ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ రాజారెడ్డి ఫోన్ రింగయ్యింది. సంజీవ్… తనతో పాటు పత్రికలో పనిచేసే జర్నలిస్టు. “ అన్నా…. నన్ను పత్రికలోంచి తీసేశారు” అన్నాడు. అతని గొంతులో తీవ్ర ఆందోళన ధ్వనించింది. ఆశ్చర్యపోయాడు రాజారెడ్డి. “అవునా? ” నమ్మలేకపోయాడు.
“ అవునన్నా… నేను సరిగా టార్గెట్లు చేయడం లేదని, ఇంకోవడో చేస్తానని చెప్పడంతో వాడిని తీసుకొచ్చి నా ప్లేస్ లో పెట్టాడు బ్యూరో ఇన్ చార్జి పరమేశ్.”
ఏం మాట్లాడాలో తెలియలేదు రాజారెడ్డికి. రేపు తన పరిస్థితి తలుచుకుంటే మరింత భయం ఆవహించింది
అతనిలో…
” పైకి చెప్పి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని అడుగు ” అన్నాడు రాజారెడ్డి. ఏదో సలహా ఇద్దామన్నట్లుగా.
” లేదన్నా పైన కూడా ఎవడూ పట్టించుకోవడం లేదు. మీరేమైనా చేయండి… ఎవడినైనా తీసేయండి… ఎవడినైనా పెట్టుకోండి … మీ టార్గెట్ పూర్తి చేయమని చెప్పారంట. దీంతో వీళ్లు ఇష్టమొచ్చినట్లు మన జీవితాలతో ఆడుకుంటున్నారన్నా…..” అన్నాడు ఆవేదనగా.
“మరేం చేద్దామనుకుంటున్నావ్?” “ ఏదైనా వేరే పత్రికలో ఛాన్స్ ఉంటే చూడన్నా? ” రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అన్నాడు. “వేరే దాంట్లోనా ?” అని సంశయిస్తున్నాడు రాజారెడ్డి. ఇదంతా వింటున్న శ్రీధర్ కు పరిస్థితి అర్థమయ్యింది.
రాజారెడ్డి నుంచి ఫోన్ గుంజుకున్నాడు. “సంజీవ్ …!నేను శ్రీధర్‌ను” అనగానే “అన్న నమస్తే “అని అక్కడ్నుంచి సమాధానం వచ్చింది.
“ఏ పేపర్లో చేసినా ఇదే రొంపి ఉంటది సంజీవ్ …. మీది అధికార పార్టీ పత్రిక. దీంట్లోనే మిమ్మల్ని టార్గెట్ల పేరుతో రాచి రంపాన పెడుతున్నాడు. వేరొకడు మాత్రం వదులుతాడా? అందరూ అంతే. ”
“ అయినా వార్తలు రాయడం వస్తే సరిపోదు బాబు…. నేటి జర్నలిజంలో. మన కులపోడు పైన ఎవడైనా ఉ న్నడేమో చూసుకోవాలె. ఎవడూ లేకపోతే రాజకీయ నాయకుల అండ తోడుండాలె. మన వెనుక ఎవడు గోతులు తీస్తున్నాడో తెలుసుకునేందుకు ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలె. ఉన్న జాబ్ ను కాపాడుకోవాలంటే ఇవన్నీ చెయ్యాలె. మేనేజ్ మెంట్ ఇచ్చిన టార్గెట్లు చేయాలి… ఇవన్నీ చేస్తనే నువ్వు ఉంటవ్. ” అన్నాడు.
“అవునన్న నిజమే… ” అన్నాడు సంజీవ్. ఏం మాట్లాడాలో తెలియక. ” ఇదంతా నీ వల్ల కాదు కానీ ఏదైనా వేరే పని చూసుకో.” అన్నాడు. “ అన్నా పదేండ్లు దీంట్లో పనిచేస్తే ఇదేనా అన్నా వాళ్లు మనకిచ్చే మర్యాద, గౌరవం…”
“ ఆత్మ గౌరవం, బొంగు బోశానం అని మనమే రాస్తాం. ఇపుడు మన ఆత్మ గౌరవాన్నే బొంద పెట్టిర్రు కద అన్న” అన్నాడు సంజీవ్.
” నువ్వు ఇన్నేండ్లు పనిచేసి ఏం సంపాదించినవ్ వయ్యా” అన్నాడు శ్రీధర్ అసహనంగా. “నీకు తెల్వదా అన్నా “అన్నాడు సంజీవ్
“ అవసరంగా వాడికి దోచిపెడుతూ నీ భార్యా పిల్లలను రోడ్డునెందుకు పడేస్తవ్ బై “అన్నాడు… ఒకింత కోపంగా శ్రీధర్.
“కనీసం వాడు నాకు సమాచారం ఇవ్వకుండానే నన్ను గ్రూపులోంచి రిమూవ్ చేశాడన్నా… నేను అంత పెద్ద తప్పు ఏమి చేశానని “అన్నాడు ఆవేశంగా… సంజీవ్.
వాడు అంటే వాళ్ల బ్యూరో ఇన్ చార్జి పరమేశ్. ” మీ వాడి గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదనుకుంటా. ఇక్కడి రాకముందు వాడు పనిచేసిన చోట వాడి బాగోతం తెలుసుకుంటే నీకు అర్థమవుతుండే ” అన్నాడు. ” ఏమైంది?” అన్నాడు సంజీవ్. ” ఒక రిపోర్టర్ ను ఇట్లనే వేధిస్తే … భరించలేక
ఆఫీసుకు వచ్చి చెప్పుతో కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడు. నడిరోడ్డు మీద తన్ని మరీ నీ ఉద్యోగం వద్దు అని అక్రిడేషన్ కార్డు వాడి ముఖం మీద విసిరేసి వెళ్లిపోయాడు. ”
“అవునా? “అన్నారు శ్రీధర్, రాజారెడ్డి లిద్దరు ఆశ్చర్యపోతూ.
“మరొకడు వీడి టార్చర్ భరించలేక జీవితంపై విరక్తి చెంది వీడిని చంపద్దామని డిసైడ్ అయ్యాడు. ” అని ఆగాడు శ్రీధర్.
ఇద్దరూ ఆసక్తిగా, ఆత్రతుగా వింటున్నారు. ” ఆ
బాధితుడు ఓ రోజు బాగా తాగి…. ఒరే లం… కొడుకా! నువ్వు మనిషివా, రాక్షసుడివిరా… పైన నీకు కులబలముందని విర్రవీగుతున్నావా? నిన్ను చంపేస్తరా లపైకే.. ఎవడికి చెప్పుకుంటవో చెప్పుకో… నేను లోకల్ రా హౌలే… నీనీడనే వుంటా…… అని వార్నింగ్ ఇస్తూ వాయిస్ మెసెజ్ పంపాడు.” అన్నాడు.
అవతలి నుంచి సంజీవ్ పకపక నవ్వుతున్నాడు…. నవ్వి నవ్వి బలవంతంగా నవ్వాపుకుంటూ…. “తర్వాతేమైందన్నా? “అన్నాడు. “ తర్వాతేమైంది….? కరెంటు షాక్ కొట్టిన కాకిలెక్క వొణికిపోయి రెండ్రోజులు వాడు నిద్రపోలేదంట “అన్నాడు. ఈసారి శ్రీధర్ కూడా గట్టిగా నవ్వాడు. రాజారెడ్డి జతకలిశాడు.
” కిందా మీద మూసుకొని కొన్ని రోజులు ఇంటికే పరిమితమై దొంగలెక్క పనిచేసుకున్నాడు” అని అన్నాడు శ్రీధర్.
“ అంతెందుకు వయ్యా… మొన్న సాయాగౌడ్ అనే రిపోర్టర్ సర్క్యూలేషన్ బుక్కు వీడి మోఖానా కొట్టి పోరా పో నువ్వు నీ ఉద్యోగం .. అని మీటింగ్ లోనే చెప్పాడంట. దీంట్లో పనిచేసిన పాపానికి నా ఫొటో స్టూడియో ఆగమయ్యింది. పోయి అదే పనిచేసుకుంటా అని అక్రిడేషన్ టేబుల్ పై పాడేసి వెళ్లిపోయాడు… “అని ఆగాడు శ్రీధర్.
” మరిపుడు నేనేం చెయ్యాలన్నా? ” మళ్లీ మొదటకొచ్చాడు సంజీవ్. చిర్రెత్తుకొచ్చింది శ్రీధర్ కు……..
“విలేకరి గిరీ లేకుంటే చచ్చిపోతావా?” అన్నాడు కోపంగా శ్రీధర్. ఒక్కసారిగా శ్రీధర్ కోపోద్రోక్తుడవ్వడంతో అవతల సంజీవ్ సైలెంటయ్యాడు.
” పైన మీ ఎడిటర్ గాడొక శాడిస్ట్… ఈ సమయంలో టార్గెట్ల పేరుతో మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు… ఇక్కడ మీ బాస్.. ఆడో అపరిచితుడు… మీకు నిద్ర లేకుండా చేస్తాడు. నరకం ఎట్లుంటదో చూపిస్తడు… ఇపుడు దాంట్లో నువ్వు పనిచేయడం అవసరమా? “ సముదాయించే ప్రయత్నం చేశాడు శ్రీధర్.
” గ్రూపులో వాడు పెట్టిన మెసేజ్ కు “ఓకే సార్’ అని పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని వెంటనే ఫోన్ చేసి మరీ అడుక్కునే కక్కుర్తి కంత్రీ నా కొడుకు వయ్యా వాడు…. ఇపుడే మీ రాజారెడ్డి చెప్తున్నాడు….” అన్నాడు.
“అన్నా..! సీనియర్ రిపోర్టర్ రమేశన్నను కలిసి నా బాధ చెప్తా అన్నా.. ఆ అన్నకు ఎడిటర్ స్థాయిలో పరిచయాలున్నాయి… అతను ఏమైనా హెల్ప్ చేస్తాడేమో…” అన్నాడు సంజీవ్. ఇంకా ఆశ చావక.
మళ్లీ కోపం నశాలానికంటింది శ్రీధర్ కు.
” ఎవుడు వాడా….? వాడో పచ్చి కామాంధుడు. ఎవరితోనైనా అక్రమసంబంధాలు పెట్టుకునేందుకు వెనుకాడని వావివరుసలు, నీతి
జాతిలేని కుక్క మీ బలహీనతలను ఆసరా చేసుకొని, వాటితో ఆడుకుని పైశాచికానందం పొందే దివాళకోరు దగుల్బాజీ……” ఇంకా ఏదేదో తిట్టాలనుకున్నాడు. కొద్ది సేపు ఆగాడు. శ్రీధర్ కోపాన్ని చూసి అవతల సంజీవ్ వణికి పోయాడు…
” అన్నా… నేను మళ్లీ మాట్లాడుతాను” అని పెట్టేశాడు. శ్రీధర్ ఫోన్ తీసి పక్కనే గడ్డి మీదకు కోపంగా విసిరేశాడు. అంతలోనే ఆ ఫోన్ మోగింది. రాజారెడ్డి బాస్ ఫోన్ చేస్తున్నాడు.
తాగింది దిగినంత పనైంది రాజారెడ్డికి. వెంటనే ఫోన్ అందుకుని లేచి నిలబడి అల్లంత దూరం వెళ్లాడు. అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసి మెల్లగా మాట్లాడుతున్నాడు…..
అవతలి నుంచి ఏమేమి వార్నింగులు వస్తున్నాయో కూర్చుని శ్రీధర్ ఊహిస్తున్నాడు. రాజారెడ్డి మాత్రం… మధ్య మధ్యలో “సార్, సార్……” ” సరే సార్…” “ వస్తా సార్…… ఇస్తా సార్…..” “మంచిది సార్…..” అంటున్నాడు. చివరగా “ప్లీజ్ సార్….” అన్నాడు. అంతలోనే అవతల ఫోన్ కట్టయ్యింది. దిగాలుగా దీనంగా ముఖం పెట్టుకొని వస్తున్నాడు రాజారెడ్డి. ” ఏమైంది?” అని అడగలేదు శ్రీధర్. వాళ్ళ ఇంచార్జి ఏం మాట్లాడి ఉంటాడో అర్థం చేసుకున్నాడు.
( ఇంకా ఉంది)