ఒక్కసారిగా మిత్రుడు నరసింహా అలా వంద రూపాయలు అడిగే సరికి రాజారెడ్డి మనస్సు కలుక్కుమన్నది. వెంటనే జేబులు తడుముకున్నాడు. మొత్తం వెతికినా చేతికి యాభై రూపాయలకు మించి దొరకలేదు.
ఏదో తప్పు చేసినవాడిగా ముఖం పెట్టుకొని… ” నరసింహా….. యాభయ్యే ఉన్నయ్ ” అన్నాడు.
” సరే యాభై అయితే యాభై … సరిపెట్టుకుంటాలే ” అన్నాడు. ముందుకు వచ్చి చేతిలోని యాభై తీసుకొని జేబులో పెట్టుకున్నాడు.
” ఏంది బై పెట్రోల్ కు కూడా పైసలు లేకుండా తిరుగుతున్నవా?” అడిగాడు రాజారెడ్డి. తర్వాత అనుకున్నాడు అనసవరంగా అడిగానని. ఎందుకంటే చాలా సందర్భాల్లో తన పరిస్థితి కూడా అదే.
” నువ్వు మస్తు చెప్తవ్ బై… నీ భార్య వార్డెన్ గా చేస్తుంది. అంతో ఇంతో జీతమొస్తుంది. మరి మా పరిస్థితేంది? ఇంట్లో వేరే ఇతర ఆదాయ వనరులేమి లేవు. మన ఆఫీసులో వార్తలకు లైన్లు లెక్కబెట్టి ఇచ్చే ముష్టి తప్ప. అదీ లేదు ఏడాదిగా. నీకు తెల్వంది గాదు. మన పరిస్థితి మరీ రోజుకు రోజుకు అధ్వానమైపోయింది రెడ్డి” అన్నాడు.
తన ఇంటి పరిస్థితి గురించి నరసింహా దగ్గర డిస్కషన్ చేయడం రాజారెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఆ టాపిక్ ఎత్తలేదు. తన ఆర్థిక పరిస్థితి గురించి తను గొప్పగా ఊహించుకుంటున్నాడనుకున్నాడు.
అంతలోనే అక్కడికి గోపీ వచ్చాడు. బైక్ ను ఆపినా ఇగ్నీషియన్ బంద్ చేయలేదు. ఇంజిన్ సప్పుడు మధ్యే ” మీరు రావడం లేదా?” అన్నాడు.
వారికి అర్థం కాలేదు.
“ఎక్కడికి? ” అన్నారిద్దరు ఒకేసారి. “మాజీ మంత్రి .. మీడియా వాళ్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తున్నడంట” అన్నాడు. ” ఇన్ని రోజులకు ఆయనకు మీడియా గుర్తొచ్చిందంటన …..” వ్యంగ్యంగా అన్నాడు నరసింహా.
“ ఆయనిచ్చే మాస్కులు, శానిటైజర్లతో ఇక మనమంతా బతకిపోతాము. వాటితోనే మన జీవితాలు నిలబడతాయన్నమాట” అన్నాడు మరింత ప్రస్టేటెడ్ గా
“మరింకేమియ్యమంటావ్?” అంతే అసహనంగా అడిగాడు గోపీ.
“వాడో లిక్కర్ మాఫియా కింగ్. రాజకీయాల్లోకి రాకముందు పేదోళ్ల జీవితాలు కూల్చి మేడలు కట్టాడు. కోట్లకు పడగలెత్తాడు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు వెనకేసుకున్నాడు. ఈ విపత్కర సమయంలో ఆయన మీడియాకు చేసే సేవ ఇదన్నమాట… ” అన్నాడు కరుకుగా.
అంతలోనే మరో మీడియా మిత్రుడు మహేష్ బైక్ పై వచ్చాడు. అప్పటికే అక్కడికి వెళ్లి మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకున్నట్లున్నాడు. ఒక శానిటైజర్ బాటిల్ బైక్ కవర్లోంచి తీసి వారి చేతుల్లోకి ఒంపుతున్నాడు.
అప్పుడు చూశాడు బాటిల్ పై నరసింహా. మాజీ మంత్రి బొమ్మ ముద్రించి ఉంది దానిపై. ఒక్కసారిగా అరికాలి మంట నెత్తికెక్కింది నరసింహాకు.
” థూ… వీడూ వీని బతుకు. శానిటైజర్లను నేనే ఇచ్చాననే బిల్డప్ కోసం, చీప్ పబ్లిసిటీ కోసం తన బొమ్మను ముద్రించుకున్నాడు…. ఇంతకన్నా దిగుజారుడేముంటది” అన్నాడు.. ఆ ఇద్దరి వంక చూస్తు.
“ రాజకీయాల్లో తలపండిపోయింది… కిందా మీద నడిచింది… ఇప్పటికీ వీడికి ఇంకా బుద్ధి పెరగనట్లుంది బై…
ఆయనకు ప్రచారం బాగా కావాలనుకుంటే ప్రజలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేస్తే సరిపోద్ది కదా.
నిత్యావసర వస్తువులో, ఆర్థిక సాయమో….. ఏదో ఒకటి చేయొచ్చు.. గిదేంది బై మరీ చీప్ పబ్లిసిటీ.. మరీ గింతలా దిగజారిపోయి మన నాయకులు ” అన్నాడు కచ్చగా.
“మాస్కులపై కూడా ఆ పేడుమూతోని బొమ్మలున్నయా?” అన్నాడు నరసింహా మళ్లీ.. “ కొన్నింటిపై కొట్టించుకుండన్నా” అన్నాడు గోపీ.
“ పీనుగు మీద పేలాలు ఏరుకునే రకాలు బై వీళ్లు….. రాజకీయాలకు వచ్చి కోట్లు కూడబెట్టిర్రు. ఇసొంటి సమయంలోనైనా పబ్లిక్ కు మేలు చేసి వారిని ఆదుకునేలా సేవ చేస్తే గుర్తుపెట్టుకుంటరు కదా. ” అన్నాడు ఆవేశంగా నరహరి.
“పోనీయ్యవే… నేను వెళ్తా. ఆకలైతుంది ” అన్నాడు రాజారెడ్డి. “చేసేది గోరంత……. ప్రచారం కొండంత … థూ ఈళ్ల బతుకులు…..” మళ్లీ అందుకున్నాడు నరసింహా. ఇదిప్పట్లో తెమిలేలా లేదని అనుకున్న ఇద్దరు…. మెల్లగా చెరోవైపు జారుకున్నారు. బండి చాలు చేసుకొని తుర్రుమన్నారు. అప్పటికే సాయంత్రమవుతున్నది. ఆకలి తట్టుకోలేక లోపల పేగులు గాండ్ర పెడుతున్నాయి.
అంత ట్రాఫిక్ రణగొణ ధ్వనుల్లోనూ ఆ పేగుల ఆర్తనాధాలు రాజరెడ్డి చెవులకు వినిపిస్తున్నాయి. బైక్ స్పీడ్ పెంచాడు.
వాతావరణం చల్లగా ఉంది. మళ్లీ ఈ రోజు రాత్రి కూడా వాన పడేలా ఉంది అని మనసులో అనుకుంటూ బైక్ నడుపుతున్నాడు.
మెల్లగా చినుకులు ప్రారంభమయ్యాయి. బైక్ స్పీడ్ మరింత పెంచాడు. భార్య ఇంటికి వచ్చిందా ? రాలేదా? అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు.
వనజ కూడా అప్పుడే ఆటో దిగుతున్నది ఇంటి ముందు. రవి ఆటోను మలుపుకొని వెళ్లిపోయాడు.
బైక్ ను వాకిట్లో ఓ పక్కగా పార్కింగ్ చేసి… గబగబా కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి పోయాడు రాజారెడ్డి. “ఆకలైతుంది అన్నం పెట్టమ్మా?” పెద్ద బిడ్డ అనన్యను అడిగాడు.
” అమ్మ వంట చేయలేదు నాన్న అన్నది” ఆమె. చివాలున తల పైకెత్తి చూశాడు. ఆ ముఖ హావభావాలలో ఎన్నో ప్రశ్నలు.
తండ్రి ముఖం చూసి భీతిల్లిన అనన్య ఏం చెప్పాలో తెలియక.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన అమ్మ వైపు చూసింది ఈ ఉపద్రవం నుంచి రక్షించు అన్నట్లుగా. .
ఆకలితో పీక్కుపోయి ఉన్న రాజారెడ్డి ముఖం చూడగానే వనజకు పరిస్థితి అర్థమయ్యింది. ” ఇయ్యాల వంట చేయలేదు.” అన్నది
*****
అవతల సైడ్ నుంచి మాట పెగలడం లేదు. ఎందుకు అని అడిగేందుకు సైతం ఓపికలేనట్లుగా గొంతు పూడుకుపోయి ఉంది రాజారెడ్డికి.
మళ్ళీ ఆమే అంది. “మన గల్లీలో లక్ష్మి వాళ్లింట్లో లక్ష్మీపూజలున్నాయి. అక్కడికి రమ్మని నిన్ననే ఆమె చెప్పింది” అన్నది ఆమె. లక్ష్మీ అంటే విఠల్ భార్య. విఠల్ తనకు పరిచయమే. కారు డ్రైవర్గా పని చేస్తాడు. “అక్కడెవరో పూజ చేస్తే ఇంట్లో వంట చేయకపోవడమేందీ?” అన్నాడు. అతనికి కోపం నశాలానికంటుతున్నది.
“అయినా నేను దేవుళ్లు, గీవుళ్లు నమ్మనని నీకు తెలుసు కదా. ఆడోళ్లు చేసుకునే ఆ పూజకు నేనెందుకు రావాలె?” అతని మాట బావిలోంచి వస్తున్నట్లుగా ఉంది. కళ్లు ఎర్రబడి ఉన్నాయి.
“వాళ్లు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు… వినాయకచవితి తర్వాత లక్ష్మీ పూజలు చేసుకోవడం వాళ్ళ ఆనవాయితీ.. రెండ్రోజులు ఇంట్లో లక్ష్మీ దేవతలను ప్రతిష్టించుకొని , తెలిసిన వాళ్లను ఇంటికి పిలుస్తారు. పిండివంటలు చేస్తారు. భోజనాలు పెడతారు.” వివరించింది వనజ.
” సరే మీరు వెళ్లిచ్చుగా నాకు వంట చేస్తే సరిపోయేది” అన్నాడు.
“ఇంట్లో అన్ని సరుకుల అయిపోయాయ్. పప్పులు, బియ్యం దగ్గర పడ్డయ్… నువ్వు ఇంట్లకు ఇచ్చేదేమీ లేదాయే.. నా సంపాదనతోనే సంసారం నడుపుతున్నా.
భార్య చెప్పేది మెల్లగా తలకెక్కుతుంది. “ అందుకే ఇంటిల్లిపాది వెళ్లి అక్కడే భోజనాలు చేద్దాం…..” “ అయినా మీకు ఆమె భర్త విఠల్ కూడా పరిచయమే కదా. ఎందుకు అంత నమోషీ” అన్నది. రాజారెడ్డికి ఏం చేయాలో అర్థం కాక… కోపంతో ఊగిపోతూ మంచినీళ్ల గ్లాసును గోడకు విసిరికొట్టాడు. బలంగా విసిరిన ఆ గ్లాసు గోడకు తగిలి అంతే వేగంగా వెళ్లి ఆ పక్కగోడకు తగిలి దానికి ఉన్న అద్దాన్ని
తాకింది. ఆ అద్దం పగిలింది. అద్దం పగుళ్లుగా ఏర్పడినా గాజు పెంకులు ఊడి కింద పడలేదు. అద్దం ఫ్రేమ్ గోడకు వేలాడుతున్నది. అందులో రాజారెడ్డి ముఖం కనిపిస్తున్నది … ఆ పగిలిన అద్దంలో చూడటానికి చాలా వికారంగా ఉ ంది అతని ముఖం. తన ముఖం తనకే భయంకరంగా కనిపించింది. వెంటనే అక్కడి పరిస్థితులు గమనించిన రాజారెడ్డి సర్దుకున్నాడు. పెరిగిన పిల్లల ముందు గొడవ పడితే బాగుండదని తమాయించుకున్నాడు.
” సరే సరే పదండి.. నేనూ వస్తాను ” అన్నాడు… తను చేసిన పొరపాటును వారు వేలెత్తి చూపేలోపు పరిస్థితిని చక్కదిద్దాలని.
పిల్లలు బిక్కుబిక్కుమంటు బయటకు నడిచారు. విసరుగా, కోపంగా భర్తవంక ఓ చూపు చూసి అక్కడ్నుంచి బయటకు వెళ్లింది వనజ.
అదే గల్లీలో ఉన్న లక్ష్మి ఇంటికి వెళ్లారంతా. రాజారెడ్డి వారి వెనుకే నడుస్తున్నాడు. తనకు చచ్చేంత అవమానంగా ఉంది. ఓ పూట భోజనం కోసం ఇంత ప్రాయాస పడాలా? తనలో తాను అనుకుంటు కుమిలిపోతున్నాడు.
లక్ష్మి ఇల్లు వచ్చింది. లోనికి నడిచారు. అప్పటికే కొందరు వచ్చి పూజ కార్యక్రమంలో కూర్చున్నారు. లక్ష్మి భర్త విఠల్ వచ్చి ” ఆ నువ్వూ వచ్చావా రాజన్న… రా రా లోపలికి” అని పక్క రూమ్ లోకి తీసుకుపోయాడు.
ఆ రూమ్ లో విఠల్ దోస్తు సలీం కూడా ఉన్నాడు. సలీం, విఠల్ చిన్ననాటి దోస్తులు. సలీంకు మెకానిక్ షెడ్ ఉంది. తొలత మెకానిక్ గా పనిచేసి అందులో పనంతా నేర్చుకొని ఇటీవలే సొంతగా ఓ గ్యారేజీ పెట్టుకున్నాడు. సలీం కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఒకరి పండుగలకు, శుభకార్యాలకు మరొకరు వెళ్తారు. సలీంకు విఠల్ కన్నా ముందే పెళైంది. ఇద్దరు పిల్లలు. విఠల్ కు పెళ్లి మూడేండ్లయింది. వారికింకా సంతానం కలగలేదు. అప్పుడప్పడు ఆదివారాలు డాబాపై ఇద్దరే కూర్చుని మందు తాగుతారు. ఒకరికొకరు స్నేహంగా ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా. లక్ష్మి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రాజారెడ్డి ఇంటికి వచ్చి వనజతో కాసేపు మాట్లాడి పోతుంటుంది. విఠల్ డ్రైవర్ కావడంతో ఉదయం వెళ్లి ఏ రాత్రికో గాని వచ్చేవాడు కాదు. ఎప్పుడైనా తారసపడినప్పుడు రాజారెడ్డితో కాసేపు మాట్లాడి వెళ్లేవాడు.
” ఇతను రాజారెడ్డి సాబ్” అని తన మిత్రుడు సలీంకుపరిచయం చేశాడు విఠల్.
కరోనా కారణంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏనాడో మరిచిపోయారు. చేతులు జోడించి నమస్కరించాడు సలీం. తనూ ప్రతినమస్కారం చేశాడు రాజారెడ్డి.
“స్వరాష్ట్రం ‘ దినపత్రికలో సీనియర్ రిపోర్టర్ ” చెప్పాడు తన గురించి విఠల్ కళ్లు పెద్దవి చేసి సలీం ఆశ్చర్యంగా ‘అవునా?” అన్నట్లుగా చూశాడు.
రాజారెడ్డికి ఎంతో గర్వంగా తోచింది. లోపల ఆకలిని కొద్దిసేపు మరిచిపోగలిగాడు. పూజ కొనసాగుతున్నది. ‘పూజ ఎప్పుడు పూర్తవుతుందో?’ అని ఓ చూపు అటువైపు పోనిస్తున్నాడు తరుచుగా.
కొన్ని పిండివంటలు ఆ గదిలోకి తీసుకొచ్చి ఇచ్చింది లక్ష్మి. ఆ ప్లేట్ చేతికందగానే ఆవురావురమంటు తిన్నాడు రాజారెడ్డి. సలీం, విఠల్ మాట్లాడుకుంటున్నారు.
పూజ ముగిసింది. అందరు భోజనాలకు లేచారు. రాజిరెడ్డికి మాత్రం అక్కడ తినాలంటే మనసొప్పడం లేదు. పిండి వంటల ఫలహారాలతో ఆకలి రాముడు కొంత శాంతించాడు. ఇది చాలనుకున్నాడు.
కానీ విఠల్ వదల్లేదు. “మనం ముగ్గురం కలిసి తిందాం. మీరెప్పుడూ బిజీబిజీగా ఉంటారు. ఈ
రోజైనా మాకు టైం ఇవ్వండి” అని మొహమాట పెట్టాడు. వారికి ఆ గదిలోనే అన్నం పెట్టారు. మరాఠీ సంప్రదాయాలకనుగుణంగా వంటలు చేశారు.
