ఎన్నికల హామీలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్… ఏడు నెలల క్రితం మొదటి విడత కిస్తీ కింద 25వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాడు. గత ఏడాది డిసెంబర్‌లో ఇవి ఖాతాల్లో పడ్డాయి. ఇప్పటి వరకు రెండో ఇన్ స్టాల్‌మెంట్ రాలేదు. ఆ వేసిన 25 వేలు కూడా పాత బాకీల కింద జమకట్టేసుకున్నాయి బ్యాంకులు. ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు కొంత మేలు జరిగేది. పాత బాకీలు ఉన్నా… అవి పోను కొన్ని చేతికొచ్చేవి. ఇప్పుడు 25వేలు ఖాతాలో మైనస్ చేసుకుని మిగిలిన బాకీని కూడా బ్యాంకులు కట్టించుకున్న తర్వాతే .. కొత్త రుణాలిస్తున్నారు. లోన్ రెన్యూవల్ చేసుకోకపోతే కొత్త రుణాలకు అవకాశం లేదు. ఈ మెలికతో రుణమాఫీ మొదటి కిస్తీ అసలు రైతుల చేతుల్లోకే రాలేదు. సరే ఎంతో కొంత వచ్చిందిలే . బాకీ కింద జమ అయి కొంతలో కొంత భారం తగ్గించారని అప్పటిమటుకు సరిపెట్టుకున్నారు. రెండో కిస్తీ కోసం చూశారు. అదింకా రాలేదు. ఇప్పట్లో వచ్చేటట్టు కూడా లేదు. రైతు బంధు ఇస్తున్నాం కదా.. దీంతోనే సరిపెట్టుకోండనే దోరణి కావచ్చు ప్రభుత్వానిది. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే కదా. ఇంకా నెరవేరలే.
మరోసారి ఎన్నికల హామీ కింద ఎవరైనా రైతు రుణమాఫీ అని ప్రకటిస్తే ఫక్కున నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. అంతలా దీనిపై నమ్మకం పోయింది. ప్రతీ ఎన్నికల్లో ఇది కూడా ఓట్లు రాల్చే ఓ హామీగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే గత ఎన్నికల మ్యానిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది. కేసీఆర్ లక్ష అన్నాడని, అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్, రాహుల్ గాంధీతో రెండు లక్షల రుణమాఫీ అని ప్రకటిస్తే పార్టీకి మేలు జరుగుతుందని, ఓట్లు రాలతాయని చెప్పి ఒప్పించాడు. కానీ ప్రజలప్పుడు కాంగ్రెస్‌ను నమ్మలేదు. ఒక లక్ష అన్న కేసీఆర్‌కు రెండో సారి అధికారం చేపట్టినా.. కరోనా ఆటంకాలు తగిలాయి. బడ్జెట్ తలకిందులైంది. ఇదే కాదు.. చాలా హామీలు ఇలాగే పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా దళిత బంధు అని కొత్త స్కీం తెరపైకి వచ్చి కొత్త వివాదాన్ని లేపింది. ఇది మాత్రం మ్యానిఫెస్టోలో లేదనుకుంటా.
