” నిన్నటితో నాకు 58 సం. పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఉపాధ్యాయ సేవలకు చివరి రోజు కావాల్సింది. ప్రభుత్వ అనుచిత నిర్ణయం తో 3 సం. పెంచబడింది. నాకు ఆర్థిక తోడ్పాటు కూడా పెరిగింది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి బదులు గా వారికి ప్రభుత్వం చేసిన ద్రోహం బాధను కలిగిస్తూనే ఉన్నది. నన్ను కలచి వేస్తూనే ఉన్నది.”

అశోక్ కుమార్ ఎర్రగుంట. సంగారెడ్డి నివాసి. తన ఫేస్ బుక్ వాల్ పై నిన్న పెట్టుకున్న కామెంట్ ఇది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మూడు సంవత్సరాలు పెంచి ప్రభుత్వం నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రాసుకున్నాడు. వాస్తవంగా ఉద్యోగుల వయసు పెంపు అంశం ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఒకటి. కానీ చాలా మంది ఉద్యోగులకు ఈ పెంపు వయసు పెద్దగా ఇష్టం లేదనట్లుగానే మాట్లాడుతున్నారు. మహిళా ఉద్యోగుల్లో మెజార్టీ దీనికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది.

ఆరోగ్య సమస్యలు, వయసు పైబడడంతో వచ్చే సమస్యల కారణంగా యాభై ఎనిమిది ఏండ్ల తర్వాత మరో మూడేండ్లు ఉద్యోగంలో కొనసాగడం ఆచరణలో కష్ట సాధ్యమే. అయితే లేట్‌గా ఉద్యోగాలు సంపాదించుకున్న వారికి మాత్రం పింఛన్ రావాలంటే 30 ఏండ్ల సర్వీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి ఈ పెంచిన ఉద్యోగ రిటైర్మెంట్ వయసు ఉపయోగపడుతుంది. చిన్న వయసులోనే ఉద్యోగాలు సంపాదించుకున్న వారికి ఈ పెంచిన వయసు పెద్దగా సంతృప్తిని ఇవ్వడం లేదనే చెప్పాలి. ఈ యేడాది మార్చి నుంచి ఇది అమలవుతూ వస్తున్నది.

మొత్తంగా 20శాతం మంది ఉద్యోగులు యాభై ఎనిమిది ఏండ్లకే పదవి విరమణ చేస్తామని భౌతికంగా, మానసికంగా స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఆ తర్వాత స్వేచ్ఛ ఉండదనేది వీరి అభిప్రాయంగా ఉంటుంది. జీతం వస్తుంది కానీ.. అదే జీవితానికి పరమార్థం కాదనే భావనలో వీరున్నారు. ఓ 10 శాతం మంది మాత్రం నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నారు.

You missed