భార్య నుంచి ఇంకను ఎలాంటి స్పందనరాకపోవడంతో అతని అహం దెబ్బతిన్నది. మెదడు మొద్దుబారింది. ఆలోచన శక్తి క్షీణించుకుపోతున్న భావన కలుగుతున్నది.
“నోరు పడిపోయిందానే దొంగముండా… మాట్లాడవేం.?” అప్పటిదాక ఓపిక పట్టిన వనజకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నది. “పిచ్చేమైనా పట్టిందా?” హూంకరించింది. అంతే… ఉన్న చోటు నుంచి చరాచరా వచ్చి ఆమె జుట్టు పట్టుకున్నాడు.
ఈ హఠాత్పరిణామానికి ఆమె బిత్తరపోయింది. భీతిల్లి అలాగే కళ్లప్పగించి చూస్తున్నది. ఆ కళ్లలో క్షణకాలం ముందున్న సింహం ఉగ్రరూపం లేదు.. భయంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పెనుగులాడుతున్న లేడి పిల్లలా దీనంగా చూస్తున్నాయి ఆమె కళ్ళు.
జట్టు గట్టిగా పట్టి లాగడంతో ఆమెకు మెదడులోని నరాలన్నీ తెగిపోతున్న బాధ కలిగింది. జుట్టు మొత్తం ఊడి అతని చేతిలోకి వచ్చేస్తుందేమోనన్న ఫీలింగ్ కలుగుతున్నది.
మెడ నరాలు జువ్వున లాగుతూ మెదడును ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తోస్తున్నది. ఆమె పెనుగులాడుతోంది. జుట్టు పట్టుకుని వెనక్కిలాగి వదిలాడు.
అదుపు తప్పి నేల మీద పడబోయింది. పక్కనే గోడను ఆసరా చేసుకుని గట్టిగా పట్టుకున్నది. తల నేలకు తగిలి పుచ్చకాయల పగిలే ప్రమాదం తప్పింది.
తమాయించుకుని నిలబడిన ఆమె వద్దకు సుడగాలిలా వచ్చి చెంప చెళ్లుమనిపించాడు. విసురుగా వెళ్లి గోడకు గుద్దుకుని దబ్ మని కింద పడింది వనజ. కళ్లు బైర్లు కమ్మాయి. నెత్తి బొప్పి కట్టింది. అలాగే నేలపై పడిపోయింది. చరచరా అక్కడ్నుంచి వెళ్లిపోయి బయట కూర్చున్నాడు రాజారెడ్డి. అతనిలో కోపం తగ్గుతున్నది. భార్యపై చేయి చేసుకున్న తర్వాత గానీ మనసు శాంతించలేదు. కొద్ది సేపు బుసకొడుతున్నట్లుగా అతను ఊపిరితీసుకున్నాడు. తర్వాత చల్లగా చెమటలు పట్టసాగాయి.
గుండెదడ పెరిగింది. తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది. నెత్తికి చేతులు పెట్టుకొని నేల చూపులు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
పిల్లలు ముగ్గురూ ఇంట్లో లేరు. పక్కింట్లో కూర్చున్నారు. పొద్దున్నే ఆన్ లైన్ క్లాసులు కాగానే వనజ పెట్టిన టిఫిన్ తిని వెళ్లిపోయారు.
కొద్ది సేపటికి అనన్య అపుడే ఇంట్లోకి వచ్చింది.
తల్లి నేల మీద కూర్చుని ఉంది. తల ఒడిలో పెట్టుకొని ఏడుస్తున్నది. ఏమైందో అనన్యకు అర్థం కాలేదు. “అమ్మా… అమ్మా ఏమైంది?” అని అడిగింది. తల్లి ఏడుస్తుందే గానీ ఏమి మాట్లాడకపోవడంతో ఏదో జరిగిందని ఊహించింది. తండ్రి వద్దకు వచ్చి
“నాన్నా … అమ్మ ఏడుస్తుంది.. ఏమైంది? ఆమె అడిగిన తీరు రాజారెడ్డిని అనుమానించినట్లుగానే ఉంది. ‘నువ్వే ఏమో చేశావు’ అని అడిగినట్లుగా ఉంది.
తల పైకెత్తి చూశాడు. కళ్లు ఎర్రబడి ఉన్నాయి. తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు అనన్య.
వెంటనే తేరుకొని …. “సరే నేను చూస్తాలే.. నువ్వెళ్లి… చెల్లెను, తమ్ముడిని తీసుకు రా పో” అన్నాడు. పిల్లలకు ఈ విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడదామని అనుకున్నాడు రాజారెడ్డి.
అనన్య అక్కడ్నుంచి వెళ్లిపోయింది. లోపలికి వెళ్లాడు. వనజ తల రెండు చేతులకు ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏడుపు బయటకు వినిపించడం
లేదు.
మెల్లగా వనజ తలపై చెయ్యి పెట్టాడు. ఏడుపు ఆపింది ఆమె. తలపైకెత్త లేదు. నుదురు బొప్పి కట్టి కనిపించింది. “ దెబ్బ తాకిందా?” ” సారీ”
అనాలనుకున్నాడు. కానీ అనలేకపోయాడు. “పిల్లలు వస్తున్నారు లెవ్వు..” “ లేచి పనులు చేసుకో” అనబోయాడు ఆ మాటలు కూడా బయటకు రావడం లేదు. కిందకు వంగి.. చేతితో బొప్పి కట్టిన దగ్గర తడిమాడు. రాజారెడ్డి చేతిని విదిల్చి కొట్టింది వనజ. ఒక్కసారిగా అలా చేస్తుందని ఊహించకపోవడంతో రెండడుగులు వెనక్కి పడ్డాయి అతడివి.
ఆమె ఎర్రటి కళ్లతో కాల్చేసేలా చూసింది అతన్ని. చింతనిప్పుల్లా రగిలిపోతున్న కళ్లలోంచి ధారలుగా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి.
వనజను ఆ స్థితి లో అలా చూసి భయపడ్డాడు రాజారెడ్డి. అక్కడ్నుంచి వెళ్లిపోయాడు వడివడిగా. కొద్ది సేపటి తర్వాత పిల్లలు ముగ్గురూ వచ్చి తల్లి చుట్టూ కూర్చున్నారు. వాళ్లకు తెలియకుండానే కళ్లలోంచి నీళ్లు ఉబికివస్తున్నాయి. కొద్ది సేపటి తర్వతా లోనికి వచ్చిన రాజారెడ్డి కొయ్యకు ఉన్న అంగీ, ప్యాంటు వేసుకొని బైక్ తీసుకొని వెళ్లాడు. పిల్లలు భయం భయంగా తండ్రినే చూస్తున్నారు.
బైక్ నడిపిస్తున్న మాటేగానీ అతని మనసు మనసులో లేదు. సాయంత్రం వేళ చల్లటి గాలులు వీస్తున్నాయి. ఎక్కడో వాన కురుస్తున్నట్లున్నది. ఏదో గుర్తుకువచ్చి శ్రీధర్ కు ఫోన్ చేయబోయాడు. జేబులో ఫోన్ లేదు. ఇంట్లోనే మరిచివచ్చాడు. నేరుగా నరసింహం ఇంటికి వెళ్లాడు. నరసింహం లేడు ఇంట్లో. అతని భార్య భాగ్య పలకరించింది. “రండన్న… ఆయన ఇపుడే వెళ్లాడు బయటకు. వస్తాడేమో కూర్చోండి. ” అన్నది.
లోపలికి వెళ్లి కూర్చున్నాడు. చాయ్ తెచ్చిచ్చింది. వేడి వేడిగా చాయ్ గొంతులో దిగుతుంటే ప్రాణం కుదుటపడుతున్నట్లనిపించింది రాజారెడ్డికి.
చాయ్ తాగేదాకా ఏం మాట్లాడలేదు. “ఇపుడు ఆరోగ్యం ఎట్లుంది అన్న?” భాగ్య ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు. “పర్వాలేదు “అన్నట్లుగా తల ఊపాడు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో.
“ ఆయనకు కూడా గుండెపోటు రావడంతో స్టంట్ వేశారు .. ఇపుడు మునిపటిలా పనిచేయలేకపోతున్నాడు” అన్నది.
ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే నరసింహానికి గుండెపోటు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కనీసం మందు తాగే అలవాటు కూడా లేదు అతనికి. కానీ ఈ టెన్షన్లకు ఒత్తిడి పెరిగి గుండెపోటు తెచ్చుకున్నాడని అనుకున్నారంతా.
మొన్నటి దాక అంతో ఇంతో నడిచిన ‘పబ్లిక్ పక్షం’ పేపర్ ఈ కరోనా దెబ్బకు మూత పడింది. దీంతో ఏం చెయ్యాలో తెలియడం లేదు అతనికి.
“నెలకు ముప్పైవేల వరకు ఖర్చులున్నాయి అన్నా…” అన్నది భాగ్య. ఆశ్చర్యంగా చూశాడామె వైపు. అంత ఖర్చెందుకు? అన్నట్లుగా. “చిట్టీలు, ఇన్స్టాల్మెంట్లు… కిరాయిలు… నెల నెలకు ఇవి మాత్రం తప్పవుగా” అన్నది మళ్లీ. పాపం నరసింహం నెల నెలా ఇంత మొత్తం ఎక్కడ్నుంచి తెస్తున్నాడో అనుకున్నాడు రాజారెడ్డి.
“ఇతనికి బతికే తెలివి లేదన్నా… పక్కన వాడిని చూసైనా నేర్చుకోడు. మీ ఫ్రెండ్ కూడా అప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాడు కదా. మరి ఆయన ఏ లోటు లేకుండా ఇంట్లో చూసుకుంటున్నాడు.” అన్నది
ఆ ఫ్రెండ్ ఎవరా? అనుకున్నాడు. గుర్తొచ్చింది. రమేశ్. ఇసుక దందా, సెటిల్మెంట్లు… చేయని లంగదందా లేదు. – ‘బహుషా ఈమెకు వాడే ఇన్స్పిరేషన్ అనుకుంటా’ అని మనసులో అనుకున్నాడు “ఈయనకు మాత్రం చాతకాదు…..” తీవ్ర అసంతృప్తి, వైరాగ్యం కనిపిస్తున్నాయి ఆమె ముఖంలో.
‘ఇక్కడా ఇదే లొల్లి’ అనుకున్నాడు రాజారెడ్డి. ఏం మాట్లాడకుండా వింటున్నాడు. నవ్వును తెచ్చిపెట్టుకుందామన్నా అది రావడం లేదు.
తన మీద తనకే విపరీతమైన కోపం, అసహ్యం వేస్తున్నాయి. ‘జీవితాలు ఇలా అయిపోయాయేట్రా బాబు…” అనుకున్నాడు.
‘అసలు పెళ్లి చేసుకోకపోతే అయిపోతుండే. ఈ దరిద్రం ఉండేది కాదు…దీనంతటికీ కారణం అదే’ అని అనుకున్నాడు.
‘అందరూ ఇట్లనే ఉంటరా…. కొందరే ఇలా రాచి రంపాన పెడతారు’ అని అనుకున్నాడు మళ్లీ. ‘పాపం… నరసింహం’ అనుకొని… “నేను వెళ్తానమ్మా “అని లేవబోయాడు. “మీరన్న చెప్పండన్న.. కరోనా ఉన్నా .. ఏమైనా …. ఖర్చులు మాత్రం ఆగవు కదా? ” అన్నది “ఏమన్నా చెయ్యమనండి.. నెలకు ముప్పైవేలు తెచ్చివ్వాల్సిందే” అన్నది రాజారెడ్డితో వాదిస్తున్నట్లుగా. ‘ఏం చేసి తెచ్చివ్వమంటావమ్మా.. దొంగతనం చెయ్యమంటావా? అడుక్కురమ్మంటావా?” మనసులోనే వైరాగ్యంగా నవ్వుకున్నాడు.
“అందుకే గుండెలో ఒక స్టంట్ పడ్డది నరసింహంకు… ఇపుడు ఈ కష్టకాలంలో అదెప్పడాగుతుందో తెలియదు పాపం”.
అనుకొని బయటకు నడిచాడు. ఇక ఆమెతో మాట్లాడనిపించలేదు. భాగ్య ఇంకేదో చెప్పబోతుంది. కానీ అతను వినిపించుకోలేదు. బైక్ స్టాండ్ తీసి కిక్ కొట్టి గేరు మార్చాడు. చిన్నగా జల్లులు మొదలయ్యాయి. నరసింహం, భాగ్యం. ఇద్దరూ అభ్యుదయ భావాలున్న వారే. ఆదర్శ వివాహం చేసుకున్నారు. సమాజం మీద అవగాహన ఉంది. కానీ తమ దాక వస్తే అన్నట్లు .. అవే ఆడంబరాలు, హంగుల కోసం ఆర్బాటాలు. గొప్పలకు పోయి తిప్పలు. అవి తీర్చేందుకు మళ్లీ కొత్త అప్పులు. – “చీ చీ ఇవీ జీవితాలేనా?”
చీకట్లు మెల్ల మెల్లగా ముసురుకుంటున్నాయి. చిరు జల్లులు శరీరానికి తాకి చికాకును కలిగిస్తున్నాయి. జనమంతా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. మూతులకు మాస్కులు వేసుకోవడం జనానికి అలవాటుగా మారింది. కరోనా పీడ ఇంకా విరగడ కాలేదు. భయం ఇంకా పోలేదు. జనాలు యథేచ్చగా బయట తిరగడమూ మానలేదు. కరోనా జాడలు కనిపించిన రోజుల్లో ఒక్క కేసు వస్తే ‘వామ్మో’ అనుకొని భయపడ్డారు. ‘కంటైన్మెంట్ క్లస్టర్’ అని ఏర్పాటు చేసుకున్నారు. గల్లీలకు దడి కట్టుకున్నారు. ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. కరోనా మరింత రెచ్చిపోతున్నది. కేసులు
పెరుగుతున్నాయి. చావుల సంఖ్య పెరుగుతున్నది. గవర్నమెంటు, ప్రైవేటు తేడాలేదు. అన్నీ ఆస్పిటళ్లు నిండిపోతున్నాయి. వచ్చిన వాళ్లు చూపించుకుంటున్నారు. బయటపడుతున్నారు. భయపడుతున్నారు. బలైతున్నారు. బరాబర్ గా తిరుగుతున్నారు. ఏదీ తప్పడం లేదు. అన్నీ చకచకా జరుగుతున్నాయి. కాలం ఎవరి కోసమూ ఆగదు కదా! ప్రజలకూ అదీ బాగా తెలుసు. అందుకే ఎంతటి విపత్తయిన, ఉప్రదవమైనా దాన్ని జీర్ణించుకునే వరకే ఆందోళన, మానసిక ఒత్తిడి, ఉద్వేగం… ఆ తర్వాత దాన్ని ఎదిరించేందుకు బతుకు ఆరాటంలో అదీ పోరాటమైపోతుంది. ఆఖరికి అది తమలో ఒకటిగా కలిసినడుస్తుంది. కాలంతో పాటు కలిసిపోతుంది. ఆ విపత్తు సమయంలో ‘కాలం’ చేయకుండా ఉండగలిగినోడే భవిష్యత్తు చూస్తాడు. కాలం తనతో పాటు అన్నింటినీ తీసుకుపోతున్నది. తన గర్భంలో కలిపేసుకుంటూ పోతున్నది. అది కరోనా ఐనా మరేదైనా……

(ఇంకా ఉంది)

You missed