వెండితెర‌పై మ‌కుటం లేని మారాజు. కింది నుంచి పైకొచ్చిన‌వాడు. క‌ష్టాన్ని న‌మ్ముకున్న‌వాడు. ప్ర‌తిభ‌తో నెట్టుకొచ్చిన‌వాడు. పాత్ర‌లేవైనా త‌న ప్ర‌తిభ‌ మీదే న‌మ్మ‌కం ఉంచి.. మెల్ల‌మెల్ల‌గా ఇండ‌స్ట్రీలో త‌న స్థానం ప‌దిలం చేసుకున్న‌వాడు. ‘సుప్రీమ్ హీరో’ నుంచి ‘మెగాస్టార్‌’గా ఎదిగిన వాడు.. చిరంజీవి..

అత‌ను చాలా మందికి పెద్దదిక్కు. కొత్త త‌రం హీరోల‌కు రోల్ మోడ‌ల్‌. కానీ.. ఎన్టీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకొని ఆయ‌న‌లా ఓ వెలుగు వెల‌గాల‌నే ఆయ‌న క‌న్న కల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. అస‌లు ఎన్టీఆర్‌తో పోల్చుకోవ‌డ‌మే చిరంజీవి త‌న స్థాయికి మించి ఆలోచించ‌డం. అప్ప‌టి వ‌ర‌కు మ‌చ్చ‌లేని యాక్ట‌ర్‌గా వెండితెర‌పై వెలుగు వెలిగిన చిరంజీవికి రాజ‌కీయాలు ముళ్ల పాన్ప‌ని తెలుసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. కానీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆది నుంచి తీసుకున్న పొర‌పాట్లు, లోపాలు , ప‌క్క‌న చేరి ప‌క్క‌దారి ప‌ట్టించేవాళ్లు.. వాపును చూసి బ‌లుప‌ని భ్ర‌మింప‌జేసి బ‌జారుకీడ్చిన వైనాల‌న్నీ చూశాం. ప్ర‌జారాజ్యం పార్టీకి చివ‌ర‌కు త‌న సినిమా ఇండ్ర‌స్ట్రీ నుంచే అంద‌రి స‌పోర్టు దొర‌క‌లేదు. ‘అంద‌రివాడు’ కాదు.. “కొంద‌రివాడే’న‌ని త‌న‌కు తనే గిరి గీసుకునే సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకున్నాడు. వైకుంఠ‌పాళిలో నిచ్చెనైతే ఎక్కాడు కానీ, ఆ పైకి.. మ‌రింత పైకి ఎక్క‌డం సాధ్యం కాద‌ని తెలిసిపోయింది. పాముల‌కు బ‌లికాబోతున్నాననీ తెలిసిపోయింది. కానీ వెన‌క్కి వెళ్ల‌డానికి ఛాన్స్ లేదు. చావో రేవో తెల్చుకోవాల్సిందేన‌ని ముందుకే పోయాడు. చివ‌ర‌కు పాము కాటుకు బ‌లై కింద‌కు ప‌డిపోయాడు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ‘ఏపీ సీఎం’ కావాల‌నుకున్నాడు. ఖర్మ‌కాలి అదీ స‌హ‌క‌రించ‌లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఆశ‌లకు గండికొట్టింది. అస‌లు రాజ‌కీయ భ‌విష్య‌త్తే క‌నిపించ‌కుండా పోయింది. ఆ త‌ర్వాత తేరుకొని మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకున్నా.. ప్ర‌యోగాల జోలికి పోలేదు. సేఫ్ జోన్‌లో సేఫ్ గేమ్ ఆడాడు. రిస్క్ తీసుకోవ‌డాన్ని ‘చిరు’ ఎప్పుడో మానేశాడు. అందుకే ‘అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు’ ను న‌మ్ముకున్నాడు. మ‌రింత దిగ‌జారిపోయాడు.