దళితబంధు ఆపాలని ఈటల రాజేందర్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశాడంటూ కొందరు టీఆర్‌ఎస్ శ్రేణులు ఫేక్ న్యూస్ క్రియెట్ చేసి హల్‌చల్ చేశారు. ఇది వాస్తవం కాదంటూ బీజేపీ శ్రేణులు తిప్పికొట్టారు. దళితబంధు ఈటల రాజేందర్ ఆపామంటున్నాడని చెప్పడం మూలంగా దళితుల నుంచి ఈటలను దూరం చేసే ఎత్తుగడకు దిగజారారు కొంత మంది టీఆర్‌ఎస్ శ్రేణులు. సోషల్ మీడియాలో దీన్ని ఘాటుగానే తిప్పికొడుతూ వస్తున్నారు ఈటల అనుచరులు. దీంతో పాటు నిన్న ఆంధ్రజ్యోతిలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వివరణతో ఓ వార్త ప్రచురించింది. దళితబంధు ఆపాలని ఎవరూ కోరలేదని, సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన వివరణ ఇచ్చాడు. అయితే దీనికి కూడా మరో ఫేక్ న్యూస్‌ను తయారు చేశారు టీఆర్‌ఎస్ శ్రేణులు.

ఈటల రాజేందర్ లేఖ వాస్తవమేనని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ అన్నట్లుగా ఓ ఫేక్ వార్త క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీని పైనా బీజేపీ శ్రేణులు మండిపడ్తున్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు ఇంకో అబద్ధాన్ని సృష్టిస్తున్నారని ఫైరవుతూ సోషల్ మీడియాలో దాడికి దిగారు. రాజేందర్ రాజీనామా తర్వాత కొద్ది రోజులు ఇలాంటి ఫేక్ న్యూస్‌లు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్ జాప్యం కావడంతో ఫేక్ న్యూస్ లు ఆగాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మళ్లీ దీనికి తెర లేపారు. పరస్పరం సోషల్ మీడియా వేదికగా దాడులు చేసుకుంటున్నారు. ఇంకా మున్ముందు ఎన్ని ఫేక్ న్యూస్‌లు ప్రచారంలోకి వస్తాయో చూడాలి.

You missed