సోషల్ మీడియా ప్రభంజనం నేపథ్యంలో కూడా ఇంకా చిన్నాచితక పత్రికలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రధాన పత్రికలే వాటి నిర్వాహణ భారం మోయలేక సతమతమై ఖర్చులు తగ్గించుకుని, పేజీలు కుదించుకుని, ఉద్యోగులను తీసేస్తుంటే కొన్ని చిన్న పత్రికలు స్థానికంగా పెట్టుకుని వాటిలో క్వాలిటీతో కూడిన వార్తలు ఇవ్వలేక, అర్ధాలు మారిపోయే విధంగా విపరీతర్ధాలకు దారి తీసేలా పదాలు కూర్చి పలువురిలో నవ్వుల పాలవుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఓ యూట్యూబ్ ఛానల్‌ను పెట్టేసుకుని ఇష్టం వచ్చిన వీడియోలను చేసుకుంటూ.. జనాల మీదకు వదులుతూ టైంపాస్ వ్యవహారంలా మారిన ప్రస్తుత తరుణంలో ఇంకా అక్కడక్కడ చిన్నాచితక కొత్త పత్రికలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అసలు ఎన్ని పత్రికలు ఉన్నాయో? ఎన్ని ఛానళ్లు ఉన్నాయో? ఎన్ని యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయో కూడా లెక్క తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.
లోకల్‌లో ఒక ప్రెస్‌మీట్ పెడితే వందల మంది మీడియా మిత్రులు వాలిపోతున్నారు. ఎవరు దేంట్లో చేస్తున్నారో తెలియదు.. ఎవరు ఏమి రాస్తారో, అవి వస్తాయో రావో తెలియదు. కరోనా తరువాత మీడియా రంగం మరీ అద్వాన్నమైపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న ఈ మీడియా రంగాన్ని మాత్రం ఎవరూ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ దురద ఒక్కసారి అంటుకుంటే జాలిమ్‌లోషన్ కు కూడా అది తగ్గదు.. వినదు. అందుకే ఇలా మీడియాలో ఊబి లో చిక్కుకుని, మునిగిపోతూ ఫాల్స్ ప్రెస్టీజ్ లో పడి కొట్టుకుపోతు ఉన్నారు.