పొద్దున్నే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అది ఎక్కడో తెలియదు. కాష్టం దగ్గర నుంచి ఓ పెద్దాయన సెల్ఫీ వీడియో తీసి గ్రూపులలో పంపాడు. దాని సారంశం ఏమిటంటే.. మాదిగోళ్లకు డప్పులకు పైసలిస్తే పైసలు మొత్తం తీసుకుని డప్పులు సరిగా కొట్టలేదని, కట్టెలు తెచ్చి కాష్టం పేర్చలేదని ఫిర్యాదు.
ఈ ఫిర్యాదు ఏవరికో కాదు ఏకంగా సీఎంకే. నీ దళితబంధు కింద పది లక్షలు ఇచ్చుడేమో కానీ ఈ ఎస్సీలు మా మాట ఇంటలేరు. ఏమన్నంటే కేసీఆర్ అంటున్నారు.. దళితబంధు అంటున్నారు.. పది లక్షలు అంటున్నారు. ఇలా అయితే ఈ పనులను చేసేదెవరూ.. మా మాట వినేదెవరూ.. కేసీఆర్ ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరేం చేస్తున్నారో? అని పాపం తెగ బాధపడిపోయాడు.
ఈ బాధ తనొక్కడిదే కాదన్నట్టు ఎస్సీలంతా ఆగమైపోయి మాట వినడం లేదనే సంగతిని కనిపెట్టి, భవిష్యత్తులో జరిగే ఉపద్రవాన్ని ముందే పసిగట్టి ఈ పెద్దాయన సీఎం దృష్టికి తీసుకువచ్చి, సమాజహితం కోసం పాటుపడుతున్నాడన్నమాట.