మహా నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. ఆరోగ్య రాజధానిగా మన హైదరాబాద్. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది. మూడేండ్ల కింద కేసీఆర్ అసెంబ్లీలో ఈ మాట చెప్పాడు. అప్పుడు ఓ జర్నలిస్టుగా నేను ఈ టీఆరెఎస్ సోషల్ మీడియా పెట్టిన క్యాప్షన్‌తో అద్భుతమైన స్టోరీ ఇచ్చినట్లు గుర్తు. ఆ స్టోరీ చదివిన వారికి ఇక త్వరలోనే హైదరాబాద్ నలువైపులా పెద్ద పెద్ద సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానలు వచ్చేస్తున్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. మరి పెద్ద సారు చెప్పడం అలాగే ఉంటుంది. మీడియా దాన్ని మరింత రంగులు, హంగులు అద్ధి హైప్ చేసి రాయడమూ అలాగే ఉంటుంది.
ఇది మూడేండ్ల కింద ముచ్చట. అది కనీసం ఆచరణకు నోచుకోలేదు. అడుగు ముందుకు పడలేదు. మళ్లీ కేసీఆర్ ఆదేశించాడు. మంత్రులు, అధికారులు కదిలారు. స్థల సేకరణ పై కసరత్తు జరుగుతున్నది. బాగానే ఉంది. కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తుంటే.. మళ్లీ నేను రాసిన స్టోరే నాకు గుర్తొచ్చింది. ఆస్పత్రుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు.. ఆ పిమ్మటే వడివడిగా నిర్మాణాలైపోయి ఆస్పత్రుల సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఫోటోషాప్‌తో కనువిందుగా పోస్టింగ్ తయారు చేసి పెట్టారు.
ఈ వార్త రాసినప్పుడు నాకు అతిశయోక్తి అనిపించలేదు.. ఆశ్చర్యమూ కలగలేదు. కానీ ఇప్పుడు అప్పుడు రాసిన వార్త తలచుకుంటే నవ్వొస్తుంది. అప్పుడే ఆస్పత్రుల నిర్మాణాలు అవుతున్నట్లుగా రాసి సంబరపడ్డ నేను.. మూడేండ్ల తర్వాత మళ్లీ ఇది మొదటికి వచ్చి నా పాత రాతలే టీఆరెఎస్ సోషల్ మీడియా రాతలుగా కనిపిస్తున్నాయి. ఇవీ పూర్తి కావాలంటే ఎన్నేండ్లు పడుతుందో తెలవదు. అప్పటి వరకు ఇలా కమ్మటి, కనువిందు, అతిశయోక్తి, అద్భుత, సుందర, కమనీయ వార్తలు, ఫోటోలతో ఆరోగ్య రాజధానిగా హైదరాబాద్ మారిపోయిందని సంతోషించి సంబరం చేసుకోవాలె.
(దండుగుల శ్రీనివాస్)