తండ్రి చాటు బిడ్డ‌గా , తండ్రికి సినిమా రంగంలో ఉన్న ప‌రిచ‌యాల‌ను అడ్డం పెట్టుకొని హీరోగా వెలిగిపోదామ‌నుకున్న బెల్లం కొండ‌… ఇక్క‌డ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నా … ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌డం లేదు. వెండితెర‌ను విడ‌వ‌డం లేదు. నిర్మాత‌గా బెల్లంకొండ సురేష్ కొంతకాలం హ‌వా కొన‌సాగించాడు. అప్ప‌టి ప‌రిచ‌యాల‌తో త‌న కొడుకును పేద్ద హీరో చేద్దామ‌నుకున్నాడు. అప్ప‌టికే మంచి ఫామ్‌లో ఉన్న పెద్ద ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్‌తో అల్లుడు శీను తీశాడు. త‌న దైన శైలిలో పేరున్న న‌టుల‌తో సినిమా తీసినా అది యావ‌రేజ్‌గానే నిలిచింది. అక్క‌డ నుంచి ఫ్లాపుల వ‌రుస కొన‌సాగింది. సాక్ష్యం, జ‌య జాన‌కీ నాయ‌క‌, సీత‌, స్పీడున్నోడు, క‌వ‌చం… ఏదీ హిట్ కాలేదు. యావ‌రేజ్‌కు త‌క్క‌వే. డ‌బ్బింగ్ మూవీ రాక్ష‌సుడు ఒక్క‌టే కొంత న‌య‌మ‌నిపించింది స్టోరీ ప‌రంగా. న‌ట‌న ప‌రంగా కాదు. న‌ట‌న‌లో ఓన‌మాలు కూడా నేర్వ‌కుండానే మొన్న‌టి వ‌ర‌కు నెట్టుకొచ్చాడు బెల్లంకొండ‌. అయినా ప‌ట్టువ‌ద‌ల‌కుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న అల్లుడు అదుర్స్ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియ‌దు. తాజాగా త‌న ప్ర‌తిభ‌ను బాలీవుడ్‌లో చూపెట్టేందుకు రిస్క్ తీస‌కుంటున్నాడు. రాజ‌మౌళి తీసిన హిట్ సినిమా ఛ‌త్ర‌ప‌తిని వీవీ వినాయ‌క్ హిందీలో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తెర‌కెక్కించేందుకు రెడీ అయ్యాడు.