కరోనా వేళ నిర్దాక్షిన్యంగా భారం తగ్గించుకునేందుకు, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి వరకు కష్టనష్టాలకోర్చి పని చేస్తున్న ఉద్యోగులను మెడపట్టి గెంటేసి రోడ్డు పాలు చేశాయి ఈ పత్రికలు, మీడియా. కరోనా వేళ బయట వేరే ఉద్యోగాలు లేవు. వేరే పని చేసుకోవడానికి అనుభవం లేదు. ఉపాధి మార్గాలు లేవు. జీతం వస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పత్రికల మేనేజ్‌మెంట్లు, ఎడిటర్లు కరోనా కన్నా కర్కషంగా ప్రవర్తించారు. సీనియర్లు అని చూడకుండా, ఆ కుటుంబాలు రోడ్డున పడతాయనే సోయి లేకుండా ఉద్యోగాలు పీకేశారు.

మొదటి వేవ్ కరోనా వచ్చినప్పటి నుంచి మొదలుపెడితే, రెండవ వేవ్ కూడా వచ్చి ప్రాణాలు హరించి పోయే దాకా ఉద్యోగాలు పీకేస్తూనే ఉన్నారు. భారం తగ్గించుకుంటూనే ఉన్నారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఈ పత్రికలకు సీనియర్ రిపోర్టర్ల అవసరమొచ్చింది అర్జంటుగా. మంచి వేతనం ఇస్తామంటున్నారు. అపారమైన మీ అనుభవం అత్యవసరమంటున్నారు. మంచి అవకాశం.. మీ కోసమేనని ఆహ్వానిస్తున్నారు. ఈ గోల్డెన్ ఛాన్స్ పోతే మళ్లీ దొరకదని ఊరిస్తున్నారు. కరోనా కాటేయకుండా ఉండి బతికి బట్టకట్టిన సీనియర్లు ఎవరైనా ఉంటే వెళ్లండి ప్లీజ్ . కుటుంబం చిన్నాభిన్నమైపోయి ఉన్నా , గతిలేక పొట్టకూటి కోసం చిన్నాచితక పనులు చేసుకుంటున్న సీనియర్లు ఎవరైనా ఉండి ఉంటే.. వారికి ఇంకా జర్నలిజం మీద ఆశ చావకుండా ఉంటే వారు కూడా అర్జంటుగా దరఖాస్తు చేసుకోండి. మళ్లీ ఇప్పట్లో కరోనా రాదు లెండి. మీ ఉద్యోగాలు అర్ధాంతరంగా తీసేయరు నమ్మండి. కావాలంటే బాండు రాసిస్తారు గ్యారంటీ.