు.” అన్నది బిక్కుబిక్కుమంటూ. రాజారెడ్డి ముఖం ఎర్రగా మారింది.
అంటే చాయ్ కూడా ఇవ్వరన్నమాట ఇకనుంచి అనుకున్నాడు. అది ఊహించుకుంటేనే తనపై తనకు కంపరం పుడుతున్నది.
కోపం వస్తుంది. కానీ బిడ్డతో ఏం అనగలడు. ఈ సమయంలో భార్య ఇంట్లో ఉండి ఉంటేనా కసితీరా తిట్టేవాడిని అనుకున్నాడు.
అసలు నా గురించి ఏమనుకుంటుందో కడిగేసేవాణ్ణి అని కూడా అనుకున్నాడు.
వెంటనే తనకు జాబ్ పోయిన విషయం గుర్తొచ్చి… చల్లటి చెమటలు పట్టాయి. తండ్రి వాలకం చూసి అనన్యకు ఏమి చేయాలో బోధపడటం లేదు. వెళ్లిపోవాలా? మాట్లాడాలా? “ఏం చేస్తే ఏం తప్పు పడతాడో. ఏం చేసేది?” రెండు చేతులు నులుముకుంటున్నది టెన్షన్ గా “సరే… నువ్వెళ్లు” అన్నాడు రాజారెడ్డి బిడ్డను. హమ్మయ్య అంటు వెళ్లబోయిందామె. “కొన్ని మంచినీళ్లన్నా తెచ్చిస్తావా?” అన్నాడు. ఆమె వెళ్లేలోపే…
“నీళ్లు కూడా లేవంటావా ?” అనబోయాడు. తమాయించుకున్నాడు. అనన్య వెళ్లి గ్లాసులో నీళ్లు తెచ్చి స్టూల్ మీద పెట్టి వెళ్లబోయింది.
“ఏం చేతికిస్తే ఏమవుతుంది?. అక్కడ పెట్టావు?” అన్నాడు కసురుకున్నట్లుగా. తండ్రి అలా అంటాడని ఆ పిల్ల ఊహించలేదు. వెంటనే గ్లాసును అందుకోబోయింది. “వద్దులే. నాకు తీసుకోరాదా?” అన్నాడు మళ్లీ .
తీసుకొని గటగటా ఒక్కగుక్కలో నీళ్లన్నీ తాగేసి విసురుగా స్టూల్ పై పెట్టాడు. అది సరిగా నిలబడలేదేమో.. ఊగుతూ ఊగుతూ కింద పడిపోయింది. టన్ టన్… టన్ టన్ టన్ అని గిరి గిరా తిరిగి ఒకదగ్గర నిలిచిపోయింది. లోపలి గదిలోకి ఈ సౌండ్ వినిపించింది.
కానీ ఎవ్వరూ లోనికి రావడానికి సాహసించ లేదు. ఆ గ్లాసు వైపే చూస్తున్నాడు రాజారెడ్డి. అంతలోనే ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది. అన్యపదేశంగా అది ఏంటా అని చదివాడు. “ఆన్లైన్ క్లాసులను నిరవధికంగా నిర్వహిస్తున్నాం. దయచేసి మీ
పిల్లల ఫీజులు చెల్లించండి. మీరు చెల్లించే ఫీజలతోనే సంస్థ నిర్వహణ కొనసాగుతుందనే విషయం మరవకండి”
అదీ మెసేజ్ సారాంశం.
“ఓహెూ ఇపుడు ఇదొకటి మోపైందా?” అసహనంగా అనుకున్నాడు రాజారెడ్డి. “ఉన్న ఉద్యోగం పోయింది. ఫీజులెలా కట్టాలి?” ఆలోచిస్తున్నాడు రాజారెడ్డి.
“అప్పు చేయాలి.” అని అనుకొని.. ” ఇప్పటికే చేసిన అప్పులు తీర్చలేదు. ఎవరిదగ్గరకెళ్లి అడగాలి? ఎవరిస్తారు? ఈ కరోనా టైమ్ లో?”
అతని ఆలోచనలు కొనసాగుతున్న తరుణంలోనే సెల్ కు మరో మెసేజ్ వచ్చింది. అన్యపదేశంగా దాన్ని చూశాడు. తన భార్య నుంచి వచ్చిన మెసేజ్ అది. ఏం పంపిందబ్బా అని ఆసక్తిగా మెసేజ్ ఓపెన్ చేశాడు.
పిల్లల ఫీజులు కట్టాలని మేనేజ్ మెంట్ నుంచి వచ్చిన మెసేజే అతనికి ఫార్వార్డ్ చేసింది భార్య వనజ. అప్పటి వరకు ఎలా కట్టాలని ఆలోచిస్తున్న రాజారెడ్డికి మళ్లీ భార్య నుంచి అదే మెసేజ్ రావడంతో చిర్రెత్తుకొచ్చింది. “నా బాధ్యతను గుర్తు చేస్తున్నదా? అంత బాధ్యతారాహిత్యంగా నేనున్నానా?”
అతన్ని భార్య అవమానించినట్లు ఫీలయ్యాడు. “కడుతానే .. బోడి నువ్వు నాకు చెప్పేదేందీ?” మళ్లీ మనసులో అనుకొని ఫోన్ పక్కన బెడ్ మీద విసిరేశాడు.

(ఇంకా ఉంది)

You missed