ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం… ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ దశాబ్దాల ఘన చరిత కలిగి చెక్కుచెదరని శిల్పంతో ధీమాగా నిలబడ్డట్టు కనబడుతున్నది. ఆ ప్రాంతం, ఆ ప్రాంగణం… ఉద్యమాలకు కేరాప్ అడ్రస్. విద్యాకుసుమాలు పరమళించేది అక్కడే… విప్లవాలు పురుడు పోసుకునేది అక్కడే.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో…. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో… అని దాశరథి కలం నుంచి జాలువారిన భావాలకు నిలువెత్తు నిదర్శనం ఓ యూ.
ఎంతో మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దింది… ఎంతో మంది ఉద్యమకారులకు కొత్త జీవాన్నందించి పోరు బాటలో పయనించేలా చేసింది.
ఆ అద్భుత కట్టడం వెనుక ఎందరి శ్రమ దాగుందో కదా. ఎన్ని చరిత్రలకు ఆ భవనం సాక్షీభూతంగా నిలిచిందో కదా. అయినా ఇంకా చెక్కు చెదరకుండా హుందాగా నిలబడి తలెత్తుకొని ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉంది. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంది. మూర్తీభవించిన అభ్యుదయ భావాలకు వేదికగా ఉంది. ఉద్యమాలకు నేనో ఖిల్లా అని ఎలుగెత్తి చాటుతున్నట్లుగా కనిపిస్తున్నది. భావి తరాలకు నాదీ భరోసా అని కొండలా నిలబడి అభయాన్నిచ్చినట్లుగా తోస్తున్నది. ఆ మెట్లు ఎక్కితే చాలు… విద్యా కుసుమాల సుంగంధం సమ్మోహితులను చేస్తుంది. చెంత చేరి సేదతీరితే అమ్మలా అక్కున చేర్చుకుంటుంది. అక్కడి వారందరికీ ఓ కొత్త కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. కొత్త ప్రపంచంలో విహరింపజేస్తుంది. బంగారు భవిష్యత్తు నిర్మాణంలో ఓ పునాది రాయిగా నిలుస్తుంది.
ఉదయం 9 గంటలు దాటినా ఆర్ట్స్ కాలేజీ ముందు అలికిడి తగ్గలేదు. ఆ ప్రాంతమంతా పొద్దున్నే వాకింగ్ చేసేవారితో యోగాసనాలు వేసేవారితో సందడిగా ఉంది. వారితో కలిసే పచ్చిక మీద పావురాళ్లు ఎగురుతూ ఆడుకుంటున్నాయి. సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
పిల్లల కేరింతలతో అది పార్కును తలపిస్తున్నది. అక్కడక్కడా విద్యార్థులు గుంపులుగా కూర్చుని ముచ్చట్లు పెడ్తున్నారు. ట్రాఫిక్ రణ గొణ ద్వనులు అప్పుడే మొదలయ్యాయి.
అంతలోనే అక్కడికి విజయ్ బైక్ పై వచ్చాడు. విజయ్ ఓ చానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. తార్నాక ఏరియా రిపోర్టర్. బైక్ ను ఓ సైడ్ కు ఆపి ఆర్ట్స్ కాలేజీ ముందున్న ఫౌంటేన్ పై కూర్చున్నాడు. ఎవరికో ఫోన్ చేశాడు. “రాము ఎక్కడున్నవ్?” ఈ రోజు 10 గంటలకు ఆర్ట్స్ కాలేజీ దగ్గర సంతాప సభ ఏర్పాటు చేశాం.” “ఎవరిదీ?” అవతలి నంచి రాము అడిగాడు. “మొన్న ఆత్మహత్య చేసుకున్న శివకుమార్ ది.” “ఓకే” అన్నాడు. ” మనవాళ్లందరికీ చెప్పు.. నేను కూడా ఫోన్లు చేస్తున్నాను.” “సరే సరే” అని ఫోన్ పెట్టేశాడు. దాదాపు గంట పాటు అందరికీ ఫోన్లు చేస్తూ అక్కడే ఉన్నాడు విజయ్. కాలేజీ బిల్డింగ్ ముందే శివకుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయించాడు. చిత్ర పటానికి ఓ పూలమాల వేసి
ఉంది.
ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు శివకుమార్. తెల్లని అతని పలువరుస ఆ ఫోటోలో కూడా మెరిసిపోతూ కనిపిస్తున్నది. నవ్వుతున్న ఆ కళ్లలో ఏదో మెరుపు కనిపిస్తున్నది. బంగారు భవిష్యత్తు కోసం కన్న కలల తాలుకు మెరుపై ఉంటుంది కాబోలు.
చిత్రపటానికి ముందు చిన్న టేబుల్. దానిపై పూలు, కొబ్బరికాయ, అగర్బత్తీలు పెట్టి ఉన్నాయి. పది గంటలు దాటి పదిహేను నిమిషాలు కావొస్తుంది.
ఓ ఐదుగురు జర్నలిస్టులు మాత్రమే వచ్చారు. “ఇంకా మనవాళ్లే రీ” అడిగాడు విజయ్. రాముని. “వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నట్లున్నారు కానిచ్చేద్దాం “అన్నాడు రాము. ఒక్కసారిగా కోపంగా చూశాడు రాము వంక విజయ్. ఓ పది నిమిషాలు మౌనంగా ఉన్నాడు.
ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా .. శివకుమార్ చిత్ర పటం వద్దకు వెళ్లి.. పక్కనే ఉన్న పూల దండను వేసి నివాళ్లర్పించాడు. కొబ్బరి కాయకొట్టి దండం పెట్టాడు.
అగర్ బత్తీలు ముట్టించి టేబుల్ పై ఉన్న అరటి పండుకు గుచ్చాడు. “జోహార్ శివశంకర్”…. అన్నాడు “జోహార్ జోహార్ ” అన్నారు మిగిలినవారంతా. మరో ఇద్దరు జర్నలిస్టులు బైక్ వస్తూ కనిపించారు.
విజయ్ మాట్లాడుతున్నాడు… ” శివకుమార్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఇది చాలా విచారకరం. ఇలా జరిగుండాల్సింది కాదు” అని అగాడు.
అందరూ సైలెంట్ గా అతని వైపు చూస్తున్నారు. మాటలు వింటున్నారు శ్రద్ధగా. ” కరోనా సమయంలో జర్నలిస్టుల జీవితాలు మరింత దుర్బరమయ్యాయి.
మేనేజ్ మెంట్ ఇచ్చే అరకొర జీతాలు, ఎప్పుడో విదిల్చే లైన్ అకౌంట్ తో మనం మొన్నటి దాక బతుకులు వెళ్లదీస్తూ వచ్చాం .”
అతని ప్రసంగంలో ఆవేశం తోడైంది. ” కరోనా వచ్చిన తర్వత మేనేజ్ మెంట్ మనకు మరో కరోనాగా మారింది.”
” ఓ వైపు కరోనా మరో వైపు మేనేజ్ మెంట్ మనల్ని మింగేస్తున్నాయి. శివకుమార్ ఆత్మహత్య మేనేజ్ మెంట్ చేసిన హత్యే…..” అన్నాడు.
అక్కడంతా నిశ్శబ్దంగా మారింది. కొందరు ఇబ్బందిగా కదులుతున్నారు.
” యూనియన్ల గొంతులు చచ్చిబడిపోయాయి. అవి ప్రలోభాల పర్వంలో ఏనాడో ఆత్మహత్య చేసుకున్నాయి. అందుకే వాటి గురించి మనం ఇపుడు మాట్లాడుకోవడం దండగ” అని ఆగాడు.
తాను ఏదో చెప్పబోతున్నాడని అక్కడి వారికి అర్థమయ్యింది.
” మొన్నటి వరకు మనతో కలిసి మెలిసి తిరిగినోడు.. కష్టసుఖాలు మాట్లాడినోడు బంగారు జీవితాన్ని బలి చేసుకున్నాడు . అతనికి ఇద్దరూ ఆడపిల్లలే. చిన్నోళ్లు.”
మళ్లీ ఆగాడు. అతన్నే చూస్తున్నారంత. ” వారి కుటుంబానికి ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ లేదు. అందుకే… మనమే మనకు తోచిన విధంగా ఆర్ధిక సహాయం అందిద్దాం. ఎవరకి తోచించి వారిద్దాం. ఐదొందలు, వెయ్యి,
రెండు వేలు… ఇలా” అని ఆగాడు.
అందరూ ఒకరిముఖం ఒకరు చూసుకుంటున్నారు. ” ఏదో ఉడతా భక్తిగా….” ఇంకా ఏదో అనబోయాడు విజయ్. రాము కల్పించుకున్నాడు. ” మనకే దిక్కులేదు. ఇంక ఆర్థిక సాయం ఏడ చేస్తం?” అన్నాడు కట్టెవిరిచినట్లుగా. “ చిన్న మొత్తమే బై… ఎవరికి తోచింది వారు..” కన్విన్స్ చేయబోయాడు విజయ్.
” రెండొందలుంటే రెండొందలు ఆసరా అన్నట్లుంది పరిస్థితి. నీకు తెల్వంది కాదు. పెట్రోల్ కు కూడా లేక మనోళ్లు అవస్థలు పడుతున్నది మనం చూస్తలేమా?” అన్నాడు మోహన్ రెడ్డి.
” ఏదైనా మీటింగ్ ఉంటే యాభై మందికి తక్కవు రారు. వాడిచ్చే పదో పరక కోసం బిచ్చగాడిలా పడిగాపులు కాస్తారు. ఇపుడు తోటి మిత్రుడు సచ్చిండురా అంటే కూడా ఎవడూ రాకపాయే” అన్నాడు మరో జర్నలిస్టు బాబు
అందరూ అతన్ని చూశారు. కొందరు ముఖాలు అవును అన్నట్లుగా ఉన్నాయి. కొందరు తమను బిచ్చగాళ్లన్నందుకు కోపంగా చూశారు.
“మరేం చేద్దాం….?” అన్నాడు విజయ్ ” పోనీ కనీసం మనం తలో ఐదొందలు వేసుకుందాం” మళ్లీ తనే అన్నాడు. ” ఐదొందలు కాదు.. ఐదు రూపాయలు కూడా మాతో కావు” . ‘మన రాష్ట్రం’ రిపోర్టర్ అంజయ్య నిక్కచ్చిగా చెప్పాడు. విజయ్ కు ఏమి మాట్లాడాలో తెలియలేదు. పట్టరాని కోపం వచ్చింది వారి మీద. అక్కడ్నుంచి రుసరుస వెళ్లిపోయాడు. విజయ్ అక్కడ్నుంచి ముందుకు నడిచాడు. పక్కనే ఉన్న లైబ్రరీ వైపు పోసాగాడతను. అతన్నే అనుసరించారందరు.
(ఇంకా ఉంది)