నిన్న రాత్రి పది గంటల పదమూడు నిమిషాలకు..
ఒక మిత్రుడు వాట్సప్ గ్రూపులో..
“దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే” అని ఒక మెసేజ్ చేసిండు.
వాళ్ల దోస్తులతో ఎంజాయ్ చేస్తూ పెట్టిన ఫొటో.. మెసేజ్ అది.
అది చూస్తే నాకు మస్తు సంబురం అనిపించింది.
నిజంగా మచ్చలేని దోస్తులు కూడా ఉంటారు కదా అనిపించి.. ఎల్లకాలం గుర్తుండే ఒక దోస్తు గురించి చెప్పాలని అనిపించింది.
ఎందుకంటే ఇయ్యాల ఫ్రెండ్షిప్ డే కదా.!
అవును.. తాగేటప్పుడు.. డబ్బులను పోల్చుకున్నప్పుడు.. హోదాలను ఊహించుకున్నప్పుడు వెంట ఉండేవాడు మాత్రమే కాదు దోస్తాన్.
నీ మేలు కోరేవాడు.. నీ కష్టంలో కలసొచ్చినవాడు.. నీ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు కదా అసలైన మచ్చలేని దోస్తు అనిపించి ఒక దోస్తు గుర్తుకొచ్చాడు.
ఆయనే పుట్ట రమేశ్.
2010లో నమస్తే తెలంగాణ జర్నలిజం స్కూల్‌లో పరిచయమైండు.
నాకంటే ఏజ్‌లో పెద్ద. ఎక్స్‌పీరియన్స్‌లో పెద్ద. ఆలోచనల్లో కూడా పెద్దే.
అసలు నాకు రమేశన్న ఎట్లా జాన్ జిగిరి అయిండో తెల్వది.
బహుశా ఆయన నెమ్మదితనం వల్లనేమో అనుకుంటా.
ఎందుకంటే నేను ఎక్కువగా దోస్తాన్ చేసేది సైలెంట్‌గా ఉండేటోళ్లతోనే.
పైకి నేను గంభీరంగా కన్పిస్తా.
బాగా మాటకారిలా కన్పిస్తా.
లొల్లి లొల్లిగా ఉన్నట్లు కన్పిస్తా.
కానీ.. వాస్తవానికి నేను చాలా కూల్.
బాగా సైలెంట్.
బగ్గ నెమ్మది.
ఎవరన్న పిలిస్తెనే పలికే స్వభావం.
నాలెక్క ఉన్నోళ్లతోనే ఎక్కువ దోస్తాన్ చేస్తుంట.. అసొంటోళ్లతోనే ఎక్కువ బాండింగ్ ఏర్పడుతది.
అట్లా పరిచయమై.. క్లోజైన వ్యక్తి రమేశన్న.
ఆయన అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా వెల్ నోన్.
ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలగొట్టిన సమయంలో ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్లు “రమేశన్నా నమస్తే” అనడం నేను చూసిన.
చదువుకోవాలె.. ఎదగాలె అని చెప్తుండేటోడు.
ఆయన మోటివేట్ చేసిన వాళ్లెందరికో మంచి మంచి ఉద్యోగాలొచ్చినయి.
నన్ను కూడా కాంపిటీటివ్‌లోకి దింపే ప్రయత్నం చేసిండు.
డీఎస్సీ పడ్డప్పుడు లీవ్‌పెట్టమని.. ప్రిపేర్ అవ్వమని చెప్పడమే కాదు.. ఏకంగా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లిండు.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని అల్గునూరులో ఆశ్రయం.
నా దగ్గర వంద రూపాయలు కూడా లేని టైమ్.
ఖాళీ చేతులతో ఉన్నా.
పర్వాలేదు రా.. అని తీస్కపోయి బుక్స్ ఇప్పించి.. నేను ప్రిపేరైనన్ని రోజులు తిండిపెట్టి మంచిగ చూసుకున్నడు.
నేను టీచర్ ఉద్యోగం సంపాదించాల్నని నాకంటే రమేశన్నకే ఎక్కువుండేది.
వాళ్ల ఊరు సిరిసిల్లకు తీస్కపోయిండు.
ఆయన దోస్తులకు పరిచయం చేసిండు.
మొత్తమ్మీద ఒక తమ్ముడిని చూసినట్లు చూసిండు.
కానీ.. దురదృష్టవశాత్తు ఉద్యోగం రాలేదు.
అయినాగానీ.. నిరాశ చెందొద్దనీ మోటివేట్ చేసి.. “నీ దగ్గర సహజసిద్ధంగా వచ్చిన క్రియేటివ్ రైటింగ్ ఉంది.. నిన్ను అదే నడిపిస్తుంది.. డోంట్ వర్రీ” అని ఎంకరేజ్ చేసిండు.
ఏదీ ఆశించకుండా.. నేనెవరో కూడా కంప్లీట్గా తెలియకుండా.. దోస్తాన్ అనే ఒకే ఒక్క బాండింగ్ కోసం నా ప్రతీ అడుగునూ పరిశీలిస్తూ.. నా మేలును కాంక్షిస్తూ అర్సుకుంటడు రమేశన్న.
నేనేదో తమాషాగా “ఏ ఊకోవయా నువ్వా నాకు చెప్పేది” అని కామెడీ చేసినా కిక్కీక్కీ అని నవ్వి ఊకుంటడు తప్పితే.. “ఏం బల్సిందా వయా” అని ఒక్కమాట కూడా ఇప్పటివరకు అనలేదు.
నిజమే కదా..
మచ్చలేని దోస్తు అంటే నీ ప్లాట్ల భాగస్వామో.. ప్లేట్ల భాగస్వామో అయి ఉండాల్సిన అవసరం లేదు.
గ్లాస్మేటో.. క్లాస్మేటో కావాల్సిన పని లేదు.
నీ మనసు తెలిసిన వాడై ఉంటే చాలు అనిపించింది.
రమేశన్నా.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.. మచ్చలేని దోస్తాన్ అంటే నువ్వే అన్నా.!Daayi Sreeshailam
