ప్రశ్న: చలం గారి సాహిత్యంలో విచ్ఛలవిడి తత్వం ఎక్కువగా ఉంటుందట నిజమేనా.. ?
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
ప్రశ్న: చలం గారి సాహిత్యం అంత గొప్పదేం కాదటగదా. అందులో విచ్చలవిడి తత్వం ఎక్కువని అంటున్నారు. అప్పట్లో ఆయన నవలల ప్రభావం వల్ల చాలా మంది వివాహిత స్త్రీలు తమ భర్తలని వొదిలేసి పర పురుషులతో “లేచిపోవడం” కూడా జరిగింది అని విన్నాను. ఇవన్నీ నిజమేనా ?
జవాబు:
చలం సాహిత్యం యావత్తు (మొత్తానికి మొత్తం) గొప్పదని నేనడం లేదు. ఆయన రచనల్లోంచి మంచిని తీసుకుని చెడుని వదిలేయాలని అంటున్నాను.
ఆయన సాహిత్యంలో అసలు మంచే లేదు అని ఎవరన్నారు ? చలం గురించీ, ఆయన సాహిత్యం గురించీ ఏమాత్రం తెలియని వారు చెప్పే మాటలు అవి.
“చలం ఖచ్చితంగా స్త్రీ పక్షపాతి. స్త్రీలపై పురుషులు చేసే పెత్తనాన్ని ఆయన ఖండించాడు. స్త్రీలు, పరుషాధిక్యాన్ని ఎదిరించాలని కూడా ఆయన బోధించాడు. స్త్రీ – పురుషులు సమానులుగా మరియూ స్నేహితులుగా జీవించాలని చలం ప్రబోధించాడు.
కుటుంబ జీవితంలోనూ, వివాహ వ్యవస్థలోనూ, విద్యావిధానంలోనూ, పిల్లల పెంపకంలోనూ, ఇంకా అనేకానేక సామాజిక అంషాలలోనూ ఉండే ‘కపటత్వాన్ని’ చలం బట్ట బయలు చేశాడు.
“పెళ్ళి కానీ, కాకపోనీ ఒక స్త్రీకి ఒకే పురుషుడూ, అలాగే ఒక పురుషుడికి ఒకే స్త్రీ అనే సంబంధమే (మోనోగామస్ సొసైటీ సిస్టం) చాలా ఉన్నతమైనది, ఆదర్శ వంతమైనది” అని చలం అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాడు.
స్త్రీలకు ఎపుడూ ఇంటికి సంబంధించిన పనులు, పిల్ల పెంపకానికి సంబంధించిన పనులు మాత్రమే చేయుమని నిబంధనలు పెట్టడం చాలా అన్యాయం అంటాడు చలం.
మగవాడు, విచ్చలవిడిగా శృంగార జీవితం గడపితే తప్పుపట్టని మన సామాజిక వ్యవస్థ, ఆ విషయంలో స్త్రీలపై మాత్రమే ఆంక్షలు ఎందుకు విధించాలని ఆయన సంఘాన్ని, నిలదీసి ప్రశ్నిస్తాడు.
“పాతివ్రత్యంను” స్త్రీలపై రుద్దినప్పుడు, మగవాడిపై “ఏక పత్నీ వ్రత్యాన్ని” ఎందుకు రుద్ధలేదంటాడు చలం. స్త్రీలకొక న్యాయం, పురుషులకొక న్యాయం సరికాదంటాడు ఆయన.”
కాబట్టి చలం సాహిత్యం (మహిళల కోణంలో ఆలోచిస్తే) అందులో తప్పు బట్టాల్సిందేమీ లేదని నా అభిప్రాయం.
చలాన్ని తప్పు బట్టే వారు, చలం సాహిత్యాన్ని అసలు ‘చదివి’ ఉండరు,
లేదా ‘సరిగ్గా చదివి’ ఉండరు,
లేదా చదివినా ‘అర్థం చేసికొని’ ఉండరు,
లేదా అర్థం చేసికొన్నా.. (ఆ అర్థం చేసికొన్న) వారు, “మహిళలు ఆత్మ గౌరవంతో బ్రతకడాన్ని వ్యతిరేకిస్తూ, వారిని (మహిళల్ని) ఇంకా బానిసత్వంలోకి నెట్టేయ జూస్తున్న” ప్రగతి నిరోధకులై ఉంటారు. అలాంటి వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
[చలం సాహిత్యంపై మరింత లోతైన విశ్లేషణ కోసం.. రంగనాయకమ్మ గారి “చలం సాహిత్యం” పుస్తకం చదవండి]
— Rajeshwer Chelimela