లైబ్రరీకి పోయే దారి వదిలి చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎత్తైన ప్రదేశం పై లైబ్రరీ కట్టి ఉండటంలో ఆ మెట్లు గుడి మెట్లను తలపిస్తున్నాయి. రాతితో వేసిన ఆ మెట్లు కూడా ఎంతో అందంగా ఉ న్నాయి. అది లైబ్రరీలా లేదు. తాజ్ మహల్ లా కనిపిస్తున్నది. ఆ మెట్లకు చుట్టూ ఉన్న దట్టమైన చెట్లు ఆ ప్రాంతానికి కొత్త
అందాలను అద్దుతున్నది. ఏపుగా పెరిగిన ఆ చెట్ల నుంచి రాలిన పసుపు రంగు పూలు ఆ మెట్లపై పడటంతో వచ్చే వారికి పూల స్వాగతం పలికినట్లుగా కనిపిస్తున్నది. విజయ్ వచ్చి కింది వరుసలోనే మెట్లపై కూర్చున్నాడు. ఏదో ఆలోచించుకుంటూ. మిగితా వారు అతన్ని అనుసరించారు. ఆ పక్కనే ఎవరికి వారు దూరంగా కూర్చుని విజయ్ నే చూస్తున్నారు. విజయ్ చుట్టూ ఉన్న చెట్లను చూస్తున్నాడు. ఆకాశం ప్రశాంతంగా ఉంది. వాతావరణం చల్లగా మారింది.
బైక్ పై దూరంగా వస్తూ కనిపించాడు మహేందర్. ఓ లీడింగ్ పత్రికలో రిపోర్టర్ అతను. వీళ్ల దగ్గరకు సమీపించకముందే బండిని న్యూట్రల్ చేసి ఇగ్నీషియన్ ఆపేశాడు. అది సైలెంట్ గా సయ్ మంటు వచ్చి పక్కనే ఆగింది.
“ఇప్పటి దాకా ఎటు వెళ్లావ్?” అడిగాడు రాము.
“మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీలో వినాయక నిమజ్జన శోభయాత్ర ప్రారంభం ఉండే. లోకల్ లీడర్ వచ్చిండు.” అని సమాధానమిచ్చాడు.
ఓయూను ఆనుకొని ఆర్ట్స్ కాలేజీ వెనుకే మాణికేశ్వర్ నగర్ ఉంది.
“వేలం పాటలో ఆ బస్తీవాసీ ఒకరు ఎనభై వేలకు వినాయకుడి లడ్డూను కొన్నాడు” అన్నాడు మళ్లీ మహేందర్. ఆశ్చర్యంగా చూశారంతా.
“కరోనా కాలంలో వినాయకులను పెట్టుడే ఇబ్బందిగా మారిన సమయంలో ఇక లడ్డూల వేలం కూడా జరిగిందా?” అన్నాడు రాము.
“పనులు లేక అంతా ఇబ్బందులు పడుతుంటే ఈ వేలం లడ్డూలకు వేలు వేలు తగలేయడం ఏంట్రా బాబు” అన్నాడు మోహన్ రెడ్డి వ్యంగ్యంగా.
“అవే పైసలతో ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే ఆడి పేరు చెప్పుకొని బతికిపోతరు” అన్నాడు మళ్లీ తనే.
“అరే నువ్వు నాస్తికుడివి బై. నీవు అలాంటివి నమ్మవు. ఎవరి నమ్మకాలు వారివి. వదిలేయ్” అన్నాడు బాబు మోహన్ రెడ్డిని కొరకొరా చూస్తూ.
రెక్కాడితే గాని డొక్కాడని ఆ బస్తీ వాసులకు కరోనా కారణంగా కూలి పనులు కూడ దొరకడం లేదు” వడ్డెరబస్తీ వాసుల పరిస్థితి తలచుకొని సానుభూతి గా అన్నాడు బాబు.
విజయ్ వీరి మాటలు వినడం లేదు. పచ్చగా పరుచుకున్న చుట్టపక్కల ప్రకృతి అందాలను పరిశీలిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
ఆలోగా వీరి వద్దకు నరేశ్ వచ్చాడు. నడచుకుంటూ. ఆర్ట్స్ కాలేజీ వద్ద బైక్ పెట్టి వచ్చినట్టున్నాడు. “ఎటు పోయావ్ కనిపించడం లేదు ? ” అన్నాడు బాబు
“వరంగల్ పోయిన. పొద్దున్నే వచ్చిన. ” అన్నాడు. అతనిది వరంగల్. పదేండ్ల కింద ఇక్కడికి వచ్చి ఓ మీడియా ఛానల్ లో తార్నాకా బీట్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు పది చానళ్లు మారాడు. దీంట్లో ఎన్ని రోజులుంటాడో తెలియదు.
“ఎందుకు?”
కొద్ది సేపు ఆగి ధీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచి…. “కరోనా వచ్చిందని మా అమ్మని మా అన్నలిద్దరూ పొలం దగ్గర వదిలేసి వచ్చారంట.” అన్నాడు. అతని ముఖంలో విషాదం తొంగిచూసింది.
“అరే మొన్న వాట్సాప్ లో వైరల్ అయ్యింది …..” అని ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ఆగాడు.
“అవును” అన్నట్లుగా చూశాడు నరేశ్. “ఎవరికి వారే నీ దగ్గర ఉంచుకో నీ దగ్గర ఉంచుకో అని కొట్లాడి లాస్ట్ కు పొలం దగ్గర చిన్న డేర వేసి అక్కడే ఉంచి వచ్చారు” అన్నాడు.
“దుర్మార్గులు” అన్నాడు మోహన్ రెడ్డి.
” నేను వెళ్లి ఆస్పిటల్ లో చూపించి … తగ్గే వరకు ఉండి వచ్చిన. ఇపుడు పెద్దన్న ఇంట్లోనే ఉంటుంది అమ్మ” అన్నాడు నరేశ్.
“ఈ కరోనా మనిషినే కాదు బ్రదర్… మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తున్నది. నేను బతికితే చాలు అనే స్వార్థం పెరిగిపోయింది ” అన్నాడు బాబు.
ఇటీవల ఆదిలాబాద్ లో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి మహేందర్ చెప్పసాగాడు. ” కుట్టుమిషన్ కుడుతూ వచ్చిన ఆదాయంతో తన కూతురును ఎంబీబీఎస్ చదివిస్తోందట ఓ అమ్మ. ఈ కరోనా పుణ్యమా అని పనిలేక చానా ఇబ్బందులు పడ్డారంట. ఆఖరికి కిరాయి కట్టలేని పరిస్థితులు, తల్లి కష్టాలు దగ్గరుండి చూసిన ఆ బిడ్డ ఉరివేసుకొని చచ్చిపోయిందట” చెప్పి అందరివైపు చూశాడు మహేందర్.
“ఎంత విషాదం… ఆ బిడ్డ బంగారు భవిష్యత్తను మింగేసింది ఈ కరోనా. ఎంకెన్ని జీవితాలు బలి తీసుకుంటుందో
ఇది? ఎంత మందిని ఆగం చేసి ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తుందో?”
విచారం వ్యక్తం చేస్తూ అన్నాడు మోహన్ రెడ్డి.
” శివకుమార్ ఫ్యామిలీ గురించి ఆలోచించండి బై అంటే … దేశంలోని అన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నారు” అన్నాడు వీరి మాటలు వింటున్న విజయ్.
” శివకుమార్ ఉరి పెట్టుకొని ఒక్కసారే చచ్చాడు. మనం రోజు రోజు చస్తున్నాం.” అన్నాడు వైరాగ్యంగా రాము. “ఏం చేద్దాం? మనం పైసలు పోగేసి ఆదుకునే పరిస్థితైతే లేదు” అన్నాడు రాము. “లీడర్లు, ఆఫీసర్ల వద్దకు పోయి చందాలు అడుగుదాం” అన్నాడు బాబు. అందరూ అతని వైపు చూశారు. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నట్లుగా ఎవరూ ఏమీ మాట్లడలేదు. రాము ప్రతిపాదనను తిరస్కరించలేదు.
“నాచారం ఏరియాలో ఇండస్ట్రీలు ఉన్నాయి కదా లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి శివకుమార్ భార్యకు వాటిల్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుదాం” అన్నాడు బాబు.
ఇది కూడా మంచి ఆలోచన అన్నట్లుగా చూశాడు రాము.. బాబు వంక. “ఇంకా ఎక్కడి ఇండస్ట్రీలు…. వాటిల్లో పనిచేసే వలస కార్మికులు బతుకు జీవుడా అంటూ వేల కిలోమీటర్లు కాలినడకనే వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు” అన్నాడు మోహన్ రెడ్డి.
“ఇన్ని రోజులు వాళ్లతో పనిచేయించుకున్న సర్కార్ వాళ్లని ఏ మాత్రం పట్టించుకోలేదు. మీ చావు మీరు చావుండ్రని గాలికొదిలేసింది….
పిల్లా జెల్లతో మూట ముళ్లె సర్దుకొని వేల కిలోమీటర్లు పోయారు బై…..” అన్నాడు మళ్లీ మోహన్ రెడ్డి. ” చాలా మందికి అందులో కాళ్లకు చెప్పులు కూడా లేవు” మళ్లీ గుర్తొచ్చి చెప్పాడు. “వాళ్లకు కరోనా దెబ్బతో ఇక్కడి వాళ్లమీద నమ్మకం పోయింది. మళ్లీ ఎప్పుడొస్తరో తెల్వదు.
వాల్గొచ్చేదాక ఇవన్నీ ఖాయిలా పడిన విధంగానే దిక్కుదివానం లేకుండా దిక్కులు చూస్తూ ఉంటాయి.” అన్నాడు
” ఉన్న ఉద్యోగాలు ఊడినయ్… ఇంక ఇప్పుడు శివకుమార్ భార్యకు ఉద్యోగం ఎవరిస్తారు? ” అన్నాడు రాము. “ఈ పరిస్థితులు సాకుగా చూపి చేతులెత్తేస్తారు” అన్నాడు. “బాబు అన్నట్లుగా లీడర్ల దగ్గరకు వెళ్లి పరిస్థితి వివరిద్దాం” అన్నాడు మోహన్ రెడ్డి. కొంత సేపు ఆలోచించిన తర్వాత ఓ నిట్టూర్పు విడిచి అన్నాడు విజయ్… “చివరకు చందాలు అడుక్కునే బిచ్చపు బతుకులు అయిపోయాయి”
” ఇలాంటి దుర్భర జీవితాలు గడుపుతూ కూడా ఇంకా మీడియాను పట్టుకు వేలాడుతున్నామే తప్ప … వేరే పని చేసుకోలేకపోతున్నాం…” అన్నాడు బాబు కొంత కోపంగా, కొంత ఆవేదనగా.
“అవును… నిజమే. మనం దీంట్లో బాగుపడింది లేదు. కుటుంబాన్ని సంతోషంగా ఉంచిందీ లేదు. జీవితాలు విచ్చిన్నమైపోతున్నా.. బతుకులు దుర్భరమైపోతున్నా.. కళ్లముందే ఇంత ఘోరం జరుగుతున్నా.. చూసీ ఏమి చేయలేక… జీవచ్చవాల్లా ఉండిపోతున్నాం” అన్నాడు విజయ్. అతనికి క్షణం క్షణం అసహనం పెరిగిపోతోంది. అందరి వంక చూశాడు. అందరి ముఖాల్లో విజయ్ చెప్పింది కరెక్టేనన్నట్లు వారి ముఖకవళికలే చెప్తున్నాయి.
“ఈ రంగమే కాదు బాబు… అన్ని రంగాల్లోనూ ఒడిదుడుకులున్నాయి”
వారి వెనుక నుంచి వినవచ్చిన మాటలతో అందరూ వెనుదిరిగి చూశారు. లైబ్రరీ నుంచి కిందకు వస్తున్న ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి అక్కడ నిలబడి ఉన్నాడు.
చేతిలో రెండు పుస్తకాలున్నాయి. లైబ్రరీ నుంచి బయటకు వెళ్తూ మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్న వీరి సంభాషణలు విన్నాడు.
” నువ్వు ఏ రంగంలో పనిచేసినా.. అక్రమాలు అవినీతి, అన్యాయం .. ఉంటాయి. వాటిని ఎదురించి నిలబడాలి. సందర్భం వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మనం చేసే పని మాత్రం వందశాతం నిజాయితీగా చేయాలి.” అన్నాడు.
ప్రొఫెసర్ వీరి అంతరంగాన్ని గుర్తించినట్లు వాళ్లంతా గ్రహించారు. అందుకే డైరెక్టుగా మ్యాటర్ లోకి వచ్చేశాడు.
” మీరన్నట్లు అన్ని రంగాలు వేరు.. మీడియా వేరు సార్.. దీంట్లో శ్రమదోపిడీ తప్ప మాకు మిగిలిందేమీ ఉండదు.” అన్నాడు మోహన్ రెడ్డి.
” మీడియాలో శ్రమదోపిడీ ఉంటుంది కరెక్టే. ఇపుడు ఈ కరోనా దెబ్బకు ఒక్క మీడియానే కాదు అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు. రోడ్డున పడేస్తున్నారు. పరిస్థితులు అలా దాపురించాయి.” అన్నాడు ప్రొఫెసర్. ప్రస్తుత విపత్కర పరిస్థితులను వివరించాలనుకున్నాడు అతను.
” మీరే కాదు.. ఏ రంగాల్లో పనిచేస్తున్న వారు ఆ రంగంలోనే పనిచేయడం అలవాటు చేసుకుంటారు. వేరే పనిచేయడానికి అంత తొందరగా వారు మౌల్డ్ కాలేరు.” అన్నాడు. మనుషుల మెంటాలిటీ గురించి చెప్తూ.
“మీరు కూడా అంతే. అందులోనూ మీడియాలో మీకు దొరికే పరపతి , మరింకేదో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అందుకే దీన్నించి మీరు బయట పడలేకపోతున్నారు” అన్నాడు రవీందర్ రెడ్డి.
ప్రొఫెసర్ చెప్పేటివి వారి బుర్రలోకి ఎక్కుతున్నాయి మెల్లగా. అందరూ సైలెంట్ గా వింటున్నారు.
లైబ్రరీ కి వెళ్లే స్టూడెంట్స్ కొందరు అక్కడ ప్రొఫెసర్ కనిపించే సరికి కొద్ది సేపు ఆగి చూస్తున్నారు. ‘నమస్తే సార్’ అని వెళ్లిపోతున్నారు. వారికి ప్రొఫెసర్ ప్రతి నమస్కారం చేస్తూనే వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ
” పేదల బాధలు, సమాజ శ్రేయస్సు కోసం పాటు పడే ఎంతో మంది జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. మంచి లక్ష్యంతో, భావాలతో ఈ వృత్తిలో రాణిస్తున్నవారున్నారు. పత్రికలవి, చానళ్లకు ఎవరి ఎజెండాలెన్ని ఉన్నా… పేదవర్గాలకు
మేలు చేసేందుకు జర్నలిస్టులుగా ఈ వేదికగా మీకు విస్తృతమైన అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకుంటే మీకు దొరికే సంతృప్తి మాటల్లో చెప్పలేనిదిగా ఉంటుంది.” అన్నాడు రవీందర్ రెడ్డి హితబోధ చేస్తున్నట్టుగా. అందరి వంక ఓ సారి చూశాడాయన.
వీస్తున్న చల్లటి గాలులకు చెట్లు వయ్యారంగా ఊగుతున్నాయి. మెట్ల పక్కనే ఉన్న కొన్ని చెట్ల నుంచి తంగేడుపువ్వుల్లా ఉన్న పసుపు పచ్చని పూలు రాలుతున్నాయి. చెట్ల తోపాటే వాటికి అక్కడక్కడా ఉయ్యాల ఊగేందుకు కట్టిన తాళ్ళు అటూ ఇటూ ఊగుతున్నాయి ఆ గాలులకు.
మానికేశ్వర్ నగర్ వడ్డెరబస్తీ వాసులు బోనాల పండుగ చేసుకున్న మరుసటి రోజు ఇక్కడికే చెట్లకిందకు వస్తారు. వనబోజనాలు చేస్తారు. ఆ రోజు సాయత్రం వరకు ఆనందంగా గడుపుతారు. దశాబ్దాలుగా అది వారి ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కరోనా కారణంగా బోనాలు ఎవరిండ్లలో వాళ్ళు చేసుకున్నారు. చెట్లకిందకు రాలేదు. ఆ కట్టిన ఉయ్యాల తాళ్ళు గత ఏడాదివి.
“ లోపాలతో కూడిన కొన్ని వ్యవస్థలను చీదరించుకునే క్రమంలో మీరు సమాజానికి దూరం కావొద్దు. వ్యక్తుల మీద కోపంతో మనుషులందరిపై ద్వేషం పెంచుకోవద్దు. సమాజ హితాన్ని కోరి పనిచేయాలి. అది మీడియా అయినా.. ఇంకే రంగమైనా” అన్నాడు ప్రొఫెసర్.
వాళ్లంతా దీర్ఘాలోచనలో పడ్డారు. ” సమాజ శ్రేయస్సు కోసం తపన పడే ముందు కుటుంబ క్షేమం మరిచి పోవద్దు సుమా…..” అన్నాడు మళ్లీ
తనే.
ఇక తాను చెప్పాల్సింది ముగిసింది అన్నట్లుగా చూశాడు ప్రొఫెసర్. చుట్టూ ఉన్నవాళ్లంతా సైలెంట్ గా ఉండిపోయారు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
రెండు మెట్లు దిగాడు ప్రొఫెసర్. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సమాయత్తమవుతూనే మళ్లీ వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూశాడు.
“మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వేరొకరిపై నిందలు, సాకులు వేసేందుకు ప్రయత్నించొద్దు. కారణాలు అన్వేషిస్తూ కాలం వృధా చేసుకోవద్దు. ఎక్కడ ఉన్నా మీ సమర్థతే మీకు కొండంత బలం. అది మరవకండి..”
అని వెనక్కి తిరిగి చూడకుండా మెట్లు దిగి వెళ్లిపోసాగాడు.
ఆయన వెళ్తుంటే మనసు బాధగా ఉంది వారందరికీ. ఇంకా కొద్ది సేపుండి వాళ్ళతో సార్ మాట్లాడితే బాగుండు అనుకున్నారు.
” సార్ ఒక్క నిమిషం” అని పిలవాలనుకున్నాడు విజయ్. కానీ గొంతు పెగల్లేదు. అంత ధైర్యం చేయలేకపోయాడు అతను. ఆయన వెళ్లిపోతున్న వైపే చూస్తుండిపోయారంతా. “సార్ చెప్పినట్లు మనం వేరే పని ఏదైనా చేసుకోవాలి” అన్నాడు బాబు
“ అంతా మంచిగున్నప్పుడే ఏం చేసుకోలేకపోయినం. దీనికే అంకితమై పోయినం. ఇపుడు బతుకుడే కష్టంగా ఉంది. బయట పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఇంకేం పనిచేసుకుంటం.” అన్నాడు రాము.
“ఎట్లమరి మన జీవితాలు ఇంతేనా? ” విజయ్ అన్నాడు ఆందోళనగా.
“ఈ మీడియా రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టం బ్రదర్. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.” పెదవి విరిచాడు మోహన్ రెడ్డి.
” ఇంకా దీని పైనే ఆధారపడితే మన జీవితాలు చివరికి విషాదాంతాలే….. ” మళ్లీ తనే అన్నాడు. “మరేం చేద్దాం?”
“పరిస్థితులు బాగయ్యే వరకు ఇట్లనే ఇందులోనే నరకం అనుభవిద్దాం. తప్పదు. తర్వాత ఎవరికి వారే తమ తమ ఇంట్రస్ట్ రంగాల్లోకి వెళ్లిపోండి. ఏదో ఒక పని చెయ్యండి. దాని కోసం మీ ప్రయత్నాలు ప్రారంభించండి” అన్నాడు మోహన్ రెడ్డి.
“అవును..” అన్నట్లుగా చూశారంతా. విజయ్ ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. విజయ్ నవ్వుకు కారణం తెలియక అతన్ని విచిత్రంగా చూస్తున్నారు.
” మన పరిస్థితి చూస్తే నాకొక పిట్టకథ గుర్తొచ్చింది” అన్నాడు విజయ్. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.
విజయ్ ముఖం ఒక్కసారిగా నవ్వు తాలూకు సంతోషం పోయి గంభీరంగా మారింది. అతను వీరి వైపు కాకుండా ఊగుతున్న చెట్లకొనల వైపు చూస్తూ చెప్తున్నాడు పిట్టకథ.
“ఒక ఊర్లో కొందరు బిచ్చగాళ్లుండేవారంట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు భిక్షాటన చేసి తీరిగ్గా ఆ
ఊరి రచ్చబండ మీద కూర్చుని ముచ్చట్లు పెట్టేవారంట. ఆ ఊరి బాగు కోసం అందులో ఒక్కొక్కడు ఒక విధంగా వారి అభిప్రాయలను, సూచలను పంచుకునేవారంట.”
ఊరికి ఓ లైబ్రరీ కావాలని ఒకడు.

ఆహ్లాదానికి ఓ పెద్ద పార్కు కావాలని ఇంకొకడు. నీటి వసతి కల్పించాలని ఓ ముసలి బిచ్చగాడు. అందరికీ ఇండ్లు కావాలని ఓ యువ బిచ్చగాడు. మనోళ్ళ కు రోగం, నొప్పి వస్తే ఉచితంగా చూసేందుకు పే….. ఆస్పిటల్ కట్టించాలని మరొకడు. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పుకునేవారట.
“ఇవన్నీ మనం చేద్దాం ….. మన ఊరిని బాగు చేద్దాం “అని ఉత్సాహాంగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ రోజు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో వాటిని పూర్తి చేసేందుకు, అమలు పరిచేందుకు చివరకు ప్రతిన బూనేవారట.
చెప్పడం ఆపాడు విజయ్.
ఆ పిట్టకథకు , వీరి బాధలకు లింకేమిటో వారికి తెలియలేదు. అర్థం కాని ముఖాలేసుకొని అందరూ విజయ్ ను చూస్తున్నారు.
వారి ప్రశ్నార్థక ముఖాలు చూడగానే మళ్లీ నవ్వొచ్చింది విజయ్ కు. గంభీర వదనం తోనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ మళ్లీ చెప్పసాగాడు.
“అలా ప్రతిజ్ఞ చేసిన వారంతా మళ్లీ పొద్దున లేవగానే జోలె పట్టుకొని ఎవరికి వాళ్లే ఊర్లోకి వెళ్లారంట భిక్షాటనకు.”
చెప్పడం ఆపి అందరినీ తెరిపారచూశాడు. కొద్ది కొద్ది గా ఆ పిట్ట కథ పరమార్థం ఏమిటో వారికి అవగతమవుతున్నది. దీంట్లో ఇంకేదో సస్పెన్స్ ఉందేమో అని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. “మళ్లీ సాయంత్రం కాగానే రచ్చబండ మీద సమావేశమై ఊరి బాగు కోసం చర్చిస్తారంతా” ” ప్రతిజ్ఞ కూడా చేస్తారు.”
(ఇంకా ఉంది)

You missed