దొడ్డు బియ్యం తినడం తగ్గుతున్నది. ఇప్పుడంతా సన్నబియ్యానికి అలవాటు పడ్డారు. హెచ్ఎంటీ, జైశ్రీరామ్, బీపీటీ బియ్యం తింటున్నారు. 30 రూపాయల కిలో నుంచి 60 కిలో ఉన్నా… వాటినే తింటున్నారు. ప్రభుత్వం ఓ వైపు రేషన్ కార్డులిస్తూ పోతున్నది. ఆహార భద్రత కార్డులని వీటికి పేరు పెట్టినా.. అందులో ఇస్తున్నది దొడ్డు బియ్యం మాత్రమే. దీన్ని ఇతర ప్రభుత్వ పథకాల లబ్ది కోసం అర్హత పొందేందుకు మాత్రమే పొందుతున్నారు తప్పితే.. నిజంగా దొడ్డు బియ్యం తినేందుకు కా దు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డులతో కలిసి మొత్తం 91 లక్షల వరకు కార్డులున్నాయి. ఇందులో పది శాతం వరకు అసలు దొడ్డు బియ్యమే తీసుకోవడం లేదట. మిగిలిన 90 శాతం మందిలో సగం మంది రేషన్ దుకాణాల్లో తీసుకున్న దొడ్డు బియ్యాన్ని తినడం లేదట. అంటే దాదాపు 40 లక్షల మంది రేషన్ బియ్యాన్ని తీసుకున్నా.. వారు ఆ బియ్యాన్ని తినడం లేదు. మరో పది లక్షల మంది వరకు రేషన్ దుకాణాల వైపే వెళ్లడం లేదట. మరి 40 లక్షల మంది తాము తీసుకున్న రేషన్ బియ్యాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు? బహిరంగ మార్కెట్‌లో కిలో 5 రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. ఇంటి వద్దకే వచ్చి వ్యాపారులు కొంటున్నారు. వీటిని ఇళ్ల వద్ద కొని 15 నుంచి 15 కిలో అమ్మేసుకుంటున్నారు. ఇవే బియ్యాన్ని పాలిషింగ్ చేసి సన్నబియ్యంగా రీసైక్లింగ్ చేసి కిలో 40, 50 వరకు అమ్మేసుకుంటున్నారు. ఇదీ జరుగుతున్న తంతు. కచ్చితంగా దొడ్డు బియ్యం తినే వారి సఖ్యం 40 లక్షల వరకు ఉంది.సబ్సిడీ బియ్యాన్ని అమ్మినా, కొన్నా కేసులు పెడతామని ప్రభుత్వం రెండేండ్ల కిందనే జీవో తీసుకొచ్చింది. అయినా ఈ దందా ఎక్కడా ఆగడం లేదు. ఈ పాస్ విధానం వచ్చిన తర్వాత రేషన్ డీలర్లకు పెద్దగా అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోయినా.. కార్డుదారులతో మాట్లాడి వారే ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంగా, కావేరీ రకం ధాన్యం వేస్తారు. ఇవి సన్నరకంగా ఉన్నా.. దొడ్డు రకం మద్దతు ధరనే ప్రభుత్వం ఇస్తుంది.వీటిని కొన్ని చోట్ల ధాన్యం కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు రైతులు. అలాంటి బియ్యం రేషన్ దుకాణాలకు వస్తే మాత్రం కార్డుదారులు ఎగబడి మరీ తీసుకుంటున్నారు. అంటే దొడ్డు బియ్యం అంటే చాలా మంది పేదవాళ్లు కూడా విముఖత చూపుతున్నారు. కానీ 1010 రకం దొడ్డు బియ్యంతో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభమని దీన్నే వేస్తారు రైతులు. దీనికే ప్రభుత్వం మద్దతు ధరను ఇస్తుంది. గ్రేడ్ ఏ, కామన్ వెరైటీలుగా చేసి కొనుగోలు చేస్తున్నది.
