రాజారెడ్డి ఆలోచనలన్నీ ఇంటిచుట్టే తిరుగుతున్నాయి. “ఇంట్లో వనజ ఏం చేస్తూ ఉంటుంది?” అని ఆలోచిస్తూ బైక్ నడుపుతున్న రాజారెడ్డికి ఆ వీధి మూలమలుపు దగ్గరే నరసింహం ఎదురయ్యాడు. రాజారెడ్డిని చూసి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఏం రెడ్డి ఎటొచ్చావు?” అడిగాడు. బైక్ స్టాండ్ వేసి పక్కనే ఓ షెట్టర్ కిందకు వెళ్లి నిలబడ్డాడు. రాజారెడ్డి కూడా బైక్ ను పక్కకు ఆపి షెట్టర్ కిందకు వెళ్లాడు. తన బట్టతలపై పడ్డ నీటి బొట్లను కర్చీఫ్ తో తుడుచుకుంటున్నాడు. నరసింహాన్ని చూస్తే రాజారెడ్డికి జాలి కలిగింది. “ఎక్కడికొచ్చావు రెడ్డీ ?” మళ్లీ అడిగాడు నరసింహం.
” మీ ఇంటికే వచ్చాను. నువ్వు బయటకు వెళ్లావని తెలిసి అక్కడే కొద్ది సేపు కూర్చుని ఇగో ఇలా వచ్చాను.” అన్నాడు.
“ఏంటీ ఆరోగ్యమే బాగాలేదు. మొన్ననే కదా ఆస్పిటల్ కు పోయి వచ్చావు? ఇలా బయట తిరగడం దేనికీ?” అన్నాడు నరసింహం.
“నీ ఆరోగ్యమేమన్నా బాగుందా? నువ్వెందుకు తిరుగుతున్నావ్ “అన్నాడు రాజిరెడ్డి.
“సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లు మనిద్దరి బాధలు ఒకటే వయ్యా రెడ్డి “అన్నాడు నవ్వుకుంటూ నరసింహం. నరసింహం అలా ఎలా నవ్వగలుగుతున్నాడోనని ఆశ్చర్యంగా చూశారు రాజారెడ్డి. ‘ ఇన్ని బాధల్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావురా నాయనా’ అనుకున్నాడు మనుసులో..
“అయినా ఈ కరోనా టైంలో ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు రెడ్డీ.. ఎవరి బాధలు వాళ్లవి. మనం ఈ సమయంలో బతికి ఉంటే చాలు అనుకునేంతగా పరిస్థితులు దాపురించాయి.”అన్నాడు.
“కరోనాతో చచ్చే చావొచ్చింది రెడ్డి” కొద్ది సేపు ఆగి మళ్లీ అన్నాడు… “మాకు తెలిసిన బంధువు వాళ్ల నాన్న ఈ రోజు చనిపోయాడు” “అవునా ? ఎట్ల సచ్చిపోయిండో… కరోనానేనా?” “కరోనాతోనే సచ్చిండు రెడ్డి.
కానీ గవర్నమెంటు మాత్రం …. ఆయన పెద్ద మనిషి.. వేరే రోగాలున్నాయి కాబట్టి అతనిది గుండెపోటో ఇంకోటే అని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది” అన్నాడు.
“ఎందుకు అట్ల ?” “వేరే రోగాలుంటే వాటి వల్ల చస్తున్నారని, అది కరోనా కింద ఎట్ల లెక్కగడతారని విదండవాదం చేస్తున్నది.” “వీళ్లకు బుద్దుందా? అసలు కరోనా నే లేకుంటే ఆ రోగాలున్నోళ్లు కూడా ఇంకా కొన్నేండ్లయితే బతికెటోళ్లే
కదా.”
రాజారెడ్డి వింటున్నాడు ఆసక్తిగా.
“అంటే రెండేండ్లో మూడేండ్లో పదేండ్లో బతికే అవకాశం ఉన్నోడు కూడా ఇపుడు కరోనా అంటుకొని సస్తున్నడు కదా? మరి దీన్ని కరోనా చావు అనకపోతే ఏం అనాలె?” అన్నాడు.
నరసింహం ఆవేదనలో అర్థం ఉందనిపించింది రాజారెడ్డికి. “మీ లెక్కలు తగలెయ్య. తక్కువ చూపించుకుంటే ఇజ్జత్ నిలబడ్డట్టు. ఎక్కవైతే ఇజ్జత్ పోయినట్టా? ” “జనం చస్తుంటే ఇపుడు ఈ పరువు పరపతి, బొంగు బోశాణం ఏంది రెడ్డి… ” అన్నాడు ఆవేశంగా. “ఇసొంటి సమయంలోనే ఎవరేందో తెలిసిపోతుంది” అన్నాడు. రాజకీయాలనుద్దేశించి.
రాజారెడ్డికి ఏమీ అర్థం కావడం లేదు. టాపిక్ ఎటు నుంచి ఎటు పోతుందో తెలియడం లేదు. బిత్తిరిపోయి చూస్తున్నాడు.
“గీ సమయంలో కూడా లుచ్చ రాజకీయాలు చేస్తున్నారు వయా. కొత్త సెక్రటేరియట్ అని ఒకడంటాడు. ఇంకొకడేమో అక్కడ మందిర్, మసీదు కూలిపోయింది… ఎట్ల కూలగొట్టిర్రు అని అడుగుతడు. దీనికోసం లొల్లి చేస్తడు. మరొకడేమో కరోనా పేరు చెప్పి మా వినాయక చవితిని ఘనంగా చేసుకోనిస్తలేరు అని జనాన్నిరెచ్చగొడ్తడు… ఈ సమయంలో జనాలకు కావాల్సింది గిదేనా?”
“థూ వీళ్ల బతుకులు… గింత అన్యాయమా?” అన్నాడు నరసింహం. మామూలుగా కోపం రాదు నరసింహంకు. ఈ మధ్య ప్రప్టేషన్ పెరిగిపోతున్నది. చీటికి మాటికి కస్సుమంటున్నాడు. ‘ఇదీ కరోనా ప్రభావమే అనుకున్నాడు’ రాజారెడ్డి.
“మన బతుకుల సంగతి చెప్పమంటే వాళ్ల గురించి మాట్లాడతావెందుకు? వదిలెయ్” అన్నాడు రాజారెడ్డి. కొంచెం చిరాగ్గా.
“ఇవన్నీ చూస్తుంటే కరోనానే కొంచెం నయమేమో అనిపిస్తుంది.” ఇంకా ఆ మూడ్ లోంచి బయటకు రాలేదు నరసింహం.
“బతుకులు దుర్భరమైపోయాయి.” అన్నాడు నరసింహం. ఏటో చూస్తూ. ఏదో ఆలోచిస్తూ.
“మరలాంటప్పుడు అంతలా ఖర్చులెందుకు పెట్టాలె? నెలకు ముప్పైవేలు ఈ టైంలో ఎక్కడ్నుంచి తెస్తావు?” అన్నాడు రాజారెడ్డి. ఎంతగా కంట్రోల్ చేసుకుందామన్నా అది ఆగలేదు. అడిగాడు కానీ ఏమనుకుంటాడోనని అతని ముఖ కవళికలు గమనిస్తున్నాడు. నరసింహం ముఖంలో రంగులు మారాయి.
ధీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచాడు.
“అనుకుంటాం గానీ రెడ్డి. ఏదీ మన చేతిలో ఉండదనిపిస్తోందోయ్.” అన్నాడు. అప్పుడప్పడు రెడ్డి అని, ఏంది వయా అని తనకు తోచిన విధంగా పిలుస్తాడు నరసింహం. “మనం ఏదో చేయాలనుకుంటాం.. కానీ అలా అనుకున్నవన్నీ జరగవు. చాలా సార్లు మనం అనుకోనివే జరుగుతూ ఉంటాయి.”
నరసింహం వేదాంత దోరణిలో మాట్లాడుతున్నాడు. రాజారెడ్డికి ఏం అర్థం కావడం లేదు. తలగోక్కున్నాడు. రాజారెడ్డికి ఏం అర్థం కావడం లేదని అతనికి అర్థమవుతున్నది. అర్థమయ్యేలా వివరించాలనీ తనకు లేదు.
“సమాజం గురించి మంచి అవగాహన ఉన్న మీరు కూడా ఇలా అందరిలా ఆలోచించడం… బలహీనతలను జయించకపోవడం చూసి ఆశ్చర్యంగా ఉంది అన్నాడు…..” ఉండబట్టలేక..
“నీతులెన్నైనా చెప్పొచ్చు రెడ్డి. ప్రాక్టికల్ కు వచ్చే సరికి మన చేతిలో ఏమీ ఉండదు. మనం కూడా అందరితో పాటే కొట్టుకుపోతాం… ” అన్నాడు నిజాయితీగా నరసింహం.
నరసింహం మాటలు రాజారెడ్డికి నచ్చాయి. ఉన్నదున్నట్లు తన తప్పు ఒప్పుకుంటున్నాడనిపించింది. ఇంకేమైనా చెప్తాడేమోనని చూస్తున్నాడు.
“సంసార సాగరం ఈదడం అంత వీజీ గాదు రెడ్డి…” వ్యంగ్యంగా అన్నాడు నరసింహం. తనకు ఉపదేశం చేస్తన్న గురువులా కనిపిస్తున్నాడు రాజారెడ్డికి నరసింహం.
“అడవి బాట పట్టి జన జీవన స్రవంతిలో కలిసిన వాళ్లు…. వాళ్ల సానుభూతి పరుల జీవితాలు ఒకసారి చూడు… ఎంత ఆదర్శంగా ఉంటాయో?
అతని మాటల్లో వైరాగ్యం కనిపిస్తున్నది. అంతకు మించి వ్యంగ్యం కనిపిస్తున్నది. తనూ అందుకు అతీతుడినేం కాదు అన్నట్లుగానే ఉన్నాయతని మాటలు.
“చేయిదాటిపోయింది రెడ్డి… ఇపుడు మనమేం చెయ్యలేని అసమర్థులం.” తనను కూడా కలుపుకొని మాట్లాడడం… అసమర్థులం అని అనడం రాజారెడ్డికి నచ్చలేదు.
“కాల ప్రవాహంలో కొట్టుకుపోయే ఓ సాధారణ జీవులం…” అన్నాడు మళ్లీ ఎటో చూస్తూ. అతడి కళ్లలో తడి కనిపించింది. వర్షం నీటిని తుడుచుకుంటున్నట్లు నటిస్తూ కంటిలోని చెమ్మను కూడా తుడుచుకున్నాడు రాజారెడ్డి గుర్తుపట్టకుండా.
వర్షం వెలిసింది. ఫోన్ రింగవుతున్నది. రాజారెడ్డి ముఖం చూశాడు నరసింహం ‘ఇక వెళ్లామా’ అన్నట్లుగా, అర్థం చేసుకున్నాడు రాజారెడ్డి. ఇద్దరూ బైక్ వద్దకు వెళ్లారు. బైక్ స్టార్ట్ చేసి గేర్ మార్చి అన్నాడు నరసింహం. “మన జీవితాలు విషాదాంతాలే రెడ్డీ! ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసింహం అలా అనే సరికి రాజారెడ్డి షాక్ తిన్నాడు. “మన జీవితాలు విషాదాంతాలే అంటాడేంది?” తనను కూడా కలుపుకొని మాట్లాడటాన్ని రాజారెడ్డి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. “మనం అసమర్థులం” ” మన జీవితాలు విషాదాంతాలు…”
“పిచ్చేమైనా పట్టిందా నరసింహానికి? నీ భార్యను , నీ జీవితాన్ని నీవు కంట్రోల్ లో పెట్టుకోలేక అందరినీ నిందిస్తావా?” అని మనసులో అనుకున్నాడు రాజారెడ్డి.
కొన్ని నిమిషాల క్రితం వరకు తనకు నరసింహాం గురువులా కనిపించాడు. ఎన్నో విషయాలు తెలియజేసిన జ్ఞానిలా చూశాడతన్ని. ఇపుడు అతన్ని మూర్ఖుడి కింద లెక్కగడ్తున్నాడు.
“ఛీఛీ నా మనసు బాగోలేదని వీడి దగ్గరకు వస్తే నన్ను కూడా చేతగాని చవటలా జమ కట్టి మాట్లాడుతున్నాడు.” అనుకొని అక్కడ్నుంచి వెళ్లడానికని బైక్ స్టార్ట్ చేశాడు. చల్లని గాలులు వీస్తున్నాయి. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బైక్ స్టార్ట్ చేసే ముందు ‘పెట్రోల్ ఉందా లేదా’ అని డౌట్ వచ్చింది. పెట్రోమీటర్ ముల్లు చిట్ట చివరకు వచ్చి చేరింది. బండిని ఊపి చూశాడు. కొద్దిగా అడుగుకు ఉన్నట్టు చప్పుడు వినిపించింది. జేబులో పైసలు లేవు. ‘నరసింహాన్ని అడిగి ఉండాల్సింది.” అనుకున్నాడు. “ఛీ యాభై , వంద అతనికి అలవాటు అడుక్కోవడం. నేను అలా అడిగితే నా పరువేం గాను’ అనుకున్నాడు మళ్లీ.
బండిని స్టార్ట్ చేసి రయ్యిన పోనిస్తున్నాడు ఇంటి వైపు. అప్పటి వరకు వాన తాకిడికి ఎక్కడికక్కడే నిలిచిపోయిన వారంతా మళ్లీ రోడ్ల మీదకెక్కారు. హారన్ మోతలతో దద్దరిల్లుతన్నది ఆ రోడ్డు. ఇంటికి చేరే హడావుడిలో బైక్ ల పోటీలో పాల్గొన్నట్లుగానే ఆగమాగం నడుపుతున్నారు.
కడుపులో ఆకలి కేకలు మొదలయ్యాయి రాజారెడ్డికి. ఒక్కసారిగా ఆలోచనలు ఇంటివైపు వెళ్లాయి. అతని భార్య ఫీలింగ్స్ గురించి తలుచుకున్నాడు. అగ్నిగుండంలా ఎర్రటి కళ్లతో తనను కాల్చేలా చూసిన సందర్భం గుర్తొచ్చి ఒళ్లు జలదరించింది. పైకి గంభీరంగానే కనిపిస్తున్నా లోపల భయపడుతున్నాడు. కరోనా రాక తన జీవితాన్ని చెల్లాచెదురు చేస్తున్నదని భావించాడు. అంతకు ముందు మరీ ఇంత ఘోరంగా లేదని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులను పోల్చి చూసుకుంటున్నాడు. “ఆఫీసులో అలుసై పోయాను. బెదిరింపులు ఎక్కువయిపోయాయి. ఇంట్లో చులకనైపోయాను… పట్టించుకోవడం లేదు..” ఇలా
ఆలోచిస్తూ ఇళ్లు చేరుకున్నాడతను.
ఇళ్లంతా ప్రశాంతంగా ఉంది. అలికిడి లేదు. రాత్రి తొమ్మిది గంటలకే ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఆశ్చర్యంగా లోపలికి వెళ్లి చూశాడు రాజారెడ్డి. కింద చాప మీద పిల్లలతో కలిసి పడుకుని ఉంది వనజ.
“అప్పుడే నిద్రపోయారా?” అని ఆశ్చర్యంగా చూసి, లోపలికి వెళ్లి బట్టలు విప్పి లుంగీ కట్టుకున్నాడు. శరీరం వణుకుతున్నది. వెచ్చటి చాయ్ ఒకటి తాగితే బాగుండనిపించింది. గతంలో అయితే భార్యను ఒక కేకేయగానే గరం గరం చాయ్ వచ్చి ముందుండేది. ఇపుడు… అడగాలంటేనే భయం. “కడుపుకింత అన్నం పెడితే చాలురా బాబు” అన్నట్లుంది తన పరిస్థితి అనుకున్నాడు.
“అవును… నేను వచ్చినట్లు వనజ గుర్తించిందా? లేదా?” డౌటొచ్చింది. టీవీ ఆన్ చేశాడు. సౌండ్ పెంచాడు. పది నిమిషాలు గడిచాయి. అయినా వనజ నుంచి స్పందన లేదు. చడీ చప్పుడు లేదు. మరో పది నిమిషాలు…. అరగంట. ఊహు. ఇక లాభం లేదనుకొని వంట గదిలోకి నడిచాడు.
” భర్త ఇంటికి రాగానే అన్నం పెట్టాలనే భయం,భక్తి లేకుండా పోయింది. ఛీ ఛీ ఇంత నీచంగా ఉంటారా? అసలు నేనంటే ఏమాత్రమైనా గౌరవం, భయం ఉన్నాయా?”
” మరీ ఇంత అధ్వానమా? ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదనుకుంటా? కూలీ పని చేసుకొని వచ్చిన వాడికి కూడా భార్య మర్యాదిస్తది. భయపడుతుంది. తాగి ఊగుకుంటూ ఇంటికి వచ్చినవాడికీ ఓ భార్యుంటుంది. అదీ భయపడుతుంది. ఆఖరుకు మనసులో తిట్టుకున్నా వాడికి బుక్కెడు బువ్వైతే పెడుతుంది. మరి నా జీవితమేంది? ఇలా తగులబడ్డది. చీ దీనమ్మ జీవితం..” అనుకున్నాడు. భార్య మీద మళ్లీ కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకున్నాడు.
వంట గదిలోకి వెళ్లి గిన్నెలన్నీ వెదికాడు. దేంట్లోనూ ఏదీ లేదు. ఆకలితో పాటు కోపం కూడా పెరుగుతున్నది. గిన్నెలను ఆటూ ఇటూ ఎత్తేస్తున్నాడు చప్పుడు వచ్చే విధంగా. కావాలని అలా చేస్తున్నాడు. ఈ అలికిడికైనా భార్య లేస్తుందేమోనని.
ఊహూ… అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదు. మంచి నీళ్లు తాగి ఆ గ్లాసును విసురుగా అక్కడే గిరాటు వేసి.. అక్కడ్నుంచి తన గదిలోకి విసవిసా వెళ్లిపోయాడు. టీవీ ఆన్లోనే ఉంది.
చానళ్లు మారుస్తున్నాడు. ఏం వస్తుందో కూడా చూస్తలేడు. మారుస్తూనే ఉన్నాడు. అది చానళ్లు మార్చినట్లుగా లేదు. కోపంతో రిమోటు గొంతును నులిమేస్తున్నట్లుగా ఉంది. కసకసా రిమోట్ ను కత్తితో పొడిచినట్లుగా ఉంది.
షుగర్ ప్రభావమో ఏమో తలతిప్పినట్లుగా ఉంది. కాళ్లు చేతులు వణుకుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. తన వల్ల కావడం లేదు. “ఏం చేయ్యా లి? ”
వనజ దగ్గరకు వెళ్లి గట్టిగా కేకలు వేయాలని ఉంది. తట్టి లేపాలని ఉంది. దుప్పటి లాగి ‘ఓసేయ్ నాకు అన్నం పెట్టవా? నీకెంత పొగరు’ అని అరవాలనుంది రాజారెడ్డికి.
లాభం లేదనుకున్నాడు. పిల్లలు భయపడతారు. ‘వారినెందుకు ఇబ్బంది పెట్టాలి?” అనుకున్నాడు.
మళ్లీ వంట గదిలోకి వెళ్లాడు. ఈసారి కిచెన్‌ లో ఏమైనా తినడానికి ఉన్నాయా? అని వెతుకుతున్నాయతని కళ్లు. ఆకలితో నకనకలాడుతున్నాడు. ఆదరబాదరగా అన్ని పాత్రలను, డబ్బాలను తెరిచి చూస్తున్నాడు.

(ఇంకా ఉంది)

You missed