అదే నిర్లక్ష్యం.. అవగాహన రాహిత్యం.. ఏమీ కాదులే అనే మితిమీరిన ఆత్మవిశ్వాసం. అధికారులపై గుడ్డి నమ్మకం. వారు చెప్పిందే కరెక్టనుకునే వెర్రితనం. వెరిసి… రెండు కరోనా వేవ్‌లు రాష్ట్ర ప్రజల ప్రాణాలు, జీవితాలతో ఆడుకున్నాయి. ఇంత జరిగిన మన సర్కారులో చలనం వచ్చిందా? జరిగిన దారుణాల నుంచి, పూడ్చలేని తీవ్ర నష్టాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నదా? ఏమో డౌటే. ఎందుకంటే … స్వయంగా సీఎం తనకు కరోనా వస్తే ఓ డోలో వేసుకున్న. ఓ యాంటిబయోటిక్ టాబ్లెట్ మింగిన కరోనా తగ్గిపోయింది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఏమీ కాదు. భయంతోనే చస్తున్నారు… లాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లడిండు. అదీ తీవ్ర ప్రాణనష్టం జరిగిన తర్వాత. ఇక చెప్పేదేముంది. మన పాలకుడి విజన్ ఎలా ఉందో.
ఇక అధికారుల తీరు చెప్పనవసరం లేదు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మొన్న మీడియా సమావేశంలో ఇక మేము అలిసిపోయాం.. మాకు రెస్ట్ ఇవ్వండి అనే దాకా వచ్చిండు. యథారాజ తథా ప్రజా కదా మరి. అధికారులకూ అలుసై పోయింది ప్రజలంటే. థర్డ్ వేవ్‌కు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సందర్భంలో మన సీఎం ఒక్కసారైనా ఈ మధ్య దీనిపై సమీక్షించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయన నజర్ అంతా హుజురాబాద్ పైనే ఉంది. లీడర్లు ఇంకా ఎవరు మిగిలి ఉన్నారా అని ఆలోచిస్తున్నాడు. హుజురాబాద్ ప్రజలకు ఇంకా ఏమేమి చెయ్యోచ్చు అని కూడా తీవ్రంగా మనాది పడుతున్నాడు. అసెంబ్లీలో ఓసారి బాధ్యత లేకుండా మాట్లాడి చులకన అయినా.. కరోనా విషయంలో మన సీఎం తీరు మారలేదు. రెండో వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న తరుణంలోనే కదా… వైద్య మంత్రిని పీకేసీ తన రాజకీయ దాహార్తికి తెరలేపింది. ఎవరెటు పోతే నాకేంది … రాజకీయాలే ముఖ్యం అనుకుంటే ఇలాగే ఉంటుంది.
గుడ్డిగా అధికారులను నమ్మితే పోయేది ప్రజల ప్రాణాలే. అలాంటి అధికారులు ఉన్నారు మరి మన దగ్గర. కరోనా లక్షణాలు కనబడితే స్థానికంగా ఏ లీడరూ కనబడడు. వారివీ ప్రాణాలే కదా మరి. థర్డ్ వేవ్ రాకముందే.. వచ్చినా అది ముదరకముందే చర్యలు తీసుకోండి. ఇంతకు ముందులా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చెయ్యకండి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలుతున్నది. ఇంత జరిగినా సర్కారు వైద్యం బలోపేతం పై మాత్రం కేసీఆర్ దృష్టిపెట్టడు. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆలోచిస్తాడన్న మాట. అంత దూరదృష్టి మన సర్కార్‌కు. డీహెచ్ శ్రీనివాసరావు అన్నట్టు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి … జాగ్రత్తలు పాటించండి.