ఏమీ కనిపించవే? అసహనం పెరిగిపోతున్నది. చివరి డబ్బాలో అటుకులు కనిపించాయి. అటుకులు అంటేనే రాజారెడ్డికి అసహ్యం.
కానీ ఇపుడవి అతనికి పరమాన్నంలా కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న అటుకులను ఓ గిన్నెలో పోశాడు. పక్కడే డబ్బాలోంచి మంచినూనె తీసి అందులోకి కొంచెం ఒంపాడు. కారం డబ్బాలో నుంచి కారం పొడితీసి దానిపై చిలకరించాడు.
చెంచా తీసుకొని దాన్ని కలియతిప్పాడు. ఇక ఆగడం తరం కాలేదు. చెంచాను పక్కకు పడేసి పిడికిట తీసుకొని బుక్కలు బుక్కలుగా తినసాగాడు. ఆకలి రుచి ఎరగదంటారు. అంత కారంపొడి చల్లుకున్నా అతనికి కారం తెలియడం లేదు. కొన్ని ఉల్లిగడ్డలు కోసుకొని అందులో వాటి ముక్కలు వేసుకొని తింటే ఇంకా బాగంటుందనుకున్నాడు. కానీ ఇపుడు వాటిని కోసేంత ఓపిక తనకు లేదు.
ఆవురావురమని క్షణాల్లో తిని గిన్నెను పక్కన పడేశాడు. కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత ప్రాణం లేచొచ్చినట్లనిపించింది.
వడివడిగా బెడ్ రూంలోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. శరీరంలో వణకు తగ్గింది.
ఇపుడు టీవీ చూడాలనిపించింది రాజారెడ్డికి. కొన్ని నిమిషాల కిందట హత్య చేసినంత పనిచేసిన రిమోట్ ను సుతిమెత్తగా తీసుకున్నాడిప్పుడు. ఒక్కొక్క చానల్ మార్చుతూ పోతున్నాడు.
ఒక్కసారిగా మదిలో ఓ ఆలోచన వచ్చి క్షణ కాలం ఆగిపోయాడు. ఇంతకు పిల్లలు, వనజ అన్నం తిన్నారా? మదిలో ఆ అనుమానం రాగానే వెంటనే వాళ్ల వద్దకు వెళ్లి చూశాడు రాజారెడ్డి. వాళ్లు ఆదమరిచి నిద్రపోతున్నారు. వనజను నిద్రలేపి అడగాలనుకున్నాడు.
కానీ తన గురించి పట్టించుకోని వనజను లేపాలనిపించలేదు. ‘తిన్నారా?” అని అడగాలనిపించలేదు. తినే ఉంటారు. అనుకున్నాడు.
వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాడు.
ఏవోవే కార్యక్రమాలు వస్తున్నాయి. కొద్ది సేపటి వరకు చానళ్లు మారుస్తూ పోతున్నాడు. మనసులో మళ్లీ ఆలోచనలు రేగుతున్నాయి. “ఎలా? మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదని టార్గెట్ల గొడవ తప్పింది. ఇపుడు మళ్లీ అడుగుతారు. ఏం చెప్పాలి? ఎలా చెయ్యాలి?” తలనొప్పిగా ఉన్నట్లనిపించింది.
“ఏదో ఒకటి చెప్పి ఇంకొన్ని రోజులు ఇలాగే గడిపేయాలి.”అనుకున్నాడు అప్పటి వరకు కరోనా తగ్గుముఖం పడితే కొంతలో కొంత చేసి చూపాలనుకున్నాడు. “ఏం పరిస్థితులు దాపురించాయిరా?” అని తిట్టుకున్నాడు.
ఆలోచనల మధ్యనే మళ్లీ ఆకలి మొదలైంది. తిన్నది ఏ మూలకు కూడా సరిపోనట్టుంది రాజారెడ్డికి. అటుకులు అయిపోయాయి. ‘ఇంకేముంది తినడానికి?” అనుకొని.. వెళ్లి కొన్ని నీళ్లు తాగి వచ్చాడు.
‘షుగర్ పేషెంట్లకు ఆకలెక్కువ అంటారు’ అనుకున్నాడు. “కాదు కాదు దరిద్రులకు ఆకలెక్కువ ” మళ్లీ తనే అనుకున్నాడు. “ అంటే నేను దరిద్రుడినా?”
“కరోనా దరిద్రంది.” “మా బాస్ పరమేశ్ దరిద్రుడు.” “నా బంధువులు దరిద్రులు.” “వనజ దరిద్రంది…” “వనజ తల్లిదండ్రులు దరిద్రులు.” తనను వీళ్లెవరూ గుర్తించడం లేదు మరి. ఇపుడు మనసు కొంత చల్లబడింది. టీవీ చూస్తున్నాడు. ఒక చానల్ లో యాడ్ వస్తుంది.
నున్నగా గుండు చేపించుకున్నవాడొకడు వచ్చి “మాస్కులు ధరించకుండా బయటకు రాకండి… ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి” అని చెప్తున్నాడు.
రాజారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. “నగలు కొనాలా? నీ యవ్వ. ఎక్కడివిరా పైసలు. ఇపుడు ఎవడన్నా నగలు కొనేటట్టు ఉన్నడారా? ఉన్నవి తాకట్టు పెట్టుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు రా గాడిదకొడుకా.” కసిగా తిట్టుకొని చానల్ మార్చాడు.
‘బిగ్ బాస్’ వస్తున్నది. “ఓహెూ దీన్నే ఎగబడి ఎగబడి చూస్తున్నారు జనమంతా” అనుకున్నాడు.
“ వాళ్లు రసహ్యంగా మాట్లాడుకునేటివి… తిట్టుకునే తిట్లు వినుకుంట మనం సంకలు గుద్దుకోవాలన్నమాట. వాళ్లు కొట్టుకుంటే సంబరపడాలి… ఎవడురా ఈ ప్రోగ్రాం కనిపెట్టింది చిల్లరనాకొడుకు. ” మళ్లీ కసి తీరా తిట్టుకున్నాడు. ” పక్కింటోడి బెడ్ రూంలో సీసీ కెమెరా అమర్చి అక్కడేం జరుగుతుందో ఇలా నట్టింట కూసుని
పిల్లా జిల్లా అంతా వీక్షించాలన్నమాట. అబ్బ ఎంత క్రియేటివిటీ? ఏమి ఆలోచన?? జనం వీక్ నెస్ ఏందో తెలుసుకొని దాన్ని సొమ్ము చేసుకోవాలంతే. అది మంచా చెడా అవసరం లేదు వీడికి. ఏదన్నా మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండిరా సొల్లుముండాకొడుకుల్లారా!
ఎంత తిట్టుకున్నా మనసు నెమ్మదించడం లేదు రాజారెడ్డికి. కొంచెం బీపీ పెరిగిందేమో అనిపిస్తుంది. చమటలు పడుతున్నాయి. బయట వాతావరణం చల్లగా ఉంది. వాన చినుకులు పడుతున్న చప్పుడు వస్తున్నది. అప్పుడప్పుడు ఉరుముల శబ్దం వినిపిస్తున్నది. ఉరుములు వచ్చినప్పుడల్లా టీవీలో బొమ్మ కొద్ది షేక్ అయి మళ్లీ వస్తున్నది.
ముసలవ్వ ‘మంగవ్వ’ కన్ఫెషన్ రూంలో మాట్లాడుతూ బోరున విలపిస్తున్నది. “నన్ను బయటకు పంపించండి రా బాబు మీ బాంచన్” అని వేడుకుంటున్నది. కానీ వాడు పిగ్ బాస్ వింటలేడు. గాడిద గొంతేసుకొని “మీరుండాలె’ అని శాసిస్తున్నాడు. ముసలిదాన్ని చూస్తే రాజారెడ్డికి కోపం, జాలి, సానుభూతి ఒకే సారి కలిగాయి.
“ఆ ప్రోగ్రాంలోకి ఎందుకు పోయినవే ముసలానా? నువ్వుంటే షో రక్తికడుతదని వాళ్లు అనుకున్నారు. నీ ఆరోగ్యం, నీ ఇష్టాయిష్టాలతో వాళ్లకేం పనే. మంచిగా ఊర్లో ఉండి పొలం పనులు చూసుకొని ఉండక. పోయే కాలం కాకపోతే నీకిదేం ఆలోచన?” అనుకున్నాడు.
“పనిపాట లేని పాగల్ గాళ్లను తీసుకొచ్చి ఓ రూమ్ లో పడేసి తైతక్కలాడిస్తున్నారు. మనం ఈళ్లను పాగల్ గాళ్ల లెక్క చూసుకుంట… టైం,నిద్ర అన్నీ కరాబ్ చేసుకోవాలె” అని తిట్టుకున్నాడు రాజారెడ్డి.
మళ్లీ ఒక డౌట్ వచ్చింది. ‘జనాల్ని సర్వ నాశనం చెయ్యడానికి, చెడిపోవడానికి, పక్కదారి పట్టడానికి ఎన్ని చేయాల్నో అన్ని చేస్తున్నారు. ఇన్ని చేస్తే మరి ఆపేవాళ్లే లేరా? అందరూ చూస్తున్నరు. ఎంజాయ్ చేస్తున్నరు.”
‘ఏదైనా అరాచకం, దుర్మార్గం, అఘాయిత్యాలు జరిగితే మాత్రం ఎంత ఘోరం? వాడిని కాల్చేయాలి. వాళ్లను | తగుల బెట్టాలి. వాడిని నరికేయాలి. వారిని నడిరోడ్డు మీద ఉరితీయాలి… ఇలా ఎవడికి వాడే జడ్జిమెంట్లిస్తారు’. అనుకొని నవ్వుకున్నాడు.
‘చెడిపోవడానికి ఇన్ని ద్వారాలు తెరిచి .. వాడు లోయలో పడ్డాడురా వాడి ఖర్మ అన్నట్లుంది. ఈ రోజు ఆడు పడ్డాడు. రేపు నువ్వు పడ్డావు. కొంచెం లేటు అంతే. అందరూ ఆఖరికి ఖతం కావాల్సిందే. ”
‘అసలు ఈ ప్రపంచమే నాశనమైపోతే బాగుండు. భూమి మీద ఉన్న ప్రాణులన్నీ అంతరించిపోయి ఓ కొత్త ప్రపంచం మళ్లీ పుడితే?” “అబ్బ’ అనుకున్నాడు. ఆ
ఊహే గమ్మత్తుగా తోచింది రాజారెడ్డికి. ఇపుడు మనసు కొంత నెమ్మదించింది. ‘పిగ్ బాస్’ అయిపోయినట్లుంది. మళ్లీ మొదట్నుంచి వేస్తున్నాడు వాడు.
‘మాకేం పనిలేదు ఇగ దీన్నే అర్థరాత్రి వరకు చూసుకుంట కూసుంటం’ అని మనసులో తిట్టుకొని పోయి టీవీని బంద్ చేశాడు.
వర్షం జోరు పెరుగుతున్నది. పట పట పట అని పైన రేకుల చప్పుడు వినిపిస్తున్నది. బెడ్ మీద కళ్లు మూసుకొని పడుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజారెడ్డి. రేకులపై వర్షం చప్పుడు జోల పాట పాడినట్లుగా అనిపిస్తున్నది. మగతగా కళ్లు మూసుకుంటున్నాయి. నిద్రలోకి జారిపోయాడు మెల్లగా రాజారెడ్డి తనకు తెలియకుండానే.
*****
“ఓరేయ్ రాజారెడ్డి… రేయ్ రెడ్డీ” అని ఎవరో పిలిచినట్లైంది. ఉలిక్కిపడిన రాజిరెడ్డి “ఎవరు?” అన్నాడు చుట్టూ చూస్తూ.
“ప్రపంచంలోని అన్ని సమస్యలు మాట్లాడుతావు. మేథావిలా వాటి పరిష్కారాల కోసం ఆలోచిస్తావు. మరి ఇంట్లో వాళ్ల గురించి పట్టించుకోవేందిరా…. వెధవ సన్నాసి” అని మాటలు వినిపించాయి.
“ఏయ్ ఎవడ్రా నువ్వు ?” అన్నాడు రాజారెడ్డి గట్టిగా. చుట్టూ చూస్తూ. ‘నేను నీ అంతరాత్మను రా” అన్నది అవతలి నుంచి ఆ కంఠం.
“నేను ఇంట్లో వాళ్ల గురించి పట్టించుకోలేదా? ఏం మైండ్ దొబ్బిందా నీకు? నా గురించే నా పెళ్లాం పట్టించుకోవడం లేదు.” అన్నాడు. “అయినా ఇవన్నీ దీని కెందుకు చెప్పాలి” అని అనుకున్నాడు.
“కడుపులో కాలి గాదిదలా ఏదో గతికినవ్.. మరి వాళ్లు తిన్నారా అని అడిగినావా?” “తినకుండానే పండుకున్నారా.? చూడు ఒకసారి ఒళ్లు తెలియకుండా ఎలా ఆదమరిచి నిద్రపోతున్నారో”,
“ఆ వంటగదిలో గిన్నెలన్నీ వెతికివన్ కదరా సన్నాసీ.. అసలు వంటనే చేయలేదనే విషయం కనిపెట్టలేకపోయావ్ కదరా పనికిమాలిన వెధవ”
“అవునా?” అనుకున్నాడు రాజారెడ్డి. ‘అయ్యో పిల్లలు ఏమి తినకుండా పడుకున్నారా?” అని అనుకొని.. ఆ భావం కనిపించనీయకుండా “నేనేం అన్నాను. మరి తినొచ్చు కదా. ఎందుకలా? ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుందా అది.
దాని తెలివి నానాటికీ మోకాళ్లలోకి జారిపోతున్నది” అన్నాడు రాజారెడ్డి. తన తప్పేం లేదన్నట్టుగా.
“నువ్వు చేసింది గొప్ప పని అనుకుంటున్నావా రా గాడిదకొడుకా”అన్నది. అంతరాత్మ గొంతులో కోపం ధ్వనించింది. సందు దొరికింది కదా అని అది ఇష్టమొచ్చినట్లు తిడుతున్నదని అంతరాత్మ మీద విపరీతమైన
కోపం వచ్చింది రాజారెడ్డికి. తమాయించుకొని…
“నేనేం చేశాను ?” అన్నాడు అమాయకంగా. గుర్తొచ్చింది. ‘భార్యను కొట్టాను కదా అందుకే అయివుంటుంది” అనుకొని మళ్లీ అమాయకంగా ముఖం పెట్టి చూస్తున్నాడు.
“పెండ్లాన్ని గొడ్డును బాదినట్లు బాదావ్ కదరా బాడ్కావ్…. అది అంత పెద్ద తప్పేం చేసిందిరా? తన సంపాదనతోనే పిల్లలను సాకుతున్నది. అన్ని బాధ్యతలు మోస్తున్నది. ఆడదాని పని, మొగోడి పని అన్నీ చేసుకుంటున్నది.”
కొద్ది సేపు ఆగింది అంతరాత్మ.
“నువ్వు చేస్తున్నదేమిటిరా బోడి. దాన్నేడైనా సుఖపెట్టావా? పిల్లలను సంతోషపెట్టావా? పే… ద్ద కలెక్టర్ ఉద్యోగంలా ఫీలవుతావు నీవు నీ బోడి రిపోర్టర్ ఉద్యోగానికి.” అన్నది కసిగా.
“నీ చాతగాని తనానికి తగ్గట్టుగా భలే దొరికిందిరా నీకా పనికిమాలిన ఉద్యోగం” అన్నది. కడపులో ఉన్న కసంతా బయట పెడుతున్నదది.
“అసలది ఉద్యోగమేనారా?.. నీ కన్నా అడ్డమీద కూలి నయం రా” ముఖం ఎర్రగా మారింది రాజారెడ్డికి.
“ఛీ ఛీ ఆఖరికి ఇది కూడా నన్ను అర్థం చేసుకోలేదు” అనుకున్నాడు. అది తిట్టే తిట్లకు తలకొట్టేసినంత పనైంది అతనికి.
“పెండ్లయిన నాటి నుంచి నువ్వు ఇలా ఏనాడైనా ప్రవర్తించావా? ఏమైంది రా నీకు? ” “మరీ పిచ్చోడిలా చేస్తున్నావ్?” అన్నది అంతరంగం రాజారెడ్డిని మరింత ఉడికిస్తూ. “
రాన్రాను రాజు గుర్రం గాడిదైందట అట్లా ఉందిరా నీ పరిస్థితి? ఇకనైనా మారు. వాళ్లను బాధపెట్టకు “అన్నది మనసు. రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా.
“అంటే అంతా నాదే తప్పంటావా? నేనెందుకు అలా చేశానో.. నా బాధేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరా?” రాజారెడ్డి వితండవాదానికి దిగాడు.
“నేను జర్నలిస్టుగా ఎంతటి పేరు సంపాదించాను. నా వల్ల కుటుంబానికి మంచి పేరు వచ్చింది కదా. సంఘంలో పరపతి పెంచాను కదా.” అన్నాడు.
“అలాంటి నాకు ఇంట్లో మర్యాద ఇవ్వకపోతే … కోపం రాదా?” అన్నాడు ఆవేదనగా.
“సంఘంలో పరువు, పరపతి పక్కకు పెట్టవోయ్ .. ముందు నువ్వు నెలకు ఎంత సంపాదిస్తున్నావు? ఇంట్లో ఖర్చులకు ఎంతిస్తున్నావ్? అసలు ఎలాంటి బాధ్యతలను నువ్వు మోస్తున్నావ్? ముందు అది చెప్పు బే” అన్నది
అంతరాత్మ. దానికి తిక్కరేగుతున్నది. రాజారెడ్డి తన లోపాలను తెలుసుకోకపోగా సమర్థించుకుంటూ మాట్లాడేసరికి కోపం నశాలనికంటింది.
“ఈ కరోనా టైంలో ఏ రంగం సాఫీగా ఉంది కనుక. పరిస్థితులు అర్థం చేసుకోవాలె?” అన్నాడు రాజారెడ్డి. నిజానికి అంతరాత్మ వేసిన ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు అతనికి. నీళ్లు నమిలాడు. అది మనసు ఎక్కడ పసిగడుతుందోనని సమాధానాన్ని దాటవేశాడు.

(ఇంకా ఉంది)

You missed