ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద 5 లక్షల రూపాయలను అందించే పథకం రైతుబీమా. గతంలో మాదిరిగా కాకుండా.. బాధిత కుటుంబాలకు సత్వరం ఈ బీమా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నది. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు దీని కోసం విడుదల కాలేదు.
అనుకున్న ఆదాయం లేదు. రాబడి లేకపోవడంతో ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంలను విడదల వారీగా చెల్లిస్తూ పోతున్నది. ఏ విడత ప్రీమియం డబ్బులు రాగానే వాటికి మాత్రమే బీమా కింద జనరేట్ చేసి నెంబర్లను పంపుతున్నారు. వారు మాత్రమే బీమా పరిధికి వస్తారన్నమాట. మిగిలినవన్నీపెండింగే.
సర్కారు ఎప్పుడు నిదులిస్తే అప్పుడు బీమా వర్తింపజేస్తుంది ఎల్ఐసీ. గత ఏడాది పోర్టల్ ఉన్న రైతులందరికీ సరిపడా ప్రీమియం మొత్తాన్ని సర్కార్ చెల్లించలేదు. దీంతో వచ్చిన డబ్బులకు మాత్రమే బీమా వర్తింపచేశారు. దీంతో చాలా మటుకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి రైతు కుటుంబాలకు చాలా మంది బీమా వర్తించలేదు. అవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వచ్చే బీమా డబ్బులు మాకెందుకు రావడం లేదని ఆ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అసలు సంగతి వారికి తెలియదు.
ప్రతీ ఏడాది ఆగస్టు 15 నుంచి కొత్త ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్నది. ఒక్కో రైతుకు రూ. 3,460 ప్రీమియం చెల్లిస్తుంది. 18 -59 ఏండ్ల రైతులు దీనికి అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులున్నారు. బీమా నిబంధనలకు వర్తించే వయసున్నవారు మాత్రం 36 లక్షల వరకున్నారు. దాదాపు ఇందులో 20 శాతం మందికి ఇంకా ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. దీంతో దాదాపు 7 లక్షల మంది వరకు రైతులకు బీమా వర్తించడం లేదు.
ఈ బీమా వర్తించకుండా పోయిన కుటుంబాల్లో రైతులు కొంత మంది చనిపోయారు. వారి బీమాను చెల్లించడం కుదరదు. ఈ ఆగస్టు 14తో ఏడాది ఒప్పందం ముగుస్తుంది. మళ్లీ 15 నుంచి కొత్తగా బీమా అమలులోకి రావాలంటే అర్హులైన వారందరికీ బీమా చెల్లించాలి. కానీ సర్కార్ వద్ద డబ్బుల్లేవు. ఈసారీ విడతల వారీగానే చెల్లించనుంది. వచ్చిన మొత్తానికే ఎల్ఐసీ బీమా వర్తింపజేస్తుంది. ఆలోపు బీమా వర్తించని కుటుంబాల్లో రైతులు చనిపోతే వారికి రైతుబీమా ఫలాలు అందవన్నమాట.

