కేంద్రంలో కేసీఆర్‌కు చెడిందా? మొన్నటి వరకు ఉన్న సంబంధాలు చెడిపోయాయా? రాజకీయ అవసరాల కోసం లోపాయికారిగా సహకరించే స్నేహ హస్తం ఇకపై ఉండదా? పరిస్థితులు అలాగే కనిపిస్తుంది. మొన్న గంగులకు మైన్స్ వ్యాపారాలపై నజర్ పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరుగున పడిన డ్రగ్స్ కేసును తిరగదోడుతున్నది. ఏదో ఒక వంక దీన్ని తెరపైకి తెచ్చింది. మనీలాండరింగ్‌తో కవరింగ్ ఇచ్చి… కేసీఆర్‌కు కలరింగ్ ఇవ్వాలనుకుంటున్నది. చుక్కలు చూపించి మేము తలుచుకుంటే చూశావా? ఎలా ఉంటుందో?? అని చేసి చూపాలనుకుంటుంది. అదే చేస్తున్నది. గతంతో విచారణ చేసిన అధికారి శ్రీనివాస్‌కు కూడా విచారించింది ఈడీ.
ఈ రోజు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈడీ ముందు హాజరయ్యాడు. ఇక అందరి వంతూ వస్తున్నది. సినీ పరిశ్రమ అంతటినీ కాపాడుతున్న భరోసా ఇచ్చాడు కేసీఆర్. పెద్దలు కూడా కేసీఆర్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. టీఆరెస్‌కు వ్యతిరేకంగా పోవాలనే ఆలోచన వారిలో లేకండా చేయగలగడంలో కేసీఆర్ సక్సెసయ్యాడు. కానీ కేంద్రం .. మెల్లగా తన గుప్పిట్లో ఉన్న అధికారాలతో ఇక్కడి పరిస్థితులను గుప్పిట బిగించాలని చూస్తున్నది. కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్నది. కేసీఆర్ క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సంకేతాలు కేంద్రానికి చేరాయి. మొన్నటి వరకు కేంద్రంలో పాగా వేయడమే ప్రథమ కర్తవ్యంగా భావించిన బీజేపీ.. ఆ మేరకు కేసీఆర్‌తో కొంత సఖ్యతగానే వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందులో భాగమే ఈ డ్రగ్స్ కేసు తిరగదోడి, మానీలాండరింగ్ అనే సాకుతో మళ్లీ కెలకడం. ఒక అభద్రతాభావ పరిస్థితులను క్రియేట్ చేయడం. మేం తలుచకుంటే కేసీఆర్ నిమిత్తమాత్రుడు అని చెప్పే ప్రయత్నం చేయడం. బీజేపీ ఎంత స్ట్రాంగో నిరూపించుకునే అవకాశాలన్నీ వినియోగించుకోవడం. ఇప్పుడదే జరుగుతున్నది. ఇంకా మున్ముందు మరెన్ని చూపిస్తారో..!