అతనికిచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. కానీ ఫలితం మాత్రం లేదు. ఇచ్చిన టార్గెట్ లో పదిశాతం కూడా ఫలితం లేదు. గతంలో ఏదో కిందా మీద పడి చేసి అయిందనిపించేవాడు. ఇపుడు మరీ కష్టంగా మారింది. ఉంటావా? పోతావా? చేస్తావా ? చస్తావా? అన్నట్లుంది మేనేజ్ మెంట్ దోరణి.
తెల్లారితే తన బతుకు తెల్లారేలా ఉందనే ఆలోచనలు అతన్ని సతమతం చేస్తున్నాయి. “ఈ ఉద్యోగం పోతే ఇంకేం చేయాలి?” “వేరే పని ఏది వెతుక్కోవాలి?” “ఈ సమయంలో ఏ పని దొరుకుతుంది?” “జర్నలిస్టుగా కాకుండా వేరే పని చేయగలనా?”
ఈ ఆలోచనలు అతన్ని సతమతం చేస్తున్నాయి. బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
ఈ ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే భళ్లున తెల్లారింది. వాన వెలిసినట్లుంది. కిటికీలో నుంచి వెలుతురు మెల్లగా ఆ గదిలో పరుచుకుంటున్నది. చీకట్లు అలుముకున్న ఆ గదిలో కొద్ది కొద్దిగా వెలుగు కనిపిస్తున్నది. దుప్పటి తీసి కిటికీ వైపు చూశాడు రాజారెడ్డి. కళ్లకు నేరుగా వెలుతురు తాకేసరికి మళ్లీ కళ్లు మూసుకున్నాడు. మళ్లీ దుప్పటి పైకి లాక్కుని ముసుగుతన్ని పడుకున్నాడు. బయట చీపుర్లతో వాకిలి ఊడుస్తున్న చప్పడు…… ‘సుయ్! సుయ్!’ మని వినిపిస్తున్నది.
ఆ అలికిడికి రాజారెడ్డి భార్య వనజ నిద్రలేచింది. పిల్లలను లేపుతున్నది.
‘తెల్లారింది లేస్తావా?” భర్తను కేకేసింది. వినిపించినా అతను కదల్లేదు. “కూరగాయలు లేవు. చౌరస్తా దాక వెళ్లి తీసుకురావాలి. ఈ రోజు డ్యూటీ ఉంది. నేను పోవాలి!” అన్నది. ఒక్కసారిగా మూసిన కళ్లు తెరుచుకున్నాయ్ రాజారెడ్డికి.
ఇన్ని రోజులు కరోనా, లాక్ డౌన్ పేరుతో భార్య ఇంట్లోనే ఉన్నది. ఇపుడు ఆ లైన్ క్లాసులు స్టార్ట్ కాబోతున్నాయి. రోజు తన భార్యను తన బైక్ మీద హాస్టల్ వరకు వదిలి పెట్టి మళ్లీ తీసుకురావడం కూడా తన డ్యూటే. తనకు వీలుపడనప్పుడు తమ వీధిలోనే ఉంటున్న ఆటో రవి దించేస్తాడు. నెలకెన్ని సార్లు ఆటోలో వెళ్లిందో లెక్కగట్టి భార్యే అతనికి డబ్బులు చెల్లిస్తుంది.
కూరగాయలు తెస్తాగానీ, హాస్టల్ దాకా నేను రాను. ఆటోలో వెళ్లు! మెల్లగా ముసుగు తీసి తల బైట పెట్టి అన్నాడు రాజారెడ్డి.
కోపంతో తీక్షణంగా ఓ చూపు అతని వైపు చూసి.. మూలకున్న చీపురు తీసుకొని బయటకు నడిచింది వనజ. భార్య చూపులో ఆంతర్యాన్ని పసిగట్టినా అదేమీ పట్టించుకోకుండా మళ్లీ నిండా దుప్పటికప్పుకున్నాడు.
ఒక్కసారిగా అతని బాస్ ఉగ్రరూపం కళ్లముందు కదలాడే సరికి దిగ్గున లేచి కూర్చున్నాడు. చల్లటి చెమటలు పడుతున్నాయి.
“ఈ రోజు ఏం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి?” “రోజూ ఇలా భయపడుతూ బతికే బతుకు అవసరమా? ఇదొక ఉద్యోగమా?” ఆలోచిస్తున్నాడు. “నన్ను హాస్టల్ లో దిగబెట్టకుండా ఇయ్యాల నువ్వు చేసే పనేమిటో?” లోపలికి వస్తూ భార్య అడిగింది.
“నీకు తెలుసు కదా వనజ! చందాలు, యాడ్లు అని మావోడు నన్ను సంపుక తింటుండు. కరోనా పేరు చెప్పి అందరి ఉద్యోగాలు తీసేస్తున్నారు. మా పాత బాస్ ను హైదరాబాద్ కు పంపిండ్రు. కొత్తోడు వచ్చిండు. కొత్త టార్గెట్లు పెట్టిండు” అన్నాడు.
“ఎవడొచ్చినా తప్పదు. నీకు చేతగాకపోతే ఇంకొకడు చేస్తాడు” అన్నది వనజ ఇంట్లో పనిచేసుకుంటూ. “అంటే నాకు చేతకావడం లేదనా? బయట మార్కెట్ ఎలా ఉందో తెలుసా అసలు” ఆవేశంగా ఏదో చెప్పబోయాడు.
“మార్కెట్ ఎలా ఉంటే ఏంది? తిండి తినడం బంజేశామా? ఖర్చులు ఆగుతున్నాయా? అయినా, నీకు ఆ పని చేతగాకపోతే వేరే పని చేసుకో” అన్నది వనజ అసహనంగా.
“కరోనా టైంలో వేరే పనా? ఎవడిస్తాడు? ఏ పని దొరుకుతుంది? “ఏమో నాకేం తెలుసు? కుటుంబ బాధ్యత తెలిసినోడివైతే ఏదైనా చేస్తావు. నేను చెప్పాల్నా? ఆమె మాటలు అతనికి ఈటల్లా గుచ్చుకున్నాయి. తన భార్య వనజ దెప్పి పొడుపు మాటలతో రాజారెడ్డి అహం దెబ్బతిన్నది.
” నేను హాస్టల్ వరకు రావడం లేదు.. నాకు పనుంది…” అని ఒక్క ఉదుటన మంచం పై నుంచి లేసి బాత్రూం వైపు నడిచాడు.
హడావుడిగా రెడీ అయి బైక్ బయటకు తీశాడు. “ఏందీ టిఫిన్ చేయవా?” భార్య ఒకింత అసహనంగా అడిగింది. ” ఏమక్కరలేదు.. నేను బయట ఏదో ఒకటి తింటాను..” అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు రాజారెడ్డి. “ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకండి…. కరోనా వస్తే నీతో పాటు మేమంతా చావాలి……… ”

(స‌శేషం)

You missed