హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిన హామీలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నది. వాటిని అమలు చేసేందుకు వ్యయ ప్రయా సాలు పడుతున్నది. ప్రజలను నమ్మించేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నది. అందులో భాగంగా వృద్ధుల పింఛన్ వయసును 65 నుంచి 57కు కుదించి ఇస్తామనే హామీ అమలు మేరకు దరఖాస్తులు స్వీకరించింది. 6,26,333 దరఖాస్తులు వచ్చాయి. మళ్లీ దీనిపై ఎంక్వైరీ ఉంటుంది. ఆ తర్వాత అర్హత జాబిత ప్రకటిస్తారు.
అమలు ఎప్పుడు చేస్తారో తెలియదు. అదేంటి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ? అని ఆశ్చర్యపోతున్నారా? దెబ్బలకు కొదవ లేదు కానీ డబ్బులకైతే కొరత ఉంది. నిధుల కొరతతో పాత పథకాలు పడకేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కానీ కేసీఆర్ మాత్రం కొంగొత్త పథకాలకు రెక్కలు తొడుగుతున్నాడు. కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాడు. ఊహాల లోకంలో విహరింపజేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ప్రభుత్వం వద్ద మూడేండ్లుగా అర్హత ఉన్న పింఛన్ దారుల ఫైల్ బుజు పట్టిపోయి ఉంది. వాటికి డబ్బులు లేవు. వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళలు, వృద్ధాప్య పింఛన్ల కోసం మూడేండ్ల క్రిందటే రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వీరు ఆసరాకు అర్హులేనని అధికారులు తేల్చారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. అర్హుల జాబితా జిల్లాల వారీగా పంపించారు. పంపించి మూడేండ్లు పూర్తి కావొస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పింఛన్ ఎప్పుడోస్తుందోనని రెండు లక్షల మంది అభాగ్యులు ఎదురుచూస్తున్నారు. కానీ వాటికి ఇప్పటి వరకు మోక్షం లేదు. వాటినే పట్టించుకోని కేసీఆర్ ఇక కొత్త పింఛన్లకు నిధులు ఎక్కడి నుంచి తెస్తాడు..? ఎప్పుడిస్తాడు.? దీనికి తోడు బీడీ కార్మికుల జీవనభృతి విషయంలో కూడా గతంలో హామీ ఇచ్చాడు.
2014 ఫిబ్రవరి 28లోపు పీఎఫ్ కలిగి ఉన్న బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు దాని ఊసు లేదు. నిజామాబాద్, కరీంనగర్, మెట్‌పల్లి.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో బీడీ కార్మికులు అధికంగా ఉంటారు. బీడీ కార్మికుల జీవనభృతికి చాలా మంది అర్హులుగా తేలుతారు. కరోనా నేపథ్యంలో ఖర్కానాలు మూతపడ్డాయి. కార్మికుల పరిస్థితి ఘోరంగా ఉంది. వర్ధి బీడీల పేరుతో బీడీ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. కానీ ఇవన్నీ కేసీఆర్‌కు పట్టవు. దళితబంధు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు పెట్టండి.. కానీ ఈ చిన్న చిన్న కష్టాలను కూడా తీర్చండి. వీరు కూడా దళితులు, బడుగు, బలహీన వర్గాలే. ఇదే చేయని ప్రభుత్వాన్ని ఏదో చేస్తదని ఎట్ల నమ్ముతారు?