రాజకీయం వేడెక్కింది. కరోనా థర్డ్‌వేవ్ పొంచివుందన్న ముప్పు కూడా వెంటాడుతుంది. ఇంకా పూర్తిగా భయం వీడలేదు. ఓ పక్కా కరోనా ఎప్పుడొస్తుందో తెలియక.. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న జనానికి.. బహిరంగ సభల ఆహ్వానాలు రా రమ్మని పిలుస్తున్నాయి. కరోనా ఎక్కడనో ఆమడ దూరం ఉందిలే.. తమ దరికి ఇప్పట్లో చేరదులే.. అని అనుకున్న జనాన్ని ఏకం చేస్తున్నాయి ఈ పబ్లిక్ మీటింగులు. గుమిగూడేలా గుంపులు కట్టిస్తున్నాయి. ఇచ్చే పదో పరకో ప్రాణాలను పణంగా పెట్టిస్తున్నాయి.
ఎక్కడో ఉన్న కరోనాను మననేతలే దగ్గరికి పిలిచి బహిరంగ సభల ద్వారా మనకంటించి ఇంటికి పంపిస్తున్నారు. ఎవరెటు పోతే వారికేం? వాళ్ల రాజకీయ అవసరాలు వాళ్లవి. వాళ్ల జన సమీకరణ సంఖ్యల లెక్కలు ముఖ్యం. ఎంత గుంపు తెచ్చుకోగలిగామనేది ప్రాధాన్యం. ఫోటోలకు ఎన్ని తలలు కనిపిస్తున్నాయనేది ఇంపార్టెంట్. తమ స్పీచ్‌లకు ఎన్ని చేతులు లేపి జేజేలు పలికాయనేది ప్రయార్టీ. కరతాళ ధ్వనులు చేసే వీనుల విందు వెరీవెరీ ఇంపార్టెంట్. అంతే. అంతకు మించి మన నేతలకు మరేమవుసరం లేదు.
వాళ్లకు రాజకీయాలు కావాలి. పై చేయిగా నిలవడం కావాలి. ఫోటోలకు ఫోజులు కావాలి. ఆ ఫోటోలకు అందం రావాలంటే జనాల గుంపు కావాలి. ఆ గుంపుకు అంటితే సంబంధం లేదు. అది వారి ఖర్మ. పిలవగానే ఎగేసుకు రావడమేనా? కాస్తైనా జాగ్రత్తగా ఉండాలి కదా? ముక్కుకు మాస్కులు తొడగాలి కదా? కనీస దూరం పాటించాలి కదా? అది కూడా చెప్పాలా? ఎప్పుడు మారుతారో జనాలు. నేతలను బద్నాం చేయడం తెలుసు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మేం పిలిచిన చోటుకు రండి. కరోనా వల్ల పనులు లేవు కాబట్టి ఇచ్చిన పదో పరకో మీకు కూడు పెడుతుంది.
భుజాల మీద ఎన్ని జెండాలైనా మోయండి. కండువాలు మార్చేస్తూ ఉండండి. జేజేలు కొట్టడం మానకండి. సభలకు వెళ్లి కరోనాను అంటించుకొండి. దీనికి మీరే కారణమంటూ.. మీ కోసం అహర్నిశలు ఆలోచించి పాటుపడే నేతలను ఆడిపోసుకోకండి.