మీలో ఎవరు కోటిశ్వరుడు టెలివిజన్ గేమ్ షో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ ఆకట్టుకున్నది. గెస్ట్‌గా హాట్ సీట్‌పై రాంచరణ్ తేజ్‌తో జాలీగా.. ఆడుతూ.. పాడుతూ ఈ ఆటను రక్తికట్టించాడు. గంట ప్రోగ్రామే అయినప్పటికీ.. ఇద్దరితో ఒకరిని మించి ఒకరుగా పోటీ పడుతూ గేమ్ షోలో పాలుపంచుకుని వీక్షకులను రంజింపజేశారు. త్రిపుల్ ఆర్ సినిమాలో ఇద్దరవీ కీలక పాత్రలే. దాదాపుగా దీని చుట్టే వీరి మధ్య ఎక్కువ చర్చ జరిగింది. ప్రశ్నలు కూడా ఈ సినిమాల పరిధిలోనే ఎక్కువగా వేశారు. రాంచరణ్ ఈజీగా ఆన్సర్ చేసే ప్రశ్నలే అధికంగా ఉన్నాయి.ఆన్సర్ ఇచ్చే విషయంలో పెద్దగా ఉత్కంఠ లేదు.. కానీ మధ్యలో వీరి మధ్య వచ్చిన చర్చల్లో ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు.
గురువు గారు… అని కంప్యూటర్ ఉద్దేశించి తరుచు ఎన్టీఆర్ మాట్లాడటాన్ని… రాం చరణ్ అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే హాస్యభరిత సన్నివేశాలు, డైలాగులను గుర్తు చేయడంతో.. ఎన్టీఆర్ కూడా ఆ సినిమా సన్నివేశాలకు కనెక్టయ్యాడు. అప్పటి డైలాగులను వినిపించి సంతోషించాడు. ఆ తర్వాత సిడ్నీ నగరంపై వచ్చిన ఓ ప్రశ్నతో ఆరేంజ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. అందులో ప్రతీ పాట బాగుందని ఎన్టీఆర్ ప్రశంసించాడు
. పనిలో పని సంగీతం పై రాంచరణ్‌కు ఉన్న ప్రావీణ్యత గురించి వీక్షకులకు గుర్తు చేస్తూ ఓ సిడ్నీ నగరం పాట పాడాల్సిందిగా కోరడంతో .. ఇద్దరూ కలిసి ఈ పాటను కొద్ది సేపు హమ్ చేసి రంజింజేశారు. పవణ్ కళ్యాణ్ పాడిన పాటను కూడా ఓ ప్రశ్నగా పెట్టి.. అతనితో రాంచరణ్‌కున్న అనుబంధాన్ని విపులంగా వెలికితీయడంతో ఎన్టీఆర్ హోస్ట్‌గా సక్సెసయ్యాడు. పవన్ కళ్యాణ్ తనకు బాబాయే కాదు.. ఓ ఫ్రెండ్ కూడా అని రాంచరణ్ ఈ సందర్భంగా తన అనుభవాలను ఈ వేదికగా పంచుకున్న తీరు బాగా ఆకట్టుకున్నది.
పనిలో పనిగా సందర్భం వచ్చిన ప్రతీ సారి త్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎన్టీఆర్ ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ఇందులో వీరిద్దరు అల్లూరి సీతారామారాజు, కొమరంభీం గా నటించడం పూర్వజన్మ సుకృతమని కూడా చెప్పుకొచ్చాడు. కొమరం భీం కంటే అల్లూరి పెద్దవాడని చెప్పే క్రమంలో ఎన్టీఆర్ తడబడ్డాడు. ఎందుకంటే వీరిద్దరి చరిత్ర వేర్వేరు. కానీ సినిమాలో మాత్రం ఈ ఇద్దరి కలయిక తో కూడిక కల్పిత కథను ఎంచుకుని తెరకెక్కించారు. అందుకే ఇది చరిత్ర తెలిసిన వారికీ అంతుపట్టని కల్పిత సినిమాగా, పక్కా కమర్శియల్ సినిమాగా ఉండబోతుంది.
మొత్తానికి ఆరంభ ఎపిసోడ్‌లో ఇద్దరూ కలిసి హాయిగా ఆడుతూ పాడుతూ ముగించారు. రెండో ఎపిసోడ్ కూడా వీరికి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. మరీ నస పెట్టించేవిగా కూడా ఉండే అవకాశం ఉంది. త్రిపుల్ ఆర్ ను ప్రమోట్ చేసే ఎపిసోడ్లుగా కూడా ఇవి ఉండనున్నాయి.
